Telugu Global
Telangana

హైదరాబాద్ గుర్తుకు వచ్చేలా ఏఐ సీటీ : మంత్రి శ్రీధ‌ర్ బాబు

డిపాజిట‌రీ ట్రస్ట్, క్లియరింగ్ కార్పోరేష‌న్ ‌(డీటీసీసీ) నూత‌న కార్యాల‌యాన్ని మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు ప్రారంభించారు

హైదరాబాద్ గుర్తుకు వచ్చేలా ఏఐ సీటీ : మంత్రి శ్రీధ‌ర్ బాబు
X

తెలంగాణలో 200 ఎక‌రాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏటీ సిటీని నిర్మించబోతున్నామని ఐటీ, ప‌రిశ్రమ‌ల మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు అన్నారు. రాబోయే రోజుల్లో ఏఐ అంటే తెలంగాణ..హైదరాబాద్ గుర్తుకు వచ్చేలా దాన్ని తీర్చిదిద్దుతామన్నారు. ఇవాళ హైటెక్ సిటీలో ప్రపంచ‌వ్యాప్తంగా ఆర్థిక సేవ‌లు అందిస్తున్న డిపాజిట‌రీ ట్రస్ట్, క్లియరింగ్ కార్పోరేష‌న్ ‌(డీటీసీసీ) నూత‌న కార్యాల‌యాన్ని ఆయ‌న లాంఛ‌నంగా ప్రారంభించారు. ఎమ‌ర్జింగ్ టెక్నాల‌జీస్‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకునే పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం త‌ర‌ఫున అన్ని ర‌కాలుగా ప్రోత్సహిస్తామన్నారు. రోజురోజుకీ టెక్నాల‌జీ కొత్త పుంత‌లు తొక్కుతోందని.. అదే స‌మ‌యంలో కొత్త కొత్త స‌వాళ్లు ఎదురవుతున్నాయన్నారు. యువ‌త కొత్తగా ఆలోచించి వీటికి ప‌రిష్కారాల‌ను నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలన్నారు.

ఆ దిశ‌గా కృషి చేసే వారికి ప్రభుత్వం త‌ర‌ఫున అన్ని ర‌కాలుగా అండ‌గా ఉంటామని హామీ ఇచ్చారు. హైద‌రాబాద్ అన‌గానే అంద‌రికీ కేవ‌లం సాఫ్ట్‌వేర్ కంపెనీలే గుర్తుకొస్తాయన్నారు. కానీ.. ఇక్కడ అన్ని రంగాల‌కు చెందిన కంపెనీలున్నాయన్నారు. 100 నుంచి 120 కంపెనీలు ఇక్కడి నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సేవ‌లందిస్తున్నాయన్నారు. అన్ని ర‌కాల ప‌రిశ్రమ‌ల‌ను స్థాపించేందుకు అనువైన వాతావ‌ర‌ణం తెలంగాణ‌లో ఉందన్నారు. ఇక్కడ పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామిక‌వేత్తల‌కు అన్ని ర‌కాలుగా అండ‌గా ఉంటామన్నారు. మీకు కావాల్సిన నైపుణ్యమున్న మాన‌వ వ‌న‌రుల‌ను మేం అందిస్తామని.. నిశ్చింతంగా ఇక్కడ పెట్టుబ‌డులు పెట్టాలని కోరారు.

First Published:  3 Feb 2025 9:18 PM IST
Next Story