అసెంబ్లీ ఆవరణలో ఫొటోలు, వీడియోల చిత్రీకరణపై నిషేధం
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఫొటోలు, వీడియోలకు నిషేధంవిధించింది.
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఫొటోలు, వీడియోలకు నిషేధం విధించింది . ఈ మేరకు శాసనసభ లాబీల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు కొత్తగా ఈ నిషేధ నిబంధనలు అమలుచేస్తున్నారు. ప్రతిపక్షాలు చేపట్టే ఆందోళనల ఫొటోలు, వీడియోలు బయటకు వెళ్లకుండా ఉండాలనే ఇలా చేశారంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. నిన్నటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి నిన్న మొన్నటి వరకు శాసనసభ ఆవరణలో ఎవరైనా, ఎప్పుడైనా ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు అవకాశం ఉండేది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో టీవీ ఛానెల్స్ లైవ్ ఇవ్వొద్దని మాత్రం చెప్పేవారని.. ఫొటోలు, వీడియోల చిత్రీకరణపై ఎలాంటి ఆంక్షలు లేవని గుర్తు చేస్తున్నారు. తాజా కాంగ్రెస్ ప్రభుత్వ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ప్రజా పాలన అంటూ ఎక్కడికక్కడ.. నిర్బంధకాండను అమలు చేస్తున్న కాంగ్రెస్ సర్కారుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.