Telugu Global
Sports

తెలుగు రాష్ట్ర్రాలు వేదికగా ఇంగ్లండ్ తో రెండు టెస్టుమ్యాచ్ లు!

ఐసీసీటెస్టు లీగ్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగే ఐదుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లోని మొదటి రెండు టెస్టులను తెలుగు రాష్ట్ర్రాల వేదికగా నిర్వహించనున్నారు.

తెలుగు రాష్ట్ర్రాలు వేదికగా ఇంగ్లండ్ తో రెండు టెస్టుమ్యాచ్ లు!
X

ఐసీసీటెస్టు లీగ్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగే ఐదుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లోని మొదటి రెండు టెస్టులను తెలుగు రాష్ట్ర్రాల వేదికగా నిర్వహించనున్నారు.

2023-2025 ఐసీసీ టెస్టు లీగ్ పోరులో భాగంగా భారత్- ఇంగ్లండ్ జట్లు పాంచ్ పటాకా సిరీస్ కు సై అంటున్నాయి. జనవరి 25 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ లోని మొదటి రెండు టెస్టులకు తెలుగు రాష్ట్ర్రాల ప్రధాన క్రికెట్ వేదికలు ఆతిథ్యమివ్వనున్నాయి.

హైదరాబాద్, విశాఖ వేదికలుగా టెస్ట్ మ్యా్చ్ లు...

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జనవరి 25 నుంచి 29 వరకూ ఇంగ్లండ్ తో తొలి టెస్టు మ్యాచ్ ను నిర్వహించనున్నారు. ఆ తరువాత జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ కు విశాఖపట్నంలోని ఆంధ్ర క్రికెట్ సంఘం..డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి 6 వరకూ ఆతిథ్యమివ్వనుంది. తెలుగు రాష్ట్ర్రాలకు చెందిన రెండు వేదికల్లో ఒకదాని వెనుక ఒకటిగా రెండు టెస్టులు నిర్వహించనుండటం ఇదే మొదటిసారి.

సిరీస్ లోని చివరి మూడు టెస్టు మ్యాచ్ లను ఫిబ్రవరి 15నుంచి 19 వరకూ రాజ్ కోట, 23 నుంచి 27 వరకూ రాంచీ, మార్చి 7 నుంచి 11 వరకూ ధర్మశాల వేదికలుగా నిర్వహిస్తారు. భారత జట్టుకు రోహిత్ శర్మ, ఇంగ్లండ్ జట్టుకు బెన్ స్టోక్స్ నాయకత్వం వహించనున్నారు.

మొదటి 2 టెస్టులకు 16మంది సభ్యుల భారతజట్టు

ఐదుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా జరిగే మొదటి రెండుటెస్టుల కోసం రోహిత్ శర్మ కెప్టెన్సీలో 16 మంది సభ్యుల భారతజట్టును బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించింది.

వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ను తప్పించి...యూపీ యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ కు తొలిసారిగా జట్టులో చోటు కల్పించారు. వెటరన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ గాయంతో అందుబాటులో లేకపోడంతో..ఆవేశ్ ఖాన్ కు చోటు దక్కింది.

చోటు నిలుపుకొన్న కెఎస్ భరత్...

ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ కెఎస్ భరత్ భారత టెస్టుజట్టులో తన చోటును నిలుపుకోగలిగాడు. దక్షిణాఫ్రికాతో ముగిసిన రెండుమ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరి టెస్టు కోసం జట్టులో చేరిన భారత్ ను ప్రస్తుత సిరీస్ లోని మొదటి రెండుటెస్టులకు కొనసాగించాలని ఎంపిక సంఘం నిర్ణయించింది.

కెఎల్ రాహుల్, కెఎస్ భరత్, ధృవ్ జురెల్ రూపంలో ప్రస్తుత భారతజట్టుకు ముగ్గురు వికెట్ కీపర్ బ్యాటర్లు అందుబాటులో ఉన్నారు.

పేసర్ల బాధ్యతను జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్, స్పిన్నర్లుగా అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ నిర్వర్తించనున్నారు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, వన్ డౌన్ లో శుభ్ మన్ గిల్, విరాట్ కొహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ బ్యాటింగ్ కు దిగనున్నారు.

దక్షిణాఫ్రికాతో ముగిసిన రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో పాల్గొన్న ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్, పేసర్ ప్రసిద్ధ కృష్ణ, ఆల్ రౌండర్ శార్ధూల్ ఠాకూర్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఇంగ్లండ్ తో సిరీస్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు.

First Published:  13 Jan 2024 2:32 PM IST
Next Story