Telugu Global
Sports

ప్రపంచ జూనియర్ చెస్ విజేత దివ్యా దేశ్ ముఖ్!

2024- ప్రపంచ జూనియర్ మహిళా చెస్ టైటిల్ ను భారత చదరంగ యువరాణి దివ్య దేశ్ ముఖ్ గెలుచుకొంది

ప్రపంచ జూనియర్ చెస్ విజేత దివ్యా దేశ్ ముఖ్!
X

2024- ప్రపంచ జూనియర్ మహిళా చెస్ టైటిల్ ను భారత చదరంగ యువరాణి దివ్య దేశ్ ముఖ్ గెలుచుకొంది. 18 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించింది.

ఇతిహాస క్రీడ చదరంగం సీనియర్, జూనియర్ విభాగాలలో భారత్ జోరు కొనసాగుతోంది. పురుషుల, మహిళల విభాగాలలో గ్రాండ్ మాస్టర్లు గుకేశ్, ప్రఙ్జానంద్, సంతోష్ గుజరాతీ, అర్జున్ ఇరగేసీ, మహిళల విభాగంలో కోనేరు హంపి, వైశాలి అదరగొడుతుంటే..ప్రపంచ మహిళల జూనియర్ విభాగంలోనూ ప్రపంచ స్థాయిలో భారత్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకొంది.

18 ఏళ్ల వయసులో ప్రపంచ తొలి టైటిల్...

నాగపూర్ కు చెందిన దివ్యా దేశ్ ముఖ్ 18 సంవత్సరాల వయసులో ప్రపంచ జూనియర్ చెస్ టైటిల్ సాధించడం ద్వారా భారత చదరంగానికే వన్నెతెచ్చింది.

ఇప్పటికే రెండుసార్లు భారత మహిళా చెస్‌ టైటిల్ సాధించిన దివ్య..గుజరాత్ లోని గాంధీనగర్ వేదికగా ముగిసిన 2024- ప్రపంచ మహిళా జూనియర్ చెస్ట్ టోర్నీలో తిరుగులేని విజేతగా నిలిచింది.

20 సంవత్సరాల లోపు వయసున్న ప్రపంచ మేటి యువ మహిళా క్రీడాకారులకు నిర్వహించే ఈ టోర్నీలో దివ్యా దేశ్ ముఖ్ కనీసం ఒక్కగేమ్ లోనూ ఓటమి లేకుండా విశ్వవిజేత కాగలిగింది.

తన కెరియర్ లో రెండోసారి ప్రపంచ జూనియర్ టోర్నీలో పాల్గొన్న దివ్య..రెండో ప్రయత్నంలో ప్రపంచ టైటిల్ ను కైవసం చేసుకోగలిగింది.

11 రౌండ్లలో 10 పాయింట్లతో విజయం...

వివిధ దేశాలకు చెందిన పలువురు ప్రపంచ మేటి జూనియర్ చెస్‌ స్టార్లు తలపడిన 11 రౌండ్ల ఈటోర్నీలో దివ్య ఒక్క ఓటమి లేకుండా విజేతగా నిలవడం విశేషం.

షార్జా చాలెంజర్స్ క్లాసికల్ టోర్నీని నెగ్గిన 21 రోజుల వ్యవధిలోనే దివ్య విశ్వవిజేతగా నిలువగలిగింది.

టోర్నీ 6వ రౌండ్లో ఆయాన్ అల్లావర్ధియేవా పై నెగ్గిన తరువాత నుంచి దివ్య వెనుదిరిగి చూసింది లేదు. చివరి ఐదు రౌండ్లలోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చింది.

ఆఖరి రౌండ్లో 5గంటల పోరు...

బల్గేరియాకు చెందిన క్రస్టేవా బెలోస్లావాతో ఐదుగంటలపాటు సాగిన 11వ రౌండ్ సమరంలో దివ్య చివరకు 57 ఎత్తుల్లో ప్రత్యర్థిని చిత్తు చేసి ప్రపంచ టైటిల్ ఖాయం చేసుకోగలిగింది. తనకంటే మెరుగైన ఎలోరేటింగ్ ( 2289 పాయింట్లు ) కలిగిన బెలోస్లావాను దివ్య సమర్థవంతంగా నిలువరించగలిగింది.

ఆర్మేనియాకు చెందిన 2వ సీడ్ మరియం క్రిచియాన్ 9.5 పాయింట్లతో రజత, అజర్ బైజాన్ కు చెందిన అయాన్ 8.5 పాయింట్లతో కాంస్య పతకాలు దక్కించుకొన్నారు.

18 ఏళ్ల వయసులో 21 బంగారు పతకాలు...

నాగపూర్ లో 12వ తరగతి విద్యార్థినిగా ఉన్న దివ్య కేవలం 18 సంవత్సరాల వయసుకే ఓ ప్రపంచ టైటిల్, ఓ ఆసియా టైటిళ్లతో సహా 21 బంగారు పతకాలు సాధించడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది. గ్రాండ్ మాస్టర్ హోదా సాధించడమే తన జీవితలక్ష్యమని, రెండో ప్రయత్నంలో ప్రపంచ టైటిల్ సాధించడం సంతృప్తినిచ్చిందని ప్రకటించింది.

భారత మహిళా చదరంగ చరిత్రలో గ్రాండ్ మాస్టర్ హోదాకు ఎదిగిన క్రీడాకారిణులు ముగ్గురంటే ముగ్గురు ( కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలీ ) మాత్రమే ఉన్నారు.

First Published:  14 Jun 2024 5:06 PM IST
Next Story