కొత్త రేషన్ కార్డు దరఖాస్తుదారులకు షాక్
కొత్త రేషన్‌కార్డుల కోసం సివిల్‌సైప్లె, అటు మీ-సేవ అధికారులు స్పష్టతనివ్వలేదు
![కొత్త రేషన్ కార్డు దరఖాస్తుదారులకు షాక్ కొత్త రేషన్ కార్డు దరఖాస్తుదారులకు షాక్](https://www.teluguglobal.com/h-upload/2025/02/08/1401585-ration-cards.webp)
కొత్త రేషన్‌కార్డుల కోసం మీసేవలో దరఖాస్తులు స్వీకరించాలని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం అంతలోనే షాక్ ఇచ్చింది. ఆన్లైన్ ద్వారా నూతన రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పి ఎంతో ఆశతో మీ సేవ కేంద్రాలకు వెళ్లిన ప్రజలకు ఊహించని ఝలక్ ఇచ్చింది. కానీ పౌరసరఫరాల శాఖ వెబ్సైట్లో మాత్రం దరఖాస్తు అందుబాటులో లేదు అంటూ చూపిస్తుంది. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఎట్టకేలకు ఆన్లైన్ ఎఫ్ ఎస్ సి లాగిన్ పునరుద్ధరణకు పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మీ సేవ కేంద్రాలకు పరిగెత్తిన ప్రజలకు నిరాశ ఎదురయింది. సివిల్ సప్లయ్ అధికారుల ఆదేశాలు నేటి నుండి మీసేవ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రభుత్వం ఐటి 2/2196/2025 ద్వారా ప్రకటించింది.
దీంతో కొత్త రేషన్ కార్డులు కావలసినవారు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధపడుతున్న తరుణంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు కొత్త రేషన్ కార్డులు మీసేవ కేంద్రాల ద్వారా తీసుకోవడం లేదని కిందిస్థాయి సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో మీ సేవ కేంద్రాల ద్వారా అప్లికేషన్ల స్వీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రకటనలు చేసి ఎందుకు మా సమయం వృధా చేస్తారు, ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు మాకు ఆశ కలిగించడం ఎందుకు అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నరు. కుల గణనలో వివరాలు తీసుకున్నరు. గ్రామ సభలో తీసుకున్నారు. ఇప్పుడు మల్లా మీసేవలో దరఖాస్తులు అంటున్నరని ప్రభుత్వంపై మండిపడుతున్నారు