Telugu Global
NEWS

రేవంత్ చెలగాటం – సీనియర్లకు సంకటం!!

”మరో 11 నెలల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. దానికి నేనే నాయకత్వం వహిస్తా.”అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో దుమారం రేపుతున్నాయి. ”ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుర్రెలో పురుగు తిరిగింది.. ఎన్నికలకు పోవాలనుకుంటుండు. డిసెంబర్‌లోనే ఎన్నికల నగారా మోగుతుంది” అని కూడా ఆయన జోస్యం చెప్పారు. ఇదివరకు కూడా పలు సందర్భాలలో రేవంత్ రెడ్డి ”నేను” అని వ్యాఖ్యలు చేశారు. ఈ వైఖరి పార్టీలో మిగతా నాయకులకు, ప్రముఖులకు […]

congress-party-senior-leaders-obj
X

”మరో 11 నెలల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. దానికి నేనే నాయకత్వం వహిస్తా.”అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో దుమారం రేపుతున్నాయి. ”ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుర్రెలో పురుగు తిరిగింది.. ఎన్నికలకు పోవాలనుకుంటుండు. డిసెంబర్‌లోనే ఎన్నికల నగారా మోగుతుంది” అని కూడా ఆయన జోస్యం చెప్పారు. ఇదివరకు కూడా పలు సందర్భాలలో రేవంత్ రెడ్డి ”నేను” అని వ్యాఖ్యలు చేశారు. ఈ వైఖరి పార్టీలో మిగతా నాయకులకు, ప్రముఖులకు మింగుడు పడడం లేదు. 11 నెలల్లో అధికారం రానున్న సంగతెలా ఉన్నా తానే సర్వస్వము అనే పంథా సరైనది కాదని సీనియర్లు విమర్శిస్తున్నారు. ఎన్ని రకాలుగా పార్టీ అధిష్టానం చెప్పినా,సీనియర్లు అసంతృప్తిని వ్యక్తం చేసినా రేవంత్ వ్యవహారశైలిలో మార్పు రావడం లేదని వారంటున్నారు.

కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ వలె నడిపేందుకు ప్రయత్నిస్తున్నట్టు చాలా రోజులుగా విమర్శలున్నవి.ఆయన వ్యాఖ్యలు పలు మార్లు వివాదానికి గురవుతున్నవి. ”రెడ్ల” గురించి ఒక సభలో ఆయన చేసిన ప్రసంగం,వరంగల్ డిక్లరేషన్ అమలు బాధ్యత తనదేనని కొన్ని కార్యక్రమాల్లో ప్రకటనలు చేయడం పార్టీ సీనియర్లకు రుచించడం లేదు. 119 నియోజకవర్గాల్లో 60 కి పైగా స్థానాలు గెల్చుకోవడం ఆషామాషీ కాదని, సమష్ఠిగా కార్యక్రమాలు చేపట్టడం,ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు పకడ్బందీగా వ్యూహాలు రచించడం,కేసీఆర్ ఎత్తులను చిత్తు చేయడంపై కసరత్తు జరపవలసి ఉన్నదని,ఆ మేరకు కార్యాచరణ ప్రణాళికను అమలు చేయవలసి ఉన్నదని కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి,భట్టి విక్రమార్క వంటి వారు అభిప్రాయపడుతున్నట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నవి.

కేసీఆర్ ను గద్దె దింపాలన్న స్థాయిలో ‘కసి’ప్రజల్లో ఏర్పడలేదని, అయితే ప్రభుత్వం వివిధ అంశాల్లో విఫలమైన తీరుపై ఓటర్లలో నెలకొన్న వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలచుకోవలసి ఉందని కొందరు నాయకులు విశ్లేషిస్తున్నారు. దళితబంధు, డబుల్ బెడ్ రూమ్ వంటి హామీలు స‌రిగ్గా అమ‌లు చేయ‌క‌పోవ‌డంపై పెద్ద ఎత్తున ప్రచారానికి రూపకల్పన జరగవలసి ఉందంటున్నారు.కేసీఆర్ ‘కుటుంబపాలన’ నినాదం పాతబడిపోయిందని,అవినీతి నినాదం అసలు పనికి రాని ప్రచారాస్త్రంగా మారిపోయిందని ఒక వాదన బలంగా ఉన్నది.అవినీతి ప్రచారం పనిచేస్తే జగన్ 2019 లో అధికారంలోకి రావడం సాధ్యం కాకపోయేదని ఉదహరిస్తున్నారు.కనుక ఈ అంశాలు కాకుండా తాము అధికారంలోకి వస్తే ఎలాంటి పరిపాలన అందించగలమో,కేసీఆర్ కన్నా అద్భుతంగా అన్ని రంగాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాగలమన్న విషయాలను ప్రధానంగా ప్రస్తావించాలని కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెబుతున్నారు.

కాగా కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వాళ్ళు, కాంగ్రెస్‌ సభ్యత్వం ఉన్న వాళ్ళే ప్రభుత్వ సం క్షేమ పథకాలు పొందటంలో ముందు వరుసలో ఉంటారని రేవంత్ రెడ్డి హామీలు గుప్పిస్తున్నారు.వరంగల్ లో రైతు సంఘర్షణ సభలో ఇచ్చిన హామీల అమలు బాధ్యత తనదే అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ కొన్ని సమావేశాల్లో అన్నారు.సాధారణంగా ఎలాంటి సంక్షేమ పథకాలు అయినా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం అమలుచేస్తుంది.తెలంగాణలో కేసీఆర్ అయినా,పొరుగున ఆంధ్రప్రదేశ్ లో జగన్ అయినా అదే విధానంతో వెళుతున్నారు.గతంలో పాలించిన పార్టీలు,ముఖ్యమంత్రులు సైతం తమ పార్టీ కార్యకర్తలకు మాత్రమే పథకాలు వర్తిస్తాయని ఎన్నడూ చెప్పలేదు.మరి రేవంత్ రెడ్డి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియక కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.

గాంధీ కుటుంబం జోలికొస్తే అంతు చూస్తామని హెచ్చరించడం ద్వారా పార్టీ హైకమాండ్ దగ్గర మార్కులు కొట్టివేసే ప్రణాళికను రేవంత్ అమలు చేయాలనుకుంటున్నారు.పైగా గాంధీ కుటుంబానికి కష్టమొస్తే అందరికీ వచ్చినట్లేనని ఎట్లా భావించాలి? ఎందుకు భావించాలి? సీబీఐ,ఈ.డి,ఐ.టీ.. వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను అదివరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు దుర్వినియోగం చేయలేదా? ఆయా సంస్థలు నిస్పాక్షికంగా దర్యాప్తు చేసే స్వేచ్ఛను ఇచ్చారా? అనే ప్రశ్నలు రావడం సహజం.ప్రస్తుతం బీజేపీ కూడా కాంగ్రెస్ దారిలోనే ప్రయాణిస్తున్నది.2014 నుంచి తన రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ తీయడానికి వారి ఆర్ధిక మూలలను చిన్నాభిన్నం చేయడానికి మోదీ చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. గాంధీ కుటుంబాన్ని చూస్తే మోదీకి తడిసిపోతుందని, అం దుకే పాత కేసులు తిరగదోడి ఈడీ ద్వారా సోనియా, రాహుల్‌లకు నోటీసులు ఇప్పిస్తున్నారని రేవంత్‌ విమర్శిం చారు. గాంధీ కుటుంబం జోలికొస్తే అంతు చూస్తామని, బీజేపీని బట్టలూడదీసి కొడతామన్నారు.

వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యమంటున్న కాంగ్రెస్.. వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై 15వ తేదీన అఖిలపక్ష సమావేశాన్నీ తలపెట్టారు. ఈ సమావేశానికి బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలను కూడా ఆహ్వానించనున్నారు.గాంధీ భవన్ చుట్టూ తిరిగితే పదవులు రావని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు.ఎవరెవరు పనిచేస్తున్నారో ఏఐసీసీకి నివేదికలు ఎప్పటికప్పుడు వెళ్తున్నాయని ఆయన అన్నారు.

అభ్యర్థుల ఎంపికలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని,టిఆర్ఎస్ తో సంబంధాలున్నట్టు అనుమానించే వ్యక్తులెవరికీ టికెట్టు ఇవ్వరాదని చెబుతున్నారు.ఇక వివిధ జిల్లాల్లో ‘గ్రూపు’ ల సంస్కృతి కాంగ్రెస్ గెలుపును ప్రభావితం చేయనుందన్న అభిప్రాయం బలంగా ఉన్నది.

First Published:  12 Jun 2022 8:14 PM GMT
Next Story