Telugu Global
WOMEN

చేతుల్లేని యువతికి డ్రైవింగ్ లైసెన్స్.. అదీ ముఖ్యమంత్రి చేతులమీదుగా..

కేరళలోని ఇడుక్కికి చెందిన జిలుమోల్ మేరియట్ థామస్ తన ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏళ్ల తరబడి వేచి చూసింది.

చేతుల్లేని యువతికి డ్రైవింగ్ లైసెన్స్.. అదీ ముఖ్యమంత్రి చేతులమీదుగా..
X

అసాధ్యం అనుకున్న ఒక పనిని తన పట్టుదలతో సుసాధ్యం చేసింది ఒక యువతి. అన్ని అవయవాలూ ఉండి, అసమర్ధులమని బాధ పడేవారికి స్ఫూర్తిదాతగా నిలచింది. తనను చూసి నవ్వినవాళ్లే నివ్వెరపోయేలా చేసింది. పుట్టకతోనే రెండు చేతులూ లేని మారియట్ దృఢ సంకల్పంతో ఫోర్ వీలర్ లైసెన్స్ పొందింది.

కేరళలోని ఇడుక్కికి చెందిన జిలుమోల్ మేరియట్ థామస్ తన ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏళ్ల తరబడి వేచి చూసింది. ఇప్పుడు లైసెన్సు పొందిన ఆసియా తొలి మహిళగా కేరళ ప్రభుత్వం ఆమెను సత్కరించింది.ఏకంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయానా ఆమెకు లైసెన్స్ అందించారు. ఆరేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత , యాదృశ్చికంగానే అయినా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రోజున ఆమె లైసెన్స్ అందుకుంది.

కేరళ రాష్ట్రం కొచ్చికి చెందిన జిలుమోల్ మారియట్ అనే మహిళకు పుట్టుకతోనే చేతుల్లేవు. అయినా సరే దృఢ సంకల్పంతో జీవితంలో ఎదగాలనుకుంది. రెండు చేతులు లేకపోయినా కాళ్ళతోనే తల దువ్వుకోవడం, అన్నం తినడం, ఇంటి పనులు చేసుకోవడంతో సహా తన ఇతర పనులను చేయటం అలవాటు చేసుకుంది. అదే సంకల్పంతో కంప్యూటర్ ను నేర్చుకోవడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. గ్రాఫిక్ ఆర్ట్ డిజైనర్ గా మారింది. అలాగే డ్రైవింగ్ నేర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె కలను నిజం చెయ్యడానికి కొచ్చికి చెందిన స్టార్టప్ సంస్థ Vi ఇన్నోవేషన్ కొత్త ప్రయోగం చేసింది. మారియట్ కు తగినట్టు కారు ఆపరేటింగ్ సిస్టమ్ లో మార్పులు చేసింది. వైపర్లు, హెడ్ ల్యాంప్, వాయిస్ కమాండ్ లతో పని చేసేలా వాహనంలో మార్పులు చేసింది. దీంతో ఆమె కాళ్లతోనే కారును సునాయాసంగా నడుపుతుంది. అయినా సరే ఆర్టీఏ అధికారులు డ్రైవింగ్ లైసెన్స్ నిరాకరించారు.

దీంతో ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు జోక్యం తర్వాత, థామస్ ఒక పరీక్షలో పాల్గొని, MVD అధికారుల ముందు తన మోడిఫైడ్ కారును నడిపింది. అయినా అధికారులు ఆమెకు లైసెన్స్ ఇచ్చేందుకు నిరాకరించారు. చివరగా రాష్ట్ర వికలాంగుల కమిషన్‌ను ఆశ్రయించింది. ఇండోర్‌కు చెందిన విక్రమ్ అగ్నిహోత్రి, డ్రైవింగ్ లైసెన్స్ పొందిన భారతదేశంలో చేతులు లేని మొదటి వ్యక్తి అని కమిషన్ ఉదాహరణగా పేర్కొంది. దీన్ని అనుసరించి, ఎట్టకేలకు మారియట్ ఈ సంవత్సరం లైసెన్స్ పొందగలిగింది. ఇప్పుడు భారత్ లోనే కాదు.. ఆసియా మొత్తం మీద చేతులు లేకపోయినా సరే ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ఏకైక మహిళగా జిలుమోల్ మేరియట్ థామస్ రికార్డులలోకి ఎక్కింది.

First Published:  5 Dec 2023 10:58 PM IST
Next Story