Telugu Global
Telangana

బీఆర్‌ఎస్‌ నీళ్లు పారిస్తే.. కాంగ్రెస్‌ నీళ్లు నములుతున్నది

సాగర్‌ కుడి కాలువ నుంచి రోజూ 10 వేల క్యూసెక్కులు ఏపీ తీసుకెళ్తున్నా.. రేవంత్‌ సర్కార్‌ పట్టించుకోవడం లేదని హరీశ్‌ ఆగ్రహం

బీఆర్‌ఎస్‌ నీళ్లు పారిస్తే.. కాంగ్రెస్‌ నీళ్లు నములుతున్నది
X

సాగు, తాగునీటికి తీవ్ర నష్టం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. బీఆర్‌ఎస్‌ తెలంగాణ భూములకు నీళ్లు పారిస్తే... కాంగ్రెస్‌ నీళ్లు నములుతున్నదని మాజీ మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు. సాగర్‌ కుడి కాలువ నుంచి రోజూ 10 వేల క్యూసెక్కులు పోతున్నా.. పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరున్నర లక్షల ఎకరాల్లో వేసుకున్న పంటలకు నీళ్లు ఎలా ఇస్తారో చెప్పాలని హరీశ్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. హైదరాబాద్‌ సహా చాలా జిల్లాల తాగునీటి అవసరాలను పణంగా పెట్టి చోద్యం చూస్తున్నదని విమర్శించారు. ఢిల్లీలో కృష్ణా బోర్డు ముందు అందరం కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం ధర్నా చేద్దామని పిలుపునిచ్చారు.

కృష్ణా జలాల్లో తాత్కాలిక వాటా ప్రకారం ఏపీ వాటా 512 టీఎంసీలు. ఇప్పటికే ఏపీ 657 టీఎంసీలు తీసుకెళ్లింది. దీనిపై మీనోరు పెగడడం లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర హక్కులను ఏపీకి తాకట్టుపెట్టడానికి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారా? అని నిలదీశారు. గడిచిన 20 రోజుల్లోనే 60 టీఎంసీల నీళ్లు తరలించారు. మీ నిర్లక్ష్యంగా తెలంగాణకు పెను శాపంగా మారనున్నది. నాగార్జున సాగర్‌ను తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని శానసభలోనూ తీర్మానం చేశాం. రెగ్యులేషన్‌ మీ చేతిలో ఉంటే కుడి కాలువ నుంచి రోజూ పది వేల క్యూసెక్కులు వాళ్లు తీసుకెళ్లలేరు కదా? మీ చేతగానితనం వల్ల తెలంగాణకు నీటి విషయంలో పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉన్నది. కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు.చంద్రబాబును అడిగే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని ధ్వజమెత్తారు. 343 టీఎంసీలు తెలంగాణకు రావాల్సి ఉందన్నారు. కానీ నేటికి తెలంగాణ వాడుకున్నది 220 టీఎంసీలు మాత్రమేనని అన్నారు. 123 టీఎంసీలు తెలంగాణకు రావాలి. ఏపీకి ఇంకా మిగిలింది 9 టీఎంసీలే . ఈ రెండు కలిపితే 132 టీఎంసీలు కావాలి. కానీ ఇప్పుడు ఉన్నది 100 టీఎంసీలు మాత్రమే. ఏపీ బంద్‌ పెట్టాలి కానీ ఈ వందలోనూ ఏపీ ఇంకా తరలిస్తూనే ఉన్నది. మన వాటా పోతుంటే, మన నీళ్లను తరలించుకుని వెళ్తుంటే గుడ్లు అప్పగించి ఎలా చూస్తున్నారని హరీశ్‌ మండిపడ్డారు. ఆరు లక్షల ఎకరాల్లో పెట్టుబడి పెట్టి, ఎరువులు వేశారు. నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ కు నాలుగు తడులు ఇస్తేగాని పంట పండదు. కాబట్టి ఇప్పటికైనా కండ్లు తెరవాలని సూచించారు.

First Published:  20 Feb 2025 1:32 PM IST
Next Story