Telugu Global
Telangana

చ‌ర్ల‌పల్లి జైలు నుంచి విడుద‌లైన మాజీ ఎమ్మెల్యే న‌రేంద‌ర్ రెడ్డి

చర్లపల్లి జైలు నుండి విడుదలైన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు

చ‌ర్ల‌పల్లి జైలు నుంచి విడుద‌లైన మాజీ ఎమ్మెల్యే న‌రేంద‌ర్ రెడ్డి
X

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి చ‌ర్ల‌ప‌ల్లి జైలు నుంచి విడుద‌ల అయ్యారు. చర్లపల్లి జైలు నుండి విడుదలైన న‌రేంద‌ర్ రెడ్డికి బీఆర్ఎస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఇక నరేందర్‌రెడ్డి కార్యకర్తలకు అభివాదం చేస్తూ విజ‌య సంకేతం చూపుతూ.. పార్టీ కేడ‌ర్‌లో జోష్ నింపారు. వికారాబాద్‌ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి చేశారన్న అభియోగాల కేసులో అరెస్టయి, జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న నరేందర్‌రెడ్డితో పాటు 24 మంది రైతులకు నాంపల్లి స్పెషల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన సంగ‌తి తెలిసిందే. బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి స్పెషల్ కోర్టు కొన్ని ష‌ర‌తులు విధించింది. ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డికి రూ. 50 వేల పూచీక‌త్తుపై, మిగ‌తా వారికి రూ. 20 వేల పూచీక‌త్తుపై బెయిల్ మంజూరు చేసింది. పట్నం నరేందర్ రెడ్డికి రెండు షూరిటీలు, మిగితా వారికి ఒక షూరిటీ ఉండాలని తెలిపింది.

అంతేకాకుండా 3 నెలల పాటు ప్రతీ బుధవారం పట్నం నరేందర్ రెడ్డితోపాటు ఇతర నిందితులు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. నవంబర్‌ 11వ తేదీన వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో అధికారులపై స్థానికులు దాడి చేశారు. ఫార్మా పరిశ్రమ ఏర్పాటు కోసం అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ సహా ఇతర అధికారులు.. లగచర్లకు చేరుకున్న సమయంలో కొందరు వ్యక్తులు కర్రలు, రాళ్లతో అధికారులపై దాడికి దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పలువురు గ్రామస్తులను అరెస్ట్‌ చేశారు. ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డికి ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆయన హైదరాబాద్‌లో మార్నింగ్‌ వాక్‌ చేస్తుండగా అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. నాంపల్లి స్పెషల్‌ కోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేయడంతో బాధితులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తంచేశారు. ఎట్టకేలకు న్యాయం గెలిచిందని, ఇందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని రోటిబండతండా, పులిచెర్లకుంటతండా, లగచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు, రైతులు సంబురాలు చేసుకున్నారు

First Published:  19 Dec 2024 7:55 PM IST
Next Story