Telugu Global
Telangana

గ్రామ సభల్లో విడుదల చేసిన జాబితా ఫైనల్ కాదనటం హాస్యాస్పదం : హ‌రీశ్‌రావు

తెలంగాణ‌లో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు

గ్రామ సభల్లో విడుదల చేసిన జాబితా ఫైనల్ కాదనటం  హాస్యాస్పదం : హ‌రీశ్‌రావు
X

గ్రామ సభల్లో విడుదల చేసిన లబ్దిదారుల జాబితా ఫైనల్ కాదని డిప్యూటీ సీఎం భట్టి, రెవెన్యూ మంత్రి చెప్పాడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు అన్నారు. గ్రామ‌స‌భ‌ల్లో తెలంగాణ ప్ర‌జ‌లు మ‌ర్ల‌బ‌డుతున్నార‌ని గ్రామ స‌భ‌లు ర‌ణ‌స‌భ‌లుగా మారాయంటేనే..రేవంత్ స‌ర్కార్ ఫెయిల్యూర్‌కు నిద‌ర్శ‌నం అని హ‌రీశ్‌రావు తెలిపారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామసభలో మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం బాధాకరం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు లేదని ములుగు జిల్లా బుట్టాయిగూడెంలో కుమ్మరి నాగయ్య అనే దళిత రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడటం మనస్సు కలిచివేసింది. గ్రామ సభల్లో జరుగుతున్న ఇలాంటి వరుస ఘటనలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి.

తన చావుతోనైనా అర్హులైన పేదలకు పథకాలు ఇవ్వాలని అధికారులకు చెబుతూ పురుగుల మందు తాగి, ఆసుపత్రి పాలైన ఆ రైతన్న దుస్థితికి ప్రభుత్వమే కారణం అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. కాంగ్రెస్ 400 రోజుల పాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని హ‌రీశ్‌రావు అన్నారు. జనవరి 26న మరో మోసానికి సిద్ధమైంది. దరఖాస్తుల పేరిట ఇంకెన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారు రేవంత్ రెడ్డి? మీ సేవలో దరఖాస్తులు చేసుకున్నరు. ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నరు. కుల గణనలో వివరాలు తీసుకున్నరు. ఇప్పుడు గ్రామ సభల పేరిట మరో కొత్త డ్రామా చేస్తున్నరు. మల్లా దరఖాస్తులు తీసుకుంటున్నరు. Apply Apply But No Reply అన్నట్లుంది మీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అని హ‌రీశ్‌రావు తీవ్రంగా విమ‌ర్శించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలు పేదలకు అందించాలనే చిత్తశుద్ది ఉంటే, గ్రామ సభల పేరిట ఎందుకు ఇంత డ్రామా? ఐటీలో మేటిగా ఉన్న తెలంగాణలో ప్రజలు పనులు వదులుకొని, రోజుల పాటు గ్రామ సభల్లో నిరీక్షించాల్సిన అవసరం ఏం వచ్చింది.

లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలనుకుంటే టెక్నాలజీని ఎందుకు వినియోగించడం లేదు. దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప, ఏడాది పాలనలో మీరు చేసిందేముంది. గ్రామ సభల సాక్షిగా తిరగబడుతున్న జనం, ఎక్కడిక్కడ నిలదీస్తున్న దృశ్యాలు.. మీ పాలన వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం అని హ‌రీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు

First Published:  24 Jan 2025 2:27 PM IST
Next Story