మార్చిలో చర్లపల్లి నుంచి మరిన్ని రైళ్లు పరుగులు
సికింద్రాబాద్ స్టేషన్‌పై తగ్గనున్న ఒత్తిడి
చర్లపల్లి టెర్మినల్ నుంచి చెన్నై, గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపడానికి గ్రీన్ సిగ్నల్ ఊపిన దక్షిణమధ్య రైల్వే మార్చిలో మరో ఎనిమిది రైళ్లను ఇక్కడి నుంచి నడపాలని నిర్ణయించింది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై ఒత్తిడి తగ్గిస్తూ నిర్మాణ పనులను మరింత వేగంగా పూర్తి చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నది. రైలు ప్రయాణికులకు సంబంధించి ముందస్తు రిజర్వేషన్ సమయం 60 రోజులు ఉండటంతో.. గడువు ముగుస్తున్నకొద్దీ రైళ్ల రాకపోకలకు చర్లపల్లి మీదుగా సాగించాలని నిర్ణయించింది.
సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో పెరిగిన రైళ్ల ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి స్టేషన్ విస్తరణ చేపట్టిన సంగతి తెలిసిందే. రోజూ దాదాపు 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా చర్లపల్లి టెర్మినల్ ను విస్తరించారు. సరుకు రవాణా పార్శిల్ కేంద్రమూ ఏర్పాటు చేశారు. రోజుకు 200 పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని రైళ్ల రాకపోకలను నియంత్రించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కొన్ని రైళ్లను చర్లపల్లి నుంచి నడపడానికి దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తున్నది.
వచ్చిపోయే రైళ్లు ఇవే
చెన్నై ఎక్స్‌ప్రెస్, గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్, కాగజ్‌నగర్ ఇంటర్‌సిటీ, కృష్ణా ఎక్స్‌ప్రెస్, గుంటూరు ఇంటర్ సిటీ, పుష్‌పుల్ (సికింద్రాబాద్,వరంగల్) శబరి ఎక్స్‌ప్రెస్, రేపల్లె ఎక్స్‌ప్రెస్ (మధ్యాహ్నం), శాతవాహన, కాకతీయ ఎక్స్‌ప్రెస్, కాచిగూడ-మిర్యాలగూడ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి, ఘట్‌కేసర్ ఎంఎంటీఎస్, రేపల్లే ఎక్స్‌ప్రెస్ (రాత్రి)