మేకప్ లేకపోయినా.. అందంగా కనిపించాలంటే..
చాలామంది అమ్మాయిలకు బయటకు వెళ్లేటప్పుడు మేకప్ వేసుకునే అలవాటు ఉంటుంది.
చాలామంది అమ్మాయిలకు బయటకు వెళ్లేటప్పుడు మేకప్ వేసుకునే అలవాటు ఉంటుంది. అయితే బిజీగా ఉన్నప్పుడు కొన్నిసార్లు మేకప్ వేసుకోవడం కుదరకపోవచ్చు. లేదా మేకప్ అలవాటును పూర్తిగా మానేయాలని కూడా అనుకోవచ్చు. మరి అలాంటప్పుడు అందంగా కనిపించేందుకు ఎలాంటి టిప్స్ పాటించాలంటే..
మేకప్ లేకుండా కూడా అందంగా కనిపించొచ్చు. దానికోసం కొన్ని రోజువారీ అలవాట్లను మార్చుకోవాలి. ముఖానికి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ లాంటివి తరచూ రాస్తుండడం ద్వారా చర్మం పొడిబారకుండా ఉంటుంది. మేకప్ లేకపోయినా చర్మం సున్నితంగా, మృదువుగా ఉంటుంది.
రోజువారీ ఆహారంలో ఫ్రూట్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం సహజంగానే మెరుపును సంతరించుకుంటుంది. ఎప్పుడైనా మేకప్ లేనప్పుడు ముఖం డల్‌గా కనిపించదు.
ప్రతిరోజూ ఉదయం గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల చర్మంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఫలితంగా చర్మానికి నిగారింపు వస్తుంది.
చర్మంపై ఉండే మృత కణాల వల్ల ముఖం డల్‌గా కనిపిస్తుంది. అందుకే అప్పుడప్పుడు ఎక్స్‌ఫోలియేషన్ లేదా స్క్రబ్ లాంటివి చేసుకుంటుండాలి. వారానికి రెండు సార్లయినా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఫేస్ వాష్ చేసుకున్న ప్రతీసారి ముఖానికి టోనర్‌ను అప్లై చేయడం వల్ల ముఖంపై పీహెచ్ లెవల్స్ బ్యాలెన్స్ అయ్యి, చర్మం తాజాగా ఉంటుంది.
ఇక అన్నింటికంటే ముఖ్యంగా చర్మం నిగారింపుకి నిద్ర ఎంతగానో అవసరం. రోజుకి కనీసం ఎనిమిది గంటలైనా నిద్ర పోయేలా చూసుకోవడం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీని వల్ల ముఖం బ్రైట్‌గా, అందంగా కనిపిస్తుంది.
రోజూ నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తాగడం వల్ల చర్మం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. మేకప్ లేకపోయినా చర్మం తాజాగా, తేమ కలిగి ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చర్మంపై ముడతలు రాకుండా చూసుకోవచ్చు.
ఇకపోతే మేకప్ వేసుకునే టైం లేనప్పుడు కనీసం లిప్ బామ్, మాయిశ్చరైజర్ లాంటివైనా వాడాలి. ఇవి చర్మాన్ని పాడవకుండా కాపాడతాయి.