Telugu Global
Sports

భారత క్రికెట్ హెడ్ కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్?

భారత క్రికెట్ చీఫ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల కాంట్రాక్టు ముగియటంతో కొత్త కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

భారతక్రికెట్ హెడ్ కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్?
X

భారత క్రికెట్ చీఫ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల కాంట్రాక్టు ముగియటంతో కొత్త కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

భారత క్రికెట్ కు గత రెండేళ్లుగా ప్రధాన శిక్షకుడిగా సేవలు అందించిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్టు ముగిసింది. అహ్మదాబాద్ వేదికగా కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓటమితో చీఫ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్టుకు తెరపడింది. ద్రవిడ్ జట్టులో సభ్యులుగా విక్రమ్ రాథోడ్ బ్యాటింగ్ కోచ్ గా , పరస్ మాంబ్రే బౌలింగ్ కోచ్ గా , టీ.దిలీప్ ఫీల్డింగ్ కోచ్ గా సేవలు అందించారు.

రాహుల్ ద్రవిడ్ నిరాసక్తత!

2021 సీజన్లో రవిశాస్త్రి నుంచి భారత జట్టు చీఫ్ కోచ్ గా పగ్గాలు చేపట్టిన రాహుల్ ద్రవిడ్ తన కెప్టెన్ రోహిత్ శర్మతో కలసి సరికొత్త ఒరవడి సృష్టించగలిగారు.

ద్రవిడ్-రోహిత్ జోడీ భారత జట్టుకు కనీసం ఒక్క ఐసీసీ ట్రోఫీని సైతం అందించలేకపోయినా..చెప్పుకోదగిన విజయాలు అందించగలిగారు.

ఐసీసీ టెస్టు లీగ్ లో రన్నరప్, ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో రన్నరప్ స్థానాలతో పాటు ..2023 ఆసియాకప్ టైటిల్ ను భారత్ గెలుచుకోగలిగింది. 2022 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ పోరు సెమీస్ లోనే ముగిసింది.

క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ భారత్ ను నంబర్ వన్ ర్యాంక్ జట్టుగా నిలిపిన రాహుల్ ద్రవిడ్ కు బీసీసీఐ ఏడాదికి 12 కోట్ల రూపాయల చొప్పున చెల్లిస్తూ వచ్చింది.

2023 నవంబర్ 19తో ద్రవిడ్ కాంట్రాక్టు ముగిసింది. అయితే...తనకు చీఫ్ కోచ్ గా కొనసాగే ఉద్దేశం లేదని, తన కాంట్రాక్టును పొడిగించ వద్దంటూ బీసీసీఐకి ద్రవిడ్ తెలపడంతో కొత్త కోచ్ అన్వేషణకు తెరలేచింది.

ద్రవిడ్ వారసుడిగా వీవీఎస్....

భారత చీఫ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడంతోనే జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ గా సేవలు అందిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్ అనధికారికంగా హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రస్తుత ఐదు మ్యాచ్ ల టీ-20 సిరీస్ లో భారత చీఫ్ కోచ్ గా పగ్గాలు అందుకొన్నారు. విశాఖ వేదికగా జరిగిన తొలి టీ-20పోరులో భారత్ కు 2 వికెట్ల విజయంతో శుభారంభం చేశారు. గతంలో ద్రవిడ్ అందుబాటులో లేని సమయంలో సైతం పలు సిరీస్ ల్లో భారత జట్టు చీఫ్ కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించారు.

ఇప్పుడు..రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియటంతో..చీఫ్ కోచ్ పదవిని వీవీఎస్ లక్ష్మణ్ తో భర్తీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. గతంలో జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ గా పనిచేసిన ద్రవిడ్ ఆ తర్వాత భారత జూనియర్ జట్లతో పాటు టీమిండియాకు సైతం ప్రధాన శిక్షకుడిగా వ్యవహరించారు.

ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ చైర్మన్ గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ సైతం చీఫ్ కోచ్ బాధ్యతల్ని తీసుకోడం కేవలం లాంఛనమేనని క్రికెట్ పండితులు చెబుతున్నారు.

డిసెంబర్ 10 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే టీ-20 సిరీస్ కు చీఫ్ కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వం వహించనున్నారు.

ద్రవిడ్ నిర్ణయం వెనుక...

నెలకు కోటి రూపాయలు వేతనంతో పని చేసే చీఫ్ కోచ్ కాంట్రాక్టును రాహుల్ ద్రవిడ్ నిరాకరించడం వెనుక బలమైన కారణమే ఉంది. భారతజట్టు సభ్యుడిగా 20 సంవత్సరాలపాటు కుటుంబానికి దూరంగా గడిపిన ద్రవిడ్...చీఫ్ కోచ్ గా కూడా గత రెండేళ్ళుగా విదేశీ పర్యటనలతో గడపాల్సి వచ్చింది. కుటుంబం కోసం సమయం కేటాయించడమే లక్ష్యంగా..తన కాంట్రాక్టును పొడిగించరాదని ద్రవిడ్ కోరినట్లుగా బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. అయితే..హోంసిటీ బెంగళూరు వేదికగా నిర్వహించే జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ పదవిని మరోసారి చేపట్టడానికి సుముఖంగానే ఉన్నట్లు భావిస్తున్నారు.

రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ గా గత రెండేళ్ల కాలంలో భారత జట్టు ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లతో జరిగిన స్వదేశీ, బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్లతో జరిగిన విదేశీ సిరీస్ లను గెలుచుకోగలిగింది.

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక జట్లతో జరిగిన స్వదేశీ టీ-20 సిరీస్ ల్లో సైతం భారత్ విజేతగా నిలువగలిగింది.

దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు, వన్డే సిరీస్ లతో పాటు ఇంగ్లండ్ తో సిరీస్ లోని ఆఖరి టెస్టులో మాత్రం భారత్ పరాజయాలు చవిచూడాల్సి వచ్చింది.

First Published:  25 Nov 2023 2:02 PM IST
Next Story