Telugu Global
Telangana

తెలంగాణ కాంగ్రెస్ పై హైకమాండ్ ఫోకస్

ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం.. ఆ వెంటనే ఢిల్లీకి సీఎం, పీసీసీ చీఫ్

తెలంగాణ కాంగ్రెస్ పై హైకమాండ్ ఫోకస్
X

సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం (సీఎల్పీ) మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో (ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో సమావేశమైంది. ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. నాలుగు గంటల పాటు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా మూడు అంశాలను అంజెడాగా తీసుకున్నట్లు చెబుతున్నాయి. ఒకటి కులగణనకు సంబంధించి ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి. కులగణన చేసిన తీరును ప్రజాప్రతినిధులకు వివరించనున్నారు. మరొకటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ సమావేశంలో అది కూడా ప్రధానం కానున్నది. సబ్‌ కమిటీ, ఏకసభ్య కమిషన్‌ ఇచ్చిన నివేదికను ఎలా అమలు చేయాలన్నది చర్చించనున్నారు. దీనిపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించనున్నారు. ఇంకొకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్తే మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని అన్నది చర్చించనున్నారు.

కులగణనపై, ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్‌ పార్టీలోనే భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. దీంతో ఇవి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పార్టీ అనుకుంటున్నది. అందుకే వీటిపై బహిరంగంగా కాకుండా అంతర్గతంగా అభిప్రాయాలు వ్యక్తం చేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెల 15 తర్వాత షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉండటంతో పార్టీలో తలో రకంగా మాట్లాడితే మనకే నష్టం వస్తుందని అందుకే పార్టీ లైన్‌లోనే మాట్లాడలని సూచించనున్నారు.

ఇక ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేలు మంత్రలు వద్ద కు తీసుకెళ్తే సరిగ్గా స్పందించడం లేదని, దీంతో నియోజకవర్గంలో తాము తిరగలేకపోతున్నట్లు ఎమ్మెల్యేలు అంతర్గతంగా వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల పది ఎమ్మెల్యేలు హోటల్‌లో సమావేశమవడం కాంగ్రెస్‌ పార్టీలో కలకలం సృష్టించింది. మంత్రులకు, ఎమ్మెల్యేలకు మధ్య సఖ్యత లేదన్నది ఈ భేటీతో రుజువైంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతిని మీడియా ముందు వెల్లడించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వ్వవహారంపై గుర్రుగా ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలు ఆ భేటీలో ప్రధానంగా చర్చించినట్టు సమాచారం.

దీనికితోడు ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా హ్యాండిల్‌ ప్రభుత్వ పనితీరుపై పోల్‌ పెడితే అందులో దారుణమైన ఫలితం రావడంపై హైకమాండ్‌ సీరియస్‌ అయిందని తెలుస్తోంది. సొంతపార్టీలోనే ఎమ్మెల్యేల తిరుగుబాటు, పధ్నాలుగు నెలల పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి పోల్‌ రూపంలో బైట పడిందని అధిష్ఠానం గ్రహించింది. దీంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీతో పాటు అధిష్ఠాన పెద్దలకు అత్యంత నమ్మకస్తుడైన అభిషేక్ సింఘ్వీ కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో కులగణన, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల ఎన్నికలు అని చెబుతున్నా.. ఎమ్మెల్యేల అసంతృప్తితో పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయోనని కంగారుపడిన కాంగ్రెస్‌ పెద్దలు మంత్రులకు, ఎమ్మెల్యేలకు మధ్య ఉన్న గ్యాప్‌ తగ్గించడానికి ఈ వేదికను ఉపయోగించుకోవాలని సూచించినట్లు సమాచారం. సీఎల్పీ సమావేశం తర్వాత సీఎం, పీసీసీ అధ్యక్షుడు ఢిల్లీ వెళ్లనున్నారు.



First Published:  6 Feb 2025 12:36 PM IST
Next Story