మంత్రి కోమటిరెడ్డిపై స్పీకర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కి బీఆర్ఎస్ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. నిన్న శాసన సభ సమావేశాలలో క్వశ్చన్ అవర్ జరుగుతుండగా మాజీ మంత్రి హరీష్ రావు పై మంత్రి కోమటిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారు. సభ జరుగుతున్న సమయంలో స్పీకర్ నోటీసులో లేకుండా, అనుమతి తీసుకోకుండా నిరాధార ఆరోపణలు చేయడం అనేది సభా నియమావళి ఉల్లంఘన అవుతుందని బీఆర్ఎస్ పేర్కొంది.
సభ హక్కుల ఉల్లంఘన వివరాల ప్రకారం రూల్ 319 ప్రకారం అసెంబ్లీలో గౌరవ సభ్యులపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం లేదా అసభ్య పదజాలం ఉపయోగించడం సభలో అనుమతించబడదు. రూల్ నెంబర్ 30 ప్రకారం సభలో ఎవరి గురించైనా మాట్లాడాలంటే ముందుగా సభాపతి కి నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రూల్ నెంబర్ 45 ప్రకారం సభా ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలు సభా నియమావళికి విరుద్ధం. గౌరవ సభ్యులపై సభలో వ్యక్తిగత ఆరోపణలు చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ ఫిర్యాదులో పేర్కొంది.