Telugu Global
NEWS

కాంగ్రెస్ కి చరిత్ర తప్ప భవిష్యత్తు లేదు.. బీజేపీవి విషం-విద్వేషం పాలిటిక్స్ -కేటీఆర్

కాంగ్రెస్‌ పార్టీ ఎక్స్ పయిరీ డేట్ అయిపోయిన మెడిసిన్ లాంటిదని, దానికి చరిత్ర తప్ప భవిష్యత్తు లేదని విమర్శించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. పార్టీ అధినేత రాహుల్ గాంధీని మూడు రోజుల పాటు విచారణ పేరుతో ఈడీ తీసుకెళ్లినా.. ఆ పార్టీలో ప్రశ్నించే దమ్ము ఎవరికీ లేదని ఎద్దేవా చేశారు. చావడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక పాడెక్కడమే తరువాయి అంటూ విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేటీఆర్.. […]

KTR-Congress-BJP
X

కాంగ్రెస్‌ పార్టీ ఎక్స్ పయిరీ డేట్ అయిపోయిన మెడిసిన్ లాంటిదని, దానికి చరిత్ర తప్ప భవిష్యత్తు లేదని విమర్శించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. పార్టీ అధినేత రాహుల్ గాంధీని మూడు రోజుల పాటు విచారణ పేరుతో ఈడీ తీసుకెళ్లినా.. ఆ పార్టీలో ప్రశ్నించే దమ్ము ఎవరికీ లేదని ఎద్దేవా చేశారు. చావడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక పాడెక్కడమే తరువాయి అంటూ విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు.

ఒక్క ఛాన్స్ కాదు.. 50 ఏళ్లు ఇచ్చాం..

కాంగ్రెస్ ఇప్పుడు ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అంటూ అడుగుతోందని, ఆ పార్టీకి ప్రజలు 50 ఏళ్లపాటు దేశాన్ని పాలించే అవకాశమిచ్చారని, కానీ ఏమీ చేయలేకపోయారని మండిపడ్డారు కేటీఆర్. భూమి పుట్టినప్పుడు పుట్టిన కాంగ్రెస్ కి చరిత్ర తప్ప భవిష్యత్తు సున్నా అని విమర్శించారు.

బీజేపీ విషం-విద్వేషం..

కాంగ్రెస్ కులపిచ్చి పార్టీ అయితే, బీజేపీ మత పిచ్చి పార్టీ అంటూ విమర్శించారు కేటీఆర్. బీజేపీ నేతలు దేశంలో విషం, విద్వేషం నింపేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అస్తవ్యస్త ఆలోచనలతో దేశాన్నే రావణ కాష్టంలా మార్చిందని అన్నారు కేటీఆర్. హిందూ-ముస్లింల మధ్య చిచ్చుపెట్టే మాటలు, మతాలను కించపరిచే చిల్లర మాటలు, పక్కవారిని పగవారిగా చూపించే ప్రయత్నాలు.. ఇలాంటి వ్యవహారాలు కాకుండా ఒక్కటైనా అర్థవంతమైన పని చేసిందా అని ప్రశ్నించారు కేటీఆర్.

బ్లాక్ మనీ ఏమైందీ మోదీజీ..?
మిత్రోం, భాయియోం, బహెనో.. ఆప్‌ సభీ లోగ్‌ జన్‌ ధన్‌ ఖాతా ఖోలో.. మై ధనాధన్‌ పంద్రాలాఖ్‌ ఇస్తా అన్న మోదీ.. ఇప్పుడేం చేస్తున్నారంటూ సెటైర్లు వేశారు కేటీఆర్. స్విస్‌ బ్యాంకు నుంచి నల్లధనం తెస్తానన్న మోదీ, ప్రతి ఒక్కరికీ 15 లక్షల రూపాయలు ఇస్తానన్న మోదీ, ఇప్పుడు నల్లధనం అంటే తెల్లమొహం వేసుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్.

దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కేసీఆర్‌ మార్క్‌ పాలన లేదని చెప్పారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతోంది చెప్పారు కేటీఆర్. అంతకు ముందు ట్విట్టర్లో కూడా బ్లాక్ మనీ వ్యవహారంలో ప్రధాని మోదీ టార్గెట్ గా ట్వీట్లు పెట్టారు కేటీఆర్. ‘మోదీజీ మీకో సువర్ణ అవకాశం. డబుల్‌ ఇంజిన్‌ ట్రిక్‌ చేసి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.30 లక్షలు జమ చేయండి’ అని ట్వీట్‌ చేశారు. గతంలో విదేశాల్లో బ్లాక్ మనీపై మోదీ చేసిన ప్రకటనలను గుర్తు చేశారు.

First Published:  19 Jun 2022 2:14 AM IST
Next Story