ఫిలిం ఛాంబర్ ఎదుట జర్నలిస్టుల నిరసన
జర్నలిస్టులపై మోహన్‌బాబు దాడికి నిరసనగా హైదరాబాద్ ఫిల్మ్‌ఛాంబర్ ఎదుట జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు.
జర్నలిస్టులపై దాడికి నిరసనగా హైదరాబాద్ ఫిల్మ్‌ఛాంబర్ ఎదుట జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఛాంబర్ ముందు బైఠాయించి మోహన్‌బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫిలిం ఛాంబర్ ఎదుట సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్, అల్లం నారాయణ కలిసి భారీ ఎత్తున జర్నలిస్టులు నల్ల బ్యాడ్జిలు ధరించి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ..జర్నలిస్టుపై దాడికి పాల్పడిన మోహన్ బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆయన ఉన్మాదిలా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యులను ‘మా’ అసోసియేషన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలకు జర్నలిస్టులు భారీగా తరలివచ్చారు. మోహన్‌బాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆయనపై ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరారు. కలెక్షన్ కింగ్ జర్నలిస్టుపై ఓ ఉన్మాదిలా దాడి చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక రౌడీలా రంజిత్‌పై అత్యంత క్రూరంగా దాడికి పాల్పడ్డారని అల్లం నారాయణ అన్నారు. ఘటన జరిగి గంటలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు మోహన్ బాబు ఇంకా క్షమాపణలు చెప్పలేదని అన్నారు. వాళ్ల కుటుంబ సమస్య బజారున పడ్డాక, కేసులు నమోదయ్యాకే మీడియా జోక్యం చేసుకుందన్నారు. జర్నలిస్టుపై దాడి చేసిన ఘటనలో మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని అల్లం నారాయణ డిమాండ్ చేశారు. మోహన్ బాబు నివాసానికి కొడుకు మంచు మనోజ్ రాగా.. సిబ్బంది గేట్లు తెరిచేందుకు నిరాకరించారు. తన కూతురును తీసుకువెళ్తానంటూ గేట్లను బద్దలు కొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. విష్ణు తరఫు బౌన్సర్లు మనోజ్‌ను, మీడియాను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మోహన్‌బాబు మనోజ్‌పై చేయి చేసుకున్నారు. ఆ తర్వాత ఘటనను కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులపై బూతుపురాణం అందుకున్నారు. తుపాకీ బయటకు తీసి చంపేస్తానని హెచ్చరించారు. అలాగే, గొడవపై స్పందించాలని కోరిన టీవీ మీడియా ప్రతినిధి మైక్ లాక్కొని అతనిపైనే దాడి చేశారు.