Telugu Global
Sports

విరాట్ ను ఊరిస్తున్న మూడు ప్రపంచకప్ రికార్డులు!

భారత క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీని మరో మూడు టీ-20 ప్రపంచకప్ రికార్డులు ఊరిస్తున్నాయి. తన కెరియర్ లో ఆఖరి టీ-20 ప్రపంచకప్ కు విరాట్ పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాడు.

విరాట్ ను ఊరిస్తున్న మూడు ప్రపంచకప్ రికార్డులు!
X

భారత క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీని మరో మూడు టీ-20 ప్రపంచకప్ రికార్డులు ఊరిస్తున్నాయి. తన కెరియర్ లో ఆఖరి టీ-20 ప్రపంచకప్ కు విరాట్ పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాడు.

భారత స్టార్ బ్యాటర్, రికార్డుల మొనగాడు విరాట్ కొహ్లీ తన కెరియర్ లో ఆఖరి టీ-20 ప్రపంచకప్ ఆడటానికి న్యూయార్క్ నగరం చేరుకొన్నాడు. రన్ మెషీన్ విరాట్ కోసం..మరో మూడు టీ-20 ప్రపంచకప్ రికార్డులు ఎదురుచూస్తున్నాయి.

రోహిత్ శర్మ నాయకత్వంలో....

డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ నాయకత్వంలో రెండోసారి టీ-20 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొంటున్న విరాట్ కొహ్లీ ఆరునూరైనా భారత్ ను విశ్వవిజేతగా నిలపాలన్న పట్టుదలతో ఉన్నాడు.

గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ చేరినా..ఆస్ట్ర్రేలియాచేతిలో అనూహ్య పరాజయంతో చేజారిన టైటిల్ ను ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ ద్వారా భర్తీ చేసుకోవాలని రోహిత్, విరాట్, జస్ ప్రీత్ బుమ్రా భావిస్తున్నారు.

2011 వన్డే ప్రపంచకప్ విజయంలో తనవంతు పాత్ర నిర్వర్తించిన విరాట్..ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ లో సైతం సత్తా చాటుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. దీనికితోడు...కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఐపీఎల్ -17 లో అత్యధికంగా 700కు పైగా పరుగులు సాధించడం ద్వారా విరాట్ ఆరెంజ్ క్యాప్ అందుకొన్నాడు. అదేజోరును ఈనెల 5న ఐర్లాండ్ తో జరిగే ప్రపంచకప్ గ్రూప్- ప్రారంభమ్యాచ్ లో సైతం కొనసాగించాలన్న లక్ష్యంతో విరాట్ సాధన చేస్తున్నాడు.

రెండు ప్రపంచకప్ టోర్నీలలో బెస్ట్ ప్లేయర్ విరాట్..

టీ-20 ప్రపంచకప్ లో పరుగుల మోత మోగించడం, అవార్డులు గెలుచుకోడం విరాట్ కొహ్లీకి ఏమాత్రం కొత్త కాదు. 2014, 2016 ప్రపంచకప్ టోర్నీలలో బెస్ట్ ప్లేయర్ అవార్డులు గెలుచుకొన్న విరాట్..2014, 2022 ప్రపంచకప్ టోర్నీలలో టాప్ స్కోరర్ గా కూడా నిలిచాడు.

అమెరికా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో ప్రారంభమైన 2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో సైతం పరుగుల సునామీ సృష్టించడానికి విరాట్ ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో మూడు సరికొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం విరాట్ కు ఉంది.

టీ-20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక ఫోర్లు సాధించిన ఆటగాడి రికార్డును విరాట్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్థనే పేరుతో ఉన్న 111 బౌండ్రీల రికార్డును విరాట్ అధిగమించే అవకాశం ఉంది. విరాట్ ఇప్పటి వరకూ 103 ఫోర్లు మాత్రమే సాధించాడు.

సింగిల్ ప్రపంచకప్ లో అత్యధిక పరుగుల రికార్డు..

సింగిల్ ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ రికార్డు సైతం విరాట్ కు చేరువగా ఉంది. 2014 ప్రపంచకప్ లో ఆడిన 6 మ్యాచ్ ల్లో 4 హాఫ్ సెంచరీలతో సహా 319 పరుగులు సాధించిన విరాట్..ప్రస్తుత ప్రపంచకప్ లో తన రికార్డును తానే అధిగమించే అవకాశం ఉంది.

ప్రపంచకప్ లో అత్యధిక పరుగుల రికార్డు...

2007 నుంచి ప్రస్తుత 2024 టీ-20 ప్రపంచకప్ టోర్నీల వరకూ అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ రికార్డు సైతం విరాట్ ను ఊరిస్తోంది. తన కెరియర్ లో 2022 ప్రపంచకప్ వరకూ 27 మ్యాచ్ లు ఆడిన విరాట్ 1141 పరుగులు సాధించాడు. 131.30 స్ట్రయిక్ రేటుతో 81.50 సగటుతో అత్యంత విజయవంతమైన బ్యాటర్ గా నిలిచాడు. విరాట్ ఖాతాలో 14 హాఫ్ సెంచరీలు సైతం ఉన్నాయి.

ప్రస్తుత ప్రపంచకప్ ద్వారా తన పరుగుల సంఖ్యను విరాట్ 1500కు పెంచుకొనే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

అరుదైన ఈ మూడు రికార్డులతో పాటు..ప్రపంచకప్ శతకంతో పాటు..భారత్ ను మరోసారి విశ్వవిజేతగా నిలుపగలిగితే విరాట్ కెరియర్ పరిపూర్ణమవుతుంది.

First Published:  2 Jun 2024 8:14 AM GMT
Next Story