Telugu Global
Telangana

కులగణన సర్వేలో బీసీల లెక్కల్లో 21 లక్షల తేడా

కేవలం ఓసీల జనాభా మాత్రమే పెరిగి మిగతా వర్గాల జనాభా ఎలా తగ్గుతుందని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత

కులగణన సర్వేలో బీసీల లెక్కల్లో 21 లక్షల తేడా
X

సీఎం రేవంత్‌రెడ్డికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కులగణన వివరాలను సమీక్షకు పెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. అందులో నమోదైన వివరాలను ప్రతి ఒక్కరూ నివృత్తి చేసుకునేలా స్క్రూటినీకి అవకాశం ఇవ్వాలని వెల్లడించారు. ప్రభుత్వం చెబుతున్న బీసీ లెక్కలపై అనుమానాలున్నాయన్నారు. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలకు, ఇప్పటి బీసీల లెక్కల్లో 21 లక్షల తేడాలున్నట్లు వివరించారు. కేవలం ఓసీల జనాభా మాత్రమే పెరిగి మిగతా వర్గాల జనాభా ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు. నిన్న ఆగమాగం లెక్కడు ప్రకటించి రేపు అసెంబ్లీలో ఆమోదించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చకు కాకుండా బిల్లు పెట్టాలని కవిత డిమాండ్‌ చేశారు. కర్ణాటక, బీహార్‌ తరహాలోనే రాష్ట్ర బీసీలను మోసం చేసే యత్నాలను మానుకోవాలని హెచ్చరించారు. స్థానిక ఎన్నికలు ఆపకుండా 56. 3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూనే.. సమగ్రమైన లెక్కలు తీయాలని కవిత ప్రభుత్వానికి సూచించారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక కోటి 15 లక్షల ఇండ్లు ఉన్నాయని చెబుతున్నది. జనాభా 3 కోట్ల 70 లక్షలని చెబుతున్నది.

2011-14 వరకు చేసిన లెక్కల్లోనే ఏడాది ఆరు లక్షల కుటుంబాలు పెరుగుతున్నాయి. ఈ లెక్క చూసుకుంటే ఈ పదేళ్లలో ఎన్ని ఇల్లు పెరగాలి. కనీసం 60 లక్షల కుటుంబాలు పెరగాలన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2023 వరకు ఇచ్చిన కల్యాణ లక్ష్మి చెక్కులే 13 లక్షల 78 వేలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం 12 లక్షలు కూడా పెరిగాయని చెప్పడం లేదన్నారు. కాబట్టి ఏ లెక్కన చూసినా... జనాభా లెక్కలు, సమగ్ర కుటుంబ సర్వే, కల్యాణ లక్ష్మి చెక్కులు , నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ డేటా (రెండేళ్లకోసారి దేశమంతా శాంపుల్‌ సేకరిస్తారు. అది కేంద్ర ప్రభుత్వ అధికారిక డేటా. అందులో 50-52 శాతం బీసీలున్నారని చెబుతున్నారు) ప్రకారం చూసినా స్పష్టమౌతుంది. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చెబుతున్నది? 46.25 శాతం బీసీలున్నారని చెబుతున్నది. ఇది కరెక్టా అన్నది రేవంత్‌ రెడ్డి గుండె మీద చేయి వేసుకుని ఆలోచన చేయాలి. మీకు బీసీలపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన కులగణన డేటా దాన్నిప్రభుత్వం రివ్యూకు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

First Published:  3 Feb 2025 2:43 PM IST
Next Story