Telugu Global
WOMEN

మహిళలే ఎక్కువకాలం జీవిస్తున్నారు...

దేశంలోని చాలా రాష్ట్రాల్లో మగవారికంటే మహిళల అంచనా జీవితకాలమే ఎక్కువగా ఉన్నదని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఇటీవల విడుదల చేసిన ‘ ఇండియా ఏజింగ్ రిపోర్టు 2023’ వెల్లడించింది.

మహిళలే ఎక్కువకాలం జీవిస్తున్నారు...
X

దేశంలోని చాలా రాష్ట్రాల్లో మగవారికంటే మహిళల అంచనా జీవితకాలమే ఎక్కువగా ఉన్నదని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఇటీవల విడుదల చేసిన ‘ ఇండియా ఏజింగ్ రిపోర్టు 2023’ వెల్లడించింది. ఈ సంస్థ వెల్లడించిన గణాంకాలను బట్టి అరవై సంవత్సరాల వయసున్న మహిళల జీవితకాలాన్ని అంచనా వేసినప్పుడు అది మగవారి జీవితకాలం కంటే ఎక్కువగా ఉన్నట్టుగా తేలింది. రాజస్థాన్, హర్యానా, గుజరాత్, ఉత్తరాఖండ్, కేరళ, హిమాచల ప్రదేశ్, జమ్ము కాశ్మీర్ లలో అరవై సంవత్సరాల వయసున్న మహిళల తదుపరి జీవితకాలాన్ని ఇరవై సంవత్సరాలకంటే ఎక్కువగా అంచనా వేశారు.

సాధారణంగా మనదేశంలో అరవై సంవత్సరాల వయసున్న వ్యక్తుల... తరువాత జీవితకాలాన్ని 18.3 సంవత్సరాలుగా అంచనా వేయగా ఇది మహిళల విషయంలో 19 సంవత్సరాలుగా, మగవారి విషయంలో 17.5 సంవత్సరాలుగా ఉంది. వ్యక్తులు స్త్రీలా, పురుషులా, ఆ సమయంలో దేశంలో ఏ వయసులో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి... అనే అంశాల ఆధారంగా జీవితకాలాన్ని అంచనా వేస్తారు. మనదేశంలో 2022 జూన్ ఒకటి నాటికి అరవై సంవత్సరాలు దాటిన వారి సంఖ్య 149 మిలియన్లు అంటే... దేశ జనాభాలో సుమారు 10.5శాతంగా ఉంది. ఈ సంఖ్య 2050నాటికి 20.8శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

మనదేశంలో జీవితకాలాన్ని అంచనా వేసేటప్పుడు వారు ఏ రాష్ట్రంలో జీవిస్తున్నారు, గ్రామాల్లోనా లేదా నగరాల్లోనా ఎక్కడ నివసిస్తున్నారు, వారు ఆడా లేదా మగా... అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని జీవితకాలాన్ని అంచనా వేస్తారు. 1970-75 మధ్యకాలంలో...శిశువు పుట్టగానే అంచనా వేసే జీవితకాలం 49.7 సంవత్సరాలుగా ఉండేది. 2014-18 నాటికి అంచనా జీవితకాలం 69.4 సంవత్సరాలకు చేరింది. 1970-90ల మధ్యకాలంలో సంవత్సరానికి రెండునుండి మూడేళ్లు అంచనా జీవితకాలం పెరగగా, గత దశాబ్దకాలంగా మాత్రం 0.4 సంవత్సరాలు మాత్రమే ఇది పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

మనదేశంలో శిశుమరణాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పుట్టిన బిడ్డ మొదటి సంవత్సరంలో మరణం బారిన పడకుండా ఉంటే చాలు... చాలావరకు 70 ఏళ్ల జీవితకాలాన్ని అంచనా వేయవచ్చంటున్నారు నిపుణులు. డెభై ఏళ్లు జీవించిన వారు మరో పదేళ్లు జీవించే అవకాశం ఉంటుంది. అయితే బీహార్, చత్తీస్ ఘడ్ లలో మాత్రం డెభై ఏళ్ల జీవితకాలాన్ని అంచనా వేస్తే.. పది తగ్గిపోయి అది అరవైఏళ్లకు చేరటం కనబడుతోంది.

భారతదేశంలో నగరాల్లో నివసించే మహిళలు ఎక్కువకాలం జీవిస్తున్నారు. కేరళ, ఉత్తరాఖండ్ లలో మాత్రం నగరాల్లో నివసించే స్త్రీలకంటే గ్రామాలలో నివసించే వారు కొంచెం ఎక్కువకాలం జీవిస్తున్నారు. 2014-2018 లెక్కల ప్రకారం భారతదేశపు సగటు జీవితకాలం 69.4 సంవత్సరాలు. ఎనిమిది రాష్ట్రాల్లో అంచనా జీవితకాలం సగటు కంటే తక్కువగా ఉంది. ఆ రాష్ట్రాలు ఒడిషా, జార్ఖండ్, బీహార్, రాజస్థాన్, అసోం, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, చత్తీస్ ఘడ్ లు. ఇక జార్ఖండ్, బీహార్ లలో తప్ప దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ మగవారికంటే మహిళల జీవితకాలమే ఎక్కువగా ఉంది.

హిమాచలప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళలలో మగవారి జీవితకాలానికి, మహిళల జీవితకాలానికి మధ్య తేడా ఎక్కువగా ఉంది. హిమాచల ప్రదేశ్ లో నగరాల్లో నివసించే మహిళల సగటు జీవితకాలం 80.6 సంవత్పరాలు కాగా ఇదే రాష్ట్రంలో గ్రామాల్లో నివసించే మగవారి సగటు జీవిత కాలం 69.2 సంవత్సరాలు మాత్రమే ఉంది. అసోం, జమ్ము కాశ్మీరుల్లో కూడా పట్టణాలు నగరాల్లో నివసించే స్త్రీలకు, గ్రామాల్లో నివసించే మగవారికి సగటు జీవితకాలంలో సుమారు పదేళ్లు తేడా ఉంది.

First Published:  4 Oct 2023 5:26 PM IST
Next Story