Telugu Global
Telangana

ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంను ఆశ్రయించిన కేటీఆర్‌

ఈ నెల 10న పాత పిటిషన్‌తో కలిపి విచారిస్తామన్న సుప్రీంకోర్టు ధర్మాసనం

ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంను ఆశ్రయించిన కేటీఆర్‌
X

పార్టీ మారిన ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్‌ పిటిషన్‌పై జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇదే వ్యవహారంపై గతంలో దాఖలైన పిటిషన్‌కు ధర్మాసనం జత చేసింది. ఈ పిటిషన్‌ను దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల అనర్హత పిటిషన్‌తో కలిపిఈ నెల 10న పాత పిటిషన్‌తో కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కేటీఆర్‌ వేసిన ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై ప్రతివాదులైన తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీకి అందజేయాలని ఆదేశించింది. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్‌ గౌడ్‌, అరికెపుడి గాంధీ, గూడెం మహిపాల్‌ రెడ్డి, సంజయ్‌ కుమార్‌లు బీఆర్‌ఎస్‌ పార్టీ బీఫామ్‌ పై గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరినా ఇప్పటివరకు స్పీకర్‌ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కేటీఆర్‌ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ వేశారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం వెలువరించడానికి హేతుబద్ధంగా ఎంత సమయం కావాలో చెప్పాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ శాసనసభ స్పీకర్‌ను కోరిన విషయం విదితమే. వారం రోజుల్లోపు స్పీకర్‌ నిర్ణయాన్ని తమకు తెలుపాలని అసెంబ్లీ కార్యదర్శి ముకుల్‌ రోహత్గీకి సూచించింది. తమ పార్టీ తరఫన గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ తగిన సమయంలో లోపు నిర్ణయం తీసుకోవాలని నిర్దేశిస్తూ గత నవంబర్‌ 22న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ ఎమ్మెల్మే పాడి కౌశిక్‌ రెడ్డి దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీపై విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సహేతుక సమయం అంటే మహారాష్ట్రలోలా పదవీ కాలం ముగిసే వరకా అని ప్రశ్నించింది. అందుకే రోహత్గీ బదులిస్తూ స్పీకర్‌ ఈ ఏడాది జనవరిలో కార్యాచరణ మొదలుపెట్టారని పేర్కొనగా.. అందుకు ఎంత సమయం కావాలో మీరే చెప్పాలని న్యాయమూర్తి జస్టిస్‌ గవాయి ప్రశ్నించారు. స్పీకర్‌ను అడిగి చెబుతామని, రెండు వారాల సమయం ఇవ్వాలని అడగ్గా.. వారం రోజుల సమయం మాత్రమే సమయం ఇస్తూ న్యాయమూర్తి వచ్చే వారానికి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ వేసిన పిటిషన్‌ను కూడా అదే రోజు విచారిస్తామని సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది.

First Published:  3 Feb 2025 11:30 AM IST
Next Story