భవిష్యతంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుదీర్ఘ అనుబంధం ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి
![భవిష్యతంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే భవిష్యతంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే](https://www.teluguglobal.com/h-upload/2025/02/13/1403007-cm-revanth.webp)
రాష్ట్ర ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. నగరంలోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌ను మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్- మైక్రోసాఫ్ట్‌కు సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. తాజా విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు రానున్నాయన్నారు. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్‌ను ప్రారంభించుకోవడం మనందరికీ గర్వకారణమని అన్న సీఎం హైదరాబాద్ జర్నీలో ఇదో మైలురాయిగా అభివర్ణించారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకున్నదని వెల్లడించారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే అన్నారు. మైక్రోసాఫ్ట్ కృషితో 500 పాఠశాలల్లో ఏఐని వినియోగిస్తూ బోధన కొనసాగుతున్నదన్నారు.. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉన్నది. మాపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ ప్రతినిధులకు ధన్యవాదాలు. హైదరాబాద్ అనేది విశ్వనగరమని, పెట్టుబడులకు గమ్యస్థానం అన్నారు. తెలంగాణ డిజిటల్ లైఫ్‌లో మైక్రోసాఫ్ట్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. హైదరాబాద్ మైక్రోసాఫ్ట్‌నే కాకుండా గ్లోబల్ లీడర్స్‌ను అందిస్తున్నదని అన్నారు. హైదరాబాద్‌లో ఏఐ సెంటర్ ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.