తెలుగు హీరోలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరోలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
సినీ ఇండస్ట్రీపై మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం యువకులు బలిదానం చేస్తే సినీ నటులు చేతులు ముడుచుకుని కూర్చున్నారని ఆయన తెలిపారు. టాలీవుడ్ హీరోల్లో ఎవరైనా గ్రామాలను దత్తత తీసుకొని బాగు చేశారా? అని ప్రశ్నించారు. తమిళనాడులో సినీ నటులు సేవా కార్యక్రమాలు చేసినట్టు.. తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు చేశారాని ఆయన ప్రశ్నించారు. తెలుగు హీరోల కంటే బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎంతో బెటర్ అని కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మధ్య తరగతి కుటుంబంవైపు నిలబడ్డారు.. మిగిలిన వాళ్లంతా బడా వ్యక్తులవైపు నిలబడ్డారు. తెలంగాణ సమాజం, సంస్కృతిపైన దాడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమిళనాడు మరియు కర్ణాటకల మధ్య కావేరి నది వివాదంలో రజినీకాంత్ ఇండస్ట్రీని ఏకం చేసి నిలబెట్టారు. కానీ మన సూపర్ స్టార్‌లు ఏనాడైనా ప్రజల గురించి పట్టించుకున్నారా? అని మండిపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే బ్లడ్ బ్లాంక్ పెట్టి ఆదుకున్నారు. చిరంజీవి వారసులం అని చెప్పుకునే వారికి ఆయన ఆదర్శం ఏమైంది. నైజాం ఏరియా అభిమానులు సినిమాలు చూడకపోతే సినిమా వాళ్ళ పరిస్థితి ఏంటని అన్నారు.
వందల కోట్ల పారితోషికం తీసుకుంటూ కృత్రిమ సమాజంలో బతుకుతున్నారన్నారు. అర్థరాత్రి పబ్బుల్లో, గోవాలో పార్టీల్లో నటులు ఉంటారన్నారు. ప్రజలకు ఇబ్బందులు వస్తే కనీసం ఒక్కరూ కూడా స్పందించరని మండిపడ్డారు. పాపులారిటీలో సినీ నటుల కంటే రాజకీయ నాయకులు తక్కువగా కనిపిస్తారు కానీ ప్రజా సంబంధాల విషయంలో తామే చాలా బెటర్ అని అన్నారు. ప్రజలను మనుషులుగా చూడాలని ఎమ్మెల్యే హితవుపలికారు. సినీ నటులు ఎవరైనా స్కూళ్లను, హాస్పిటల్స్‌ను దత్తత తీసుకున్నారా అని నిలదీశారు. సామాజిక అంశాలపై స్పందించడానికి కూడా తెలుగు నటులు డబ్బులు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. సినీ తారలు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా నటిస్తున్నారన్నారు. పిల్లలకు పుస్తకాలు ఇద్దామని అంటే తనకేం వస్తుందని ఒక నటుడు అన్నారన్నారు. సినీతారలు రాతి హృదయంతో ఉంటారంటూ వ్యాఖ్యలు చేశారు.