Telugu Global
Telangana

మాటల్లో రాజ్యాంగ రక్షణ.. చేతల్లో రాజ్యాంగ భక్షణ

కాంగ్రెస్‌ పార్టీ తీరే ఇంత : మాజీ మంత్రి హరీష్ రావు

మాటల్లో రాజ్యాంగ రక్షణ.. చేతల్లో రాజ్యాంగ భక్షణ
X

కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగ రక్షణ అంటూ మాటలు చెప్పడమే తప్ప.. ఆ పార్టీ చేసేది అంతా రాజ్యాంగ భక్షణ చర్యలేనని మాజీ మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు. ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ చిన్నారెడ్డి వనపర్తిలో పార్టీ నాయకత్వంపై ఆవేదనతో మాట్లాడిన వీడియోను హరీశ్‌ రావు ఎక్స్‌ లో పోస్ట్‌ చేశారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న విధానానికి అద్దం పడుతున్నాయని అన్నారు. ''ఇందిరమ్మ రాజ్యం.. పోలీసు రాజ్యమైంది.. మా కార్యకర్తల నుంచి నాయకుల దాకా అక్రమ కేసులు.. వేధింపులు సర్వసాధారణమైపోయాయన్న మా ఆరోపణలు వాస్తవమని కాంగ్రెస్ నాయకుడైన చిన్నారెడ్డి వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతున్నది. పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇంటి కావలి కారుల్లాగా పని చేస్తున్నారు. ఎమ్మెల్యే కేసు పెట్టుమంటే పెట్టాలే, తీసేయమంటే తీసేయాలే అనే స్థాయికి దిగజారారు. గతంలో ఎన్నడూ ఒక ఎమ్మెల్యేకు అధికారులు ఇంతగా భయపడిన దాఖలాలు లేవు. నా 46ఏండ్ల రాజకీయ జీవితంలో ఇంత దారుణంగా పోలీసులు, అధికారులు ఎన్నడూ ప్రవర్తించలేదు’’ అని చిన్నారెడ్డి బహిరంగంగా ప్రభుత్వ తీరును ఎండగట్టారని వివరించారు.

కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెబుతున్నది నిజమేనని నాడు జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, నేడు వనపర్తిలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయన్నారు. ఈ ప్రభుత్వంలో పోలీసులు, అధికారుల తీరు ఇట్లా ఉంటే, రేవంత్ రెడ్డి నాయకత్వంలో నోట్ల రాజకీయం నగ్న తాండవం చేస్తున్నది. ఈ విషయాన్ని కూడా చిన్నారెడ్డి స్వయంగా వెల్లడించారు. ''మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేత రూ.90 కోట్లు ఖర్చు పెట్టించారని, ఓట్లు కొనుగోలు చేసే క్రమంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు రూ.5నుంచి రూ.10లక్షల వరకు ఇస్తామని చెప్పి.. రెండున్నర లక్షలు మాత్రమే ఇచ్చారని చిన్నారెడ్డి బట్టబయలు చేశారు. ఈడీలు, సీబీఐలు, ఐటీలు, ఎన్నికల కమిషన్‌ ఈ విషయంపై ఎందుకు నోరు మెదపడం లేదు.. సుమోటోగా తీసుకొని కేసులు ఎందుకు పెట్టడం లేదు.. బీఆర్ఎస్ నాయకులపై నిరాధారమైన కేసులు పెట్టటంలో చూపించే అత్యుత్సాహం ఆధారాలున్నా.. స్వయంగా కేబినెట్ ర్యాంకులో ఉండి, ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడే చెబుతున్నా ఎందుకు పెట్టడం లేదు'' అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మార్క్‌ ప్రజా పాలన, రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా అని నిలదీశారు. రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ దీనిని ఏ విధంగా సమర్థిస్తారు.. ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. బడే భాయ్, ఛోటే భాయ్ బంధానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి.. బీజేపీ, కాంగ్రెస్ ల చీకటి ఒప్పందానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి.. వెంటనే కేసులు పెట్టి, విచారణ జరపాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.

First Published:  25 Feb 2025 3:20 PM IST
Next Story