Telugu Global
Telangana

కేసీఆర్‌ ఫాంహౌస్‌కే పరిమితం

మా నాయకులు ఓడినా ప్రజల్లోనే ఉన్నారన్న సీఎం రేవంత్‌

కేసీఆర్‌ ఫాంహౌస్‌కే పరిమితం
X

వరి వేస్తే.. ఉరేసుకున్నట్లేనని గతంలో కేసీఆర్‌ అన్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మా హయాంలో వరికి మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్‌ ఇస్తున్నాం. వ్యవసాయం అంటే దండగ కాదు.. పండగ అని నిరూపించాం. గతంలో ఎమ్మెల్యేలను లాక్కున్నా.. వెనకడుగు వేయకుండా పోరాడామన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో వైద్య కాలేజీ ప్రారంభోత్సవం, నర్సింగ్‌ కళాశాలకు శంకుస్థాపన చేసిన తర్వాత గంధం వారి గూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో నల్గొండ పాత్ర మరువలేనిది. ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతచారి నల్గొండ వ్యక్తే. నల్గొండలో అడుగుపెట్టినప్పుడల్లా సాయుధ రైతాంగ పోరాటం గుర్తొస్తుంది. 15 వేల కానిస్టేబుల్‌ ఉద్యోగాలు ఇస్తే.. అందులో నల్గొండ జిల్లాకు వేల ఉద్యోగాలు వచ్చాయన్నారు. నల్గొండలో కృష్ణా జలాలు ప్రవహిస్తే ఫ్లోరైడ్‌ సమస్య తీరుతుందని ప్రజలు భావించారు.

కేసీఆర్‌ పాలనలో నల్గొండ జిల్లా నిర్లక్ష్యానికి గురైంది. ఉమ్మడి పాలనలో కంటే కేసీఆర్‌ పాలనలోనే నల్గొండకు ఎక్కువ నష్టం జరిగింది. గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులు కేసీఆర్‌ హయాంలో నిలిచిపోయాయి. ఈ జిల్లాలో కృష్ణా జలాలను ప్రవహింపజేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుతామని సీఎం చెప్పారు. ఏడాదిలో ఏనాడైనా కేసీఆర్‌ ప్రతిపక్ష నేత పాత్ర పోషించారా? గెలిస్తే ఉప్పొంగిపోవడం.. ఓడితే కుంగిపోవడం. ఒక్కసారి ఓడిపోగానే కుంగిపోయి ఫామ్‌ హౌస్‌కు పోవడం కేసీఆర్‌ స్థాయికి తగదన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఓడిపోయినా ప్రజల్లో ఉండి ఎంపీగా గెలిచినట్లు సీఎం అన్నారు.

మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 8,500 ఐకేపీల ద్వారా రూ. 500 బోనస్‌ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. 2.70 లక్షల ఎకరాల్లో సన్న వడ్లను నల్గొండ జిల్లా రైతులు పండించారు. మూడురోజుల్లో రైతులకు ధాన్యం అమ్మిన డబ్బులు చెల్లిస్తున్నాం. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామన్నారు. సన్నాలు పండిస్తే రూ. 500 బోనస్‌ ఇస్తామని కాబట్టి రైతులు సన్నాలు పండించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సన్నాలనే రేషన్‌ దుకాణాల్లో పంపిణీ చేస్తామని, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో సన్నాలనే భోజనానికి వినియోగిస్తామని సీఎం తెలిపారు. మూసీ వద్దని అడ్డంపడే వాళ్లకు ఘోరీ కట్టే శక్తి మీకున్నది. మూసీ ప్రక్షాళన చేయాలా? వద్దా? నల్గొండ ప్రజలు ఆలోచించాలన్నారు. ఎవరు అడ్డొచ్చినా మూసీ ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని సీఎం అన్నారు.

నల్గొండను.. బంగారుకొండ చేయడమే మా లక్ష్యం

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. మనకు ఇతర రాష్ట్రాలతో పోటీ కాదు.. ప్రపంచంతోనే పోటీ అన్నారు. రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తి చేస్తామన్నారు. రూ. 300 కోట్ల నిర్మించిన వైద్య కళాశాలను ప్రారంభించామన్నారు. నల్గొండ జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేస్తామన్నారు

First Published:  7 Dec 2024 7:03 PM IST
Next Story