రాహుల్‌జీ మీరు చేసింది సరైనదైతే..మేము చేసిన తప్పేమిటి..? : కేటీఆర్
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ విపక్షనేత రాహుల్ గాంధీపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నలవర్షం కురిపించారు. పార్లమెంట్‌లో ఒకలా.. తెలంగాణ అసెంబ్లీలో మరోలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని హితవు పలికారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు.‘రాహుల్ జీ ఇది ఎలాంటి వంచన..? పార్లమెంట్‌లో అదానీ – మోదీ ఫొటో ఉన్న టీషర్ట్ ధరించడం మీకు సరైనదే అయితే.. మీ అడుగుజాడల్లో నడిచి తెలంగాణ అసెంబ్లీలో అదానీ – రేవంత్ వ్యవహారాన్ని బయటపెట్టడానికి మాకు ఎందుకు అనుమతి లేదు..? దీనికి సమాధానం చెప్పండి’ అంటూ కేటీఆర్ నిలదీశారు. ఈ మేరకు రాహుల్.. మోదీ – అదానీ చిత్రాలతో ఉన్న టీషర్ట్‌లను ధరించిన ఫొటోలను ట్వీట్‌కు జతచేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. పార్లమెంట్‌లో అదానీ-మోదీ ఫొటో ఉన్న టీ షర్ట్ ధరించడం మీకు సరైనదే అయితే.. మీ అడుగుజాడల్లో నడిచి తెలంగాణ శాసన సభలో అదానీ-రేవంత్ వ్యవహారాన్ని బయటపెట్టడానికి మాకు ఎందుకు అనుమతి లేదు’’ అని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. ‘అదానీ, రేవంత్‌రెడ్డి ఫొటోతో ఉన్న టీషర్ట్ ధరించి అసెంబ్లీకి వెళ్తే తప్పేమిటి. ఏ దుస్తులు వేసుకుని రావాలో స్పీకర్ చెబుతారా.
అదానీ, ప్రధాని మోదీ ఫొటో ఉన్న టీషర్ట్ ధరించి రాహుల్‌గాంధీ పార్లమెంటులోకి వెళ్తే ఆయనను ఎవరూ అడ్డుకోలేదు. మేం రాహుల్‌గాంధీనే అనుసరించాం. కానీ, ఎందుకు అనుమతించటం లేదు’’ అని కేటీఆర్ నిలదీశారు. తెలంగాణ శాసన సభ సమావేశాల తొలి రోజైన సోమవారం.. ‘అదానీ, రేవంత్ భాయీ భాయీ’ అనే నినాదంతో కూడిన ఫొటోలున్న టీషర్టులు ధరించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీలోకి రావటానికి ప్రయత్నించారు. అయితే, వారిని పోలీసులు అరెస్టుచేసి తెలంగాణ భవన్‌కు తరలించారు. ఈ సందర్భంగా, మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్, ప్రియాంకలతో సహా 100 మంది ఎంపీలు అదానీ, ప్రధాని మోదీ బొమ్మ వేసుకొని పార్లమెంటు లోపలికి వెళ్లవచ్చు గానీ తెలంగాణలో మాత్రం తమను అసెంబ్లీ లోపలికి అనుమతించకపోవటం ఏమిటని కేటీఆర్ నిలదీశారు.