చాంపియన్స్ ట్రోఫీ భవితవ్యం ఏంటి?
ఇంకా షెడ్యూల్ ఖరారు చేయని ఐసీసీ.. అక్కడికి వెళ్లేది లేదన్న భారత్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ భవితవ్యం ఏమిటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. పాకిస్థాన్ వేదికగా నిర్వహించే ఈ టోర్నీలో ఆడేది లేదని భారత్ స్పష్టం చేసింది. ఇండియా మ్యాచ్ లు తటస్థ వేదికగా నిర్వహిస్తే తప్ప తాము చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనబోమని బీసీసీఐ తేల్చిచెప్పింది. ఇండియా మ్యాచ్ తటస్థ వేదికలపై నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ససేమిరా అంటోంది. మరోవైపు 2025లో అన్ని క్రికెట్ టీమ్‌ల షెడ్యూల్ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వ తేదీ మధ్య చాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి నివేదించింది. చాంపియన్స్ ట్రోఫీకి వంద రోజుల ముందు నుంచే కౌంట్ డౌన్ షురూ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పటికే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఖరారు చేసి కౌంట్ డౌన్ ప్రారంభించి ఉండాలి. ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నాలేమి లేవు. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీని వాయిదా వేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఒకవేళ అన్ని దేశాల క్రికెట్ బోర్డులు అందుకు అంగీకరించకుంటే మొత్తానికే టోర్నీ రద్దయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని క్రికెట్ వర్గాలు చెప్తున్నాయి.