రూ.లక్ష లంచం తీసుకుంటూ.. ఏసీబీ వలలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
ఏసీబీ వలకు ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ బి.ఆనంద్ కుమార్ చిక్కారు.

తెలంగాణ ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్, ఎఫ్‌ఏసీజనరల్ మేనేజర్ బి.ఆనంద్ కుమార్ ఏసీబీ వలకు చిక్కారు. ఓ కాంట్రాక్టర్ నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఇవాళ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లో ఉన్న ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ (టీఎస్‌సీసీడీసీఎల్)లో వివిధ నిర్మాణ పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్‌కు రూ.33,32,350ల బిల్లులు మంజూరయ్యాయి. అయితే బిల్లు మొత్తాలను చెల్లించేందుకు ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్,ఎఫ్‌ఏసీజనరల్ మేనేజర్ ఆనంద్‌కుమార్ రూ.1.33లక్షలు డిమాండ్ చేశారు.
పనులు నిర్మాణంలో నష్టాలు వచ్చాయని, రూ.1.33 లక్షలు ఇవ్వలేనని సదరు కాంట్రాక్టర్ ఆనంద్‌కుమార్‌కు తెలిపాడు. అయితే రూ.33,32,350లు మంజూరు చెయ్యాలంటే లంచం ఇవ్వాల్సిందేనని అధికారి తేల్చిచెప్పడంతో వెంటనే కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో గురువారం రూ.లక్ష లంచం ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆనంద్ కుమార్‌ను అరెస్టు చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.