బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో తెలుగు క్రికెటర్లు!
బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులపై గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. 2024 సంవత్సరానికి సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను బోర్డు కార్యదర్శి జే షా విడుదల చేశారు.
ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు..2024 సీజన్ కు సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించింది. టెస్ట్, వన్డే, టీ-20 ఫార్మాట్లలో భారత ప్రధాన ఆటగాళ్లు మొత్తం 30 మందికి నాలుగు గ్రేడ్లుగా కాంట్రాక్టులను ఖరారు చేసింది.
బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులపై గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. 2024 సంవత్సరానికి సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను బోర్డు కార్యదర్శి జే షా విడుదల చేశారు. మొత్తం 30 మంది ఆటగాళ్లకు నాలుగు గ్రేడ్లుగా వార్షిక కాంట్రాక్టులను ఖరారు చేశారు. తెలుగు రాష్ట్ర్రాలకు చెందిన ముగ్గురు క్రికెటర్లు కాంట్రాక్టు జాబితాలో చోటు సంపాదించుకోగలిగారు.
క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ భారతజట్టుకు సేవలు అందిస్తున్నవారికి గ్రేడ్-ఏ ప్లస్ కాంట్రాక్టు కింద ఏడాదికాలానికి 7 కోట్ల రూపాయలు గ్యారెంటీమనీగా బీసీసీఐ చెల్లించనుంది.
గ్రేడ్- ఏ కాంట్రాక్టు కింద 5 కోట్లు, గ్రేడ్- బీ కాంట్రాక్టులో భాగంగా 3 కోట్ల రూపాయలు, గ్రేడ్- సీ కింద ఏడాదికి కోటి రూపాయలు చొప్పున చెల్లించనున్నారు. వచ్చే 12 మాసాల కాలంలో గాయాలతో భారతజట్టుకు దూరమైనా, తుదిజట్లలో చోటు దక్కినా, దక్కకపోయినా ఈ కాంట్రాక్టు మొత్తాన్ని మొత్తం 30 మందికి అందచేయనున్నారు.
శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, పూజారాలకు షాక్..
దేశవాళీ క్రికెట్ ఆడంటూ బోర్డు పదేపదే చెబుతున్నా పెడచెవిన పెట్టిన శ్రేయస్ అయ్య్రర్, ఇషాన్ కిషన్ లను వార్షిక కాంట్రాక్టు జాబితా నుంచి బీసీసీఐ తొలగించింది. అయితే..రంజీట్రోఫీ మ్యాచ్ లు ఆడుతూ టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తున్న వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పూజారాతో పాటు..ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, దీపక్ హుడా, యజువేంద్ర చాహల్ లకు సైతం కాంట్రాక్టు దక్కలేదు.
మహ్మద్ సిరాజ్, గిల్ లకు ప్రమోషన్..
గత సీజన్ వరకూ గ్రేడ్-బీ కాంట్రాక్టులో కొనసాగిన హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, కెఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్ లకు గ్రేడ్ -ఏ కాంట్రాక్టు ప్లేయర్లుగా ప్రమోషన్ దక్కింది. ఈ ముగ్గురికీ 5 కోట్ల రూపాయల చొప్పన చెల్లించనున్నారు.
2023 సీజన్లో గ్రేడ్- సీ కాంట్రాక్టులో ఉన్న లెఫ్టామ్ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు సైతం బీ-గ్రేడ్ ప్రమోషన్ దక్కింది. కుల్దీప్ ను 3 కోట్ల రూపాయల వార్షిక కాంట్రాక్టు జాబితాలో చేర్చారు.
ఇద్దరికి డిమోషన్.....
2023 వార్షిక కాంట్రాక్టుల్లో గ్రేడ్- ఏ క్రికెటర్లకు ఏడాదికి 5 కోట్ల రూపాయల మొత్తం అందుకొన్న అక్షర్ పటేల్, రిషభ్ పంత్ లను డిమోట్ చేసి గ్రేడ్-బీ కాంట్రాక్టులో ఉంచారు.
2024 సీజన్లో ఈ ఇద్దరికీ 3 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించనున్నారు.
ఆల్-ఇన్-వన్ లో నలుగురికే చోటు...
సాంప్రదాయ టెస్ట్, ఇన్ స్టంట్ వన్డే, ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లలో భారత్ కు కీలక ఆటగాళ్లుగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ, యార్కర్ల కింగ్
జస్ ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలకు మాత్రమే గ్రేడ్-ఏ ప్లస్ కాంట్రాక్టు దక్కింది. ఈ నలుగురు ఆటగాళ్లు మ్యాచ్ ఫీజులు కాకుండా ఏడాదికి 7 కోట్ల రూపాయల చొప్పున సెంట్రల్ కాంట్రాక్టు కింద గ్యారెంటీ మనీ అందుకోనున్నారు.
గ్రేడ్- ఏలో శుభ్ మన్ గిల్
ఏడాదికి 5 కోట్ల రూపాయలు చెల్లించే గ్రేడ్-ఏ కాంట్రాక్టును కేవలం ఆరుగురికి మాత్రమే ఇచ్చారు. వీరిలో రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కెఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్, హార్ధిక్ పాండ్యా ఉన్నారు.
గ్రేడ్-బీలో యశస్వి జైశ్వాల్...
ఏడాదికి 3 కోట్ల రూపాయల గ్రేడ్ -బీ కాంట్రాక్టు యువఓపెనర్ యశస్వీ జైశ్వాల్ కు దక్కింది. ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు లీగ్ సిరీస్ లోని మొదటి నాలుగు టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు బాదటం ద్వారా టాప్ స్కోరర్ గా నిలిచిన 23 సంవత్సరాల యశస్వి తొలిసారిగా గ్రేడ్- బీ కాంట్రాక్టు జాబితాలో చోటు సంపాదించగలిగాడు.
టీ-20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ సైతం గ్రేడ్-బీ కాంట్రాక్టు జాబితాలో ఉన్నారు.
తిలక్ వర్మ, భరత్ లకు గ్రేడ్- సీ కాంట్రాక్టు...
తెలుగు రాష్ట్ర్రాల క్రికెటర్లు తిలక్ వర్మ, కెఎస్ భరత్ కు గ్రేడ్-సీ కాంట్రాక్టు దక్కింది. ఈ ఇద్దరికీ ఏడాదికి కోటిరూపాయలు చొప్పున అందచేస్తారు. గ్రేడ్- సీ జాబితాలో చోటు సంపాదించిన ఇతర ఆటగాళ్లలో రింకూ సింగ్, రుతురాజ్ గాయక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, రవి బిష్నోయ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముకేశ్ కుమార్, సంజు శాంసన్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ, ఆవేశ్ ఖాన్, రజత్ పాటిదార్ ఉన్నారు.
బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల చరిత్రలోనే తొలిసారిగా ఐదుగురు యువఫాస్ట్ బౌలర్లకు ప్రత్యేక కాంట్రాక్టులను ఇచ్చారు. వీరిలో ఆకాశ్ దీప్, విజయ్ కుమార్ వ్యషక్, ఉమ్రాన్ మాలిక్, యాశ్ దయాల్, విద్వత్ కావేరప్ప ఉన్నారు.
వచ్చే 12 మాసాల కాలంలో భారతజట్టు ఆడే టెస్టు, వన్డే, టీ-20 మ్యాచ్ లు, సిరీస్ లను కాంట్రాక్టు జాబితాలోని మొత్తం 30 మంది క్రికెటర్లతోనే ఆడనుంది.