భారత టీ-20 జట్టులో ఆంధ్రా ఆల్ రౌండర్!
జింబాబ్వే తో టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో ఆంధ్రా కుర్రాడు, యువఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తొలిసారిగా చోటు సంపాదించాడు.
జింబాబ్వే తో టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో ఆంధ్రా కుర్రాడు, యువఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తొలిసారిగా చోటు సంపాదించాడు.
భారత టీ-20 జట్టుకు కొత్తరక్తం ఎక్కించాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్రస్తుత ప్రపంచకప్ తరువాత జింబాబ్వేతో జరిగే ఐదుమ్యాచ్ ల సిరీస్ లో పాల్గొనే భారతజట్టు కోసం 15 మంది యువఆటగాళ్లను చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించారు.
జులై 6 నుంచి జింబాబ్వేతో సిరీస్...
జింబాబ్వేలోని హరారే వేదికగా జరిగే ఐదుమ్యాచ్ ల సిరీస్ లో పాల్గొనే భారతజట్టుకు యువఓపెనర్ శుభ మన్ గిల్ ను కెప్టెన్ గా నియమించారు. ప్రస్తుత జట్టులోని సీనియర్ స్టార్లు ( రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, బుమ్రా, జడేజా, పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ లకు విశ్రాంతి ఇస్తున్నట్లు తెలిపారు.
భారతజట్టులో చోటు సంపాదించిన నవతరం ఆటగాళ్లలో రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి ఉన్నారు.
జట్టులోని 15 మందిలో రితురాజ్ గయక్వాడ్, రింకూ సింగ్, సంజు శాంసన్ ( వికెట్ కీపర్ ), ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్ పాండే ఉన్నారు.
ఐపీఎల్ అనుభవంతో గిల్ కు కెప్టెన్సీ...
ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు నాయకత్వం వహించిన అనుభవం కలిగిన శుభ్ మన్ గిల్ కు భారతజట్టు పగ్గాలను అప్పగించారు. ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ తో రోహిత్, విరాట్ లాంటి పలువురు సీనియర్ స్టార్లు రిటైర్ కానున్న నేపథ్యంలో జట్టులో యువఆటగాళ్లకు చోటు కల్పించారు. ఐపీఎల్ -17వ సీజన్ లో అద్భుతంగా రాణించిన నవతరం ప్లేయర్లంతా చోటు దక్కించుకోగలిగారు.
చెన్నై ఓపెనింగ్ బౌలర్ గా 17 వికెట్లు పడగొట్టిన తుషార్ దేశ్ పాండే, రాజస్థాన్ రాయల్స్ పేసర్ ఆవేశ్ ఖాన్, ఢిల్లీ బౌలర్ ఖలీల్ అహ్మద్, స్వింగ్ బౌలర్ ముకేశ్ కుమార్ లతో పేస్ బౌలింగ్ ఎటాక్ ను సిద్ధం చేశారు.
స్పిన్ బౌలింగ్ విభాగంలో వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయ్, అభిషేక్ శర్మ కీలకం కానున్నారు. వికెట్ కీపింగ్ లో సంజు శాంసన్, ధృవ్ జురెల్ బాధ్యతలు పంచుకోనున్నారు.
తెలుగు కుర్రాళ్లకు మిశ్రమ ఫలితాలు...
టీ-20 ఫార్మాట్లో అత్యంత ప్రతిభావంతులైన తెలుగు రాష్ట్ర్రాల క్రికెటర్లు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డిలకు మిశ్రమఫలితాలు ఎదురయ్యాయి. ముంబై ఫ్రాంచైజీకి ఆడే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తిలక్ వర్మను పక్కన పెట్టి..హైదరాబాద్ సన్ రైజర్స్ కు ఆడుతున్న విశాఖపట్నం పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి భారతజట్టులో చోటు కల్పించారు. హార్థిక్ పాండ్యా స్థానంలో పేస్ ఆల్ రౌండర్ గా నితీశ్ కుమార్ ను తీర్చిదిద్దాలని ఎంపిక సంఘం నిర్ణయించింది. ఐపీఎల్- 17వ సీజన్ లో అత్యుత్తమ యువఆటగాడి అవార్డుకు ఎంపికైన నితీశ్ .జింబాబ్వే సిరీస్ ద్వారా సత్తా చాటుకోవాల్సి ఉంది.
అసోం తొలి బ్యాటర్ రియాన్ పరాగ్...
దేశవాళీ టీ-20 క్రికెట్ టోర్నీలతో పాటు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున వరుసహాఫ్ సెంచరీలతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన అసోం ఆటగాడు రియాన్ పరాగ్ ను ఎంపిక సంఘం ఎట్టకేలకు కరుణించింది. భారత టీ-20 జట్టులో తొలిసారిగా చోటు కల్పించింది.
హైదరాబాద్ సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో ఓపెనర్ గా 484 పరుగులు సాధించడంతో పాటు పలు వికెట్లు సైతం పడగొట్టాడు.
జింబాబ్వేలోని హారారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా 8 రోజుల వ్యవధిలో జులై 6 నుంచి 5 టీ-20 మ్యాచ్ ల్లో శుభ్ మన్ గిల్ నాయకత్వంలోని భారతజట్టు పోటీపడనుంది.