Telugu Global
Telangana

ఢిల్లీకి సీఎం రేవంత్‌

ఇవాళ జైపూర్‌లో బంధుల వివాహానికి హాజరు.. రేపు కేంద్ర మంత్రుల, కాంగ్రెస్‌ అగ్రనేతలతో భేటీ

ఢిల్లీకి సీఎం రేవంత్‌
X

సీఎం రేవంత్‌రెడ్డి రేపు, ఎల్లుండి ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి విన్నవించనున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి పార్లమెంటులో ప్రస్తావించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఎల్లుండి ఇండియా టుడే నిర్వహిస్తున్న కాంక్లేవ్‌లో పాల్గొంటారు. అనంతరం కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌లను మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పీసీసీ కార్యవర్గం ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్బంగా నిర్వహించిన విజయోత్సవాల గురించి పార్టీ పెద్దలకు వివరించే అవకాశం ఉన్నది. ఇవాళ రాత్రికి రాజస్థానలోని జైపూర్‌లో బంధువుల పెళ్లికి కుటుంబసమేతంగా హాజరవుతారు.

First Published:  11 Dec 2024 12:29 PM IST
Next Story