సైబర్ నేరాల్లో సొమ్ము రికవరీల్లో సైబరాబాద్ పోలీసుల ముందంజ
హెచ్‌ఐసీసీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సైబర్‌సెక్యూరిటీ కాంక్లేవ్ ప్రారంభం

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సైబర్‌సెక్యూరిటీ కాంక్లేవ్ ప్రారంభమైంది. ఈ సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎంతో పాటు ఈ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతున్నది. కాగా ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు సాగనున్నది. డిజిటల్ భద్రత, భవిష్యత్తుపై సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్‌లో చర్చ జరుగుతున్నది. ఈ చర్చల్లో సైబర్ సెక్యూరిటీ నిపుణులు, లా ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్టరంలో సైబర్ నేరాలు తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి. దానిపై ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించాలి అన్నదానిపై మాట్లాడుతున్నారు. డబ్బులు అకౌంట్లు మారిన తర్వాత వాటిని తిరిగి ఎలా రాబటట్టాలి అన్న దానిపై చర్చిస్తున్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశామన్నారు. సైబర్ నేరాల్లో సొమ్ము రికవరీల్లో సైబరాబాద్ పోలీసులు ముందంజలో ఉన్నారన్నారు. గత ఏడాది సైబర్ నేరాల దర్యాప్తు కోసం కొత్తగా 7 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఒకప్పుడు ఇంట్లో చొరబడి మాత్రమే దోపిడీలు చేసేవారు. ఇప్పుడు దొంగలు ఎక్కడో ఉండి.. మన సొమ్ము దొంగిలిస్తున్నారు. నేరం ఎక్కడి నుంచి ఎవరు చేశారో కనుక్కోవడం పెద్ద సవాలుగా మారింది. నేరాల శైలి మారుతున్నది. వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రజలు, ప్రభుత్వం మారాలి అన్నారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సాంకేతికత రెండువైపులా పదును ఉన్న కత్తిలాంటిది అన్నారు. సాంకేతికతతో మరిన్ని అవకాశాలు లభిస్తాయన్నారు. అలాగే డిప్‌ఫేక్, ర్యాన్సమ్‌వేర్, మాల్‌వేర్ వంటి సవాళ్లు కూడా ఉన్నాయి. సైబర్ దాడుల వల్ల ఎన్నో వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. ఇటీవల అమెరికాలో సైబర్ దాడితో విమాన రాకపోకలు స్తంభించిపోయిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. సైబర్ నేరాల వల్ల రూ. 15 వేల కోట్లు భారతదేశం నష్టపోతున్నదన్నారు.