రెండో టీ-20లో భారత్ కు సఫారీల షాక్ !
సఫారీవేటలో భారత్ కు తొలి ఓటమి ఎదురయ్యింది. రెండో టీ-20లో దక్షిణాఫ్రికా 5 వికెట్లతో సూర్యసేనను కంగు తినిపించింది...
సఫారీవేటలో భారత్ కు తొలి ఓటమి ఎదురయ్యింది. రెండో టీ-20లో దక్షిణాఫ్రికా 5 వికెట్లతో సూర్యసేనను కంగు తినిపించింది...
2023 సీజన్ దక్షిణాఫ్రికా పర్యటనను భారత్ ఓటమితో మొదలు పెట్టింది. తీన్మార్ టీ-20 సిరీస్ లో భాగంగా క్వెబా లోని సెయింట్స్ జార్జ్ పార్క్ వేదికగా
జరిగిన రెండో టీ-20లో భారత బౌలర్లు గతితప్పడంతో ఆతిథ్య సఫారీజట్టు 5 వికెట్ల విజయంతో 1-0తో పైచేయి సాధించగలిగింది.
సూర్య, రింకూ పోరాడినా....
సిరీస్ లోని తొలిమ్యాచ్ వానదెబ్బతో రద్దయిన నేపథ్యంలో జరిగిన కీలక రెండోపోరులో దక్షిణాఫ్రికా కెప్టెన్ మర్కరమ్ కీలక టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్నాడు.
వానముప్పు పొంచి ఉన్న ఈ పోరులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కేవలం ఆరు పరుగుల స్కోరుకే ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ ( 0 ), శుభ్ మన్ గిల్ (0 ) ల వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది.
యశస్విని మార్కో జెన్సన్ డకౌట్ గా పడగొడితే..విలియమ్స్ బౌలింగ్ లో గిల్ తన ఖాతా తెరువకుండానే వెనుదిరిగాడు. ఓపెనర్లిద్దరూ డకౌట్లుగా అవుటైన నేపథ్యంలో క్రీజులోకి వచ్చిన వన్ డౌన్ తిలక్ వర్మ- కెప్టెన్ సూర్యకుమార్ 5.5 ఓవర్లలో మూడో వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో దారి తప్పిన తమజట్టును తిరిగి గాడిలో పెట్టారు.
తిలక్ వర్మ 20 బంతుల్లో 4 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 29 పరుగుల స్కోరుకు అవుట్ కావడంతో భారత్ మూడో వికెట్ నష్టపోయింది. దీంతో వీరబాదుడు రింకూ సింగ్ వచ్చి తన కెప్టెన్ సూర్యతో జతకలిశాడు.
రింకూ మెరుపు బ్యాటింగ్...
సూర్యకుమార్ యాదవ్- రింకూ సింగ్ జోడీ నాలుగో వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయడంతో భారత్ మొదటి 11 ఓవర్లలోనే 100 పరుగుల స్కోరును సాధించగలిగింది.
అప్పటికే 28 బంతుల్లోనే ధూమ్ ధామ్ హాఫ్ సెంచరీ సాధించిన సూర్య చివరకు 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులకు అవుట్ కావడంతో భారత పరుగుల వేగానికి బ్రేక్ పడింది.
మిడిలార్డర్ బ్యాటర్ రింకూసింగ్ ఒంటరి పోరాటం చేసి 39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లలో జితేశ్ శర్మ ఒక్క పరుగుకే అవుట్ కాగా..రవీంద్ర జడేజా ఒక్కో బౌండ్రీ, సిక్సర్ షాట్లతో 19 పరుగుల స్కోరు సాధించాడు.
భారత్ 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగుల స్కోరు మాత్రమే సాధించగలిగింది. దక్షిణాఫ్రికా స్పిన్నర్ షంషీ 3 వికెట్లు పడగొట్టాడు.
పసలేని భారత బౌలింగ్....
మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 181 పరుగులు చేయాల్సిన దక్షిణాఫ్రికా చేజింగ్ కు దిగిన సమయంలో వాన పడడంతో మ్యాచ్ కు అంతరాయం కలిగింది. దీంతో లక్ష్యాన్ని డక్ వర్త్ లూయిస్ విధానం ద్వారా సవరించారు. 15 ఓవర్లలో 152 పరుగులు చేయాల్సిన సఫారీటీమ్ కేవలం 13.5 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికే లక్ష్యం చేరుకోగలిగింది.
ఓపెనింగ్ జోడీ రీజా హెండ్రిక్స్- మాథ్యూ మొదటి 5 ఓవర్లలోనే 67 పరుగుల భాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. దీనికితోడు భారత బౌలర్లు సైతం గతి తప్పడంతో ప్రత్యర్థి బ్యాటర్లు మరింతజోరుగా బ్యాటింగ్ చేయగలిగారు.
భారత ఓపెనింగ్ బౌలర్ అర్షదీప్ సింగ్ తన తొలి ఓవర్లోనే 24 పరుగులివ్వడం భారత అవకాశాలను దెబ్బతీసింది. 27 బంతుల్లోనే రీజా హెండ్రిక్స్ 49 పరుగులు, మాథ్యూ 16 పరుగుల స్కోర్లకు అవుటయ్యారు.
కెప్టెన్ మర్కరమ్ 30, మిల్లర్ 17, స్టబ్స్ 14, పెలుకువాయా 10 పరుగుల స్కోర్లు సాధించడంతో దక్షిణాఫ్రికా విజేతగా నిలువగలిగింది.
భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ 2 వికెట్లు, సిరాజ్, కుల్దీప్ చెరో వికెట్ పడగొట్టారు.
సఫారీల విజయంలో ప్రధానపాత్ర వహించిన చైనామన్ బౌలర్ తబ్రీజ్ షంషీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
భారత్ 13- దక్షిణాఫ్రికా 12
ప్రస్తుత ఈ గెలుపుతో 6వ ర్యాంకర్ దక్షిణాఫ్రికా ప్రత్యర్థి భారత్ పై 12వ విజయం నమోదు చేయగిలిగింది. ఈ రెండో టీ-20 మ్యాచ్ వరకూ రెండుజట్లు 25 మ్యాచ్ ల్లో తలపడితే భారత్ 13 విజయాలతో ఉంది.
2017-18 తరువాత సఫారీగడ్డపై తొలిసారిగా ద్వైపాక్షిక టీ-20 సిరీస్ లో పాల్గొంటున్న ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్ కు 2015-16 సిరీస్ తర్వాత నుంచి దక్షిణాఫ్రికా ప్రత్యర్థిగా ద్వైపాక్షిక సిరీస్ ల్లో పరాజయం అన్నదే లేకపోడం విశేషం.
సిరీస్ లో సమఉజ్జీగా నిలవాలంటే ఈనెల 14న జోహెన్స్ బర్గ్ వేదికగా జరిగే కీలక ఆఖరి టీ-20లో ఆరునూరైనా భారత్ నెగ్గితీరాల్సి ఉంది.
బాదిన అరుదైన రికార్డు ఉంది.