మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ప్రతిపాదనకు బీఆర్‌ఎస్ మద్దతు : కేటీఆర్
మన్మోహన్ సింగ్ కి భారత రత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ఇచ్చేందుకు కేంద్రానికి ప్రతిపాదన పంపాలని శాసన సభలో తెలంగాణ ప్రభుత్వం చేసిన తీర్మానానికి బీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. భారత రత్న పుస్కారం పొందేందుకు మన్మోహన్ సింగ్ పూర్తి అర్హులని కేటీఆర్ అన్నారు. తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో నీతి, నిజాయితీగా మన్మోహన్ వ్యవహరించారని కొనియాడారు.
ఆయన ఓ నిరాడంబర మనిషి అని కీర్తించారు. మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో మాజీ సీఎం కేసీఆర్ కూడా ఏడాదిన్నర పాటు మంత్రిగా పని చేశారని గర్తు చేశారు. వాస్తవానికి మన్మోహన్ సింగ్ ప్రతిభను గుర్తించింది తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు కావడం గర్వకారణమని కేటీఆర్ అన్నారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ నాయకత్వంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగిందని తెలిపారు. ప్రజాస్వామిక ఉద్యమాలకు ఆయన అండగా నిలబడ్డారని కొనియాడారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. ఆర్థిక సంస్కరణల్లో ఏమాత్రం వెనక్కి తగ్గలేని అన్నారు. ఎన్ని నిందలు వేసినా.. ఆ స్థితప్రజ్ఞుడు వణకలేదు, తొణకలేదని కేటీఆర్ ప్రశంసించారు.