Telugu Global
WOMEN

బ్రెస్ట్ క్యాన్సర్.... 30శాతం కేసులే తగిన సమయంలో నిర్ధారణ

బ్రెస్ట్ క్యాన్సర్ ఇతర అవయవాలకు పాకకుండా ఆ చోట మాత్రమే ఉన్నపుడు జబ్బు నిర్ధారితమవుతున్న కేసులు మనదేశంలో కేవలం 30శాతం ఉంటున్నాయి.

బ్రెస్ట్ క్యాన్సర్.... 30శాతం కేసులే తగిన సమయంలో నిర్ధారణ
X

క్యాన్సర్ ని తొలిదశలో గుర్తిస్తే... దానిని పూర్తిగా నయం చేసి ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు పదేపదే చెబుతుంటారు. మనదేశంలో రొమ్ము క్యాన్సర్ విషయంలో ఇది చాలా తక్కువ స్థాయిలో జరుగుతున్నదని గణాంకాలు చెబుతున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఇతర అవయవాలకు పాకకుండా ఆ చోట మాత్రమే ఉన్నపుడు జబ్బు నిర్ధారితమవుతున్న కేసులు మనదేశంలో కేవలం 30శాతం ఉంటున్నాయి.

బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన స్త్రీలలో... 59శాతం మందిలో... జబ్బు శరీరంలో బ్రెస్ట్ కి సమీపంలో ఉన్న లింఫ్ నాడులకు కూడా వ్యాపించిన తరువాత నిర్ధారితమవుతోంది. అంతకంటే బాధపడాల్సిన విషయం ఏమిటంటే.... పదకొండు శాతం మందిలో బ్రెస్ట్ కి దూరంగా ఉన్న అవయవాలు ఊపిరితిత్తులు, లివర్, ఎముకలకు కూడా వ్యాపించిన తరువాత వ్యాధి నిర్థారణ జరుగుతోంది. జామా ఆంకాలజీ అనే జర్నల్ లో ప్రచురితమైన నూతన అధ్యయన ఫలితాలు ఈ వివరాలను వెల్లడించాయి.

మొట్టమొదటిసారి ప్రపంచంలోని 81దేశాల్లో.... రొమ్ము క్యాన్సర్ ఏ దేశంలో ఏ దశలో నిర్దారితమవుతోంది... అనే అంశంపై చేసిన పరిశోధన ఇది. ఇంటర్నేషనల్ ఏజన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ అనే సంస్థ... రొమ్ము క్యాన్సర్ బారిన పడిన 20 లక్షలమంది మహిళల వివరాల ఆధారంగా ఏ దశలో వారిలో వ్యాధి నిర్దారితమైంది అనే అంశాన్ని తెలుసుకుంది. సుమారు 30 ఏళ్లకు పైగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.

మనదేశంలో బెంగళూరులోని ఐసిఎమ్ ఆర్-ఎన్ సిడిఐఆర్ ల అనుసంధానంతో ఈ అధ్యయనం జరిగింది. వ్యాధిని నిర్ధారించే వైద్య సదుపాయాలు పూర్తిగా ఉన్న 28 ప్రాంతాలనుండి గణాంకాలను సేకరించారు. చిన్న వయసు, నడి వయసులో వారికంటే పెద్ద వయసు వారిలో క్యాన్సర్ అడ్వాన్స్డ్ దశలో నిర్దారితమవుతున్నని ఐసిఎమ్ ఆర్-ఎన్ సిడిఐఆర్ డైరక్టర్ డాక్టర్ ప్రశాంత్ మాథుర్ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కంటే అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాల్లో క్యాన్సర్ చివరి దశల్లో నిర్ధారితమవుతున్న కేసులు ఎక్కువగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. మహిళల ప్రాణాలకు ముప్పుగా మారిన క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంది. త్వరగా గుర్తించడం, నిర్ధారించడం వలన పూర్తిగా నయం చేసి, ప్రాణాలను కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఇంటర్నేషనల్ ఏజన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వెల్లడించింది.

ఈ మధ్య కాలంలో 20-40 ఏళ్ల మధ్య వయసున్న వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా కనబడుతున్నదని వైద్యులు అంటున్నారు. ఇది మరింత ఆందోళన కలిగించే విషయం. ఇరవైల చివరి, ముప్పయిల మొదటి సంవత్సరాల వయసులో ఉన్న స్త్రీలలో క్యాన్సర్ మరింత ఎక్కువగా కనబడుతున్నట్టుగా తెలుస్తోంది. దాంతో ఇరవై సంవత్సరాలు దాటిన యువతులు కూడా క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని గురుగ్రామ్ లోని సికె బిర్లా హాస్పటల్ లో ఆంకాలజీ కన్సల్టెంట్, బ్రెస్ట్ సెంటర్ హెడ్ గా ఉన్న డాక్టర్ రోహన్ ఖండేల్వాల్ సూచిస్తున్నారు.

రొమ్ముల్లో గడ్డలు, ఆకారం తీరులో మార్పులు, చర్మంలో తేడాలు, బ్రెస్ట్ నుండి స్రావాలు ... లాంటివి కనబడితే అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ లక్షణాలన్నీ క్యాన్సర్ కాని అనారోగ్యాల్లో కూడా కనిపించవచ్చు. అనుమానం ఉన్నపుడు వైద్యులచేత పరీక్ష చేయించుకుని మనశ్శాంతిని, అవసరమైతే చికిత్సని పొందటం మంచిది.

First Published:  13 Nov 2023 5:26 PM IST
Next Story