రాష్ట్రంలో కొత్త బస్టాండ్ల నిర్మాణానికి టీజీఎస్ఆర్టీసీ పచ్చజెండా
తెలంగాణలో పలు కొత్త బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం, విస్తరణకు టీజీఎస్‌ఆర్టీసీ అనుమతినిచ్చింది.
రాష్ట్రంలో పలు నూతన బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం, బస్ స్టేషన్ల విస్తరణకు ఆర్టీసీ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ బస్ భవన్‌లో ఇవాళ ఆర్టీసీ బోర్డు సమావేశమైంది. తెలంగాణలో కొత్త డిపోల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న 97 డిపోలు, బస్ స్టేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మహాలక్ష్మీ స్కీమ్ కారణంగా ఆర్టీసీ బస్సుల్లో పెరిగిందని.. దీనికి అనుగుణంగా కొత్త బస్ స్టేషన్ల నిర్మాణంతో పాటు ఉన్న వాటిని విస్తరిస్తామని పేర్కొన్నారు. బోర్డు అనుమతి లభించిన నూతన డిపోలు, బస్ స్టేషన్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులను మంత్రి ఆదేశించారు.
పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లిలో కొత్త బస్ డిపో కోసం నిర్మాణం కోసం 11.70 కోట్లు, ములుగు జిల్లా ఏటూరునాగారంలో కొత్త బస్ డిపో నిర్మాణం కోసం 6.28 కోట్లు, ములుగు లో కొత్త బస్ స్టేషన్ నిర్మాణం కోసం 5.11 కోట్లు, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో కొత్త బస్ స్టేషన్ కోసం 3.75 కోట్లు కేటాయిస్తూ అనుమతులు ఇచ్చింది. అలాగే ఖమ్మం జిల్లా మధిరలో ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం 10 కోట్లు, ములుగు జిల్లా మంగపేటలో కొత్త బస్ స్టేషన్ నిర్మాణానికి 51 లక్షలు, పెద్దపల్లి జిల్లా మంథని బస్ స్టేషన్ విస్తరణ కోసం 95.00 లక్షలు, సూర్యాపేట జిల్లా కోదాడ్ వద్ద ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం 17.95 కోట్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం రాబోయే “సరస్వతి పుష్కరాల” దృష్ట్యా ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణానికి 3.95 కోట్లు కేటాయిస్తూ ఆర్టీసీ బోర్డు అనుమతులు ఇచ్చింది.