టీ-20 ప్రపంచకప్ 'రికార్డు మ్యాచ్ ల' మొనగాడు రోహిత్!
ఐసీసీ టీ-20 ప్రపంచకప్ మ్యాచ్ ల చరిత్రలోనే ఓ అసాధారణ రికార్డుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఉరకలేస్తున్నాడు. వరుసగా 9వ ప్రపంచకప్ టోర్నీ బరిలోకి దిగుతున్నాడు.

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ మ్యాచ్ ల చరిత్రలోనే ఓ అసాధారణ రికార్డుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఉరకలేస్తున్నాడు. వరుసగా 9వ ప్రపంచకప్ టోర్నీ బరిలోకి దిగుతున్నాడు.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూ..ధూమ్ ధామ్ టీ-20 ప్రపంచకప్ కూ అవినాభావ సంబంధమే ఉంది. 2007లో ఐసీసీ ప్రారంభించడమే కాదు..రెండేళ్లకోసారి నిర్వహిస్తూ వస్తున్న ప్రతిఒక్క టోర్నీలోనూ పాల్గొన్న ఒకే ఒక్కడుగా, అత్యధిక మ్యాచ్ లు ఆడిన తొలి ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.
17 ఏళ్లు- 9 ప్రపంచకప్ టోర్నీలు....
దక్షిణాఫ్రికా వేదికగా 2007లో జరిగిన మొట్టమొదటి టీ-20 ప్రపంచకప్ లో రోహిత్ శర్మ నూనూగు మీసాల క్రికెటర్ గా పోటీకి దిగాడు. అంతేకాదు..భారత్ విశ్వవిజేతగా నిలవడంలో రోహిత్ కీలకపాత్ర పోషించాడు. మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో టీ-20 ప్రపంచకప్ అరంగేట్రం చేసిన రోహిత్ ఆ తరువాత మరి వెనుదిరిగి చూసింది లేదు.
2007 ప్రారంభ ప్రపంచకప్ నుంచి ప్రస్తుత 9వ ( 2024 ) ప్రపంచకప్ వరకూ విడవకుండా ప్రతి ఒక్కటోర్నీలో పాల్గొన్న ఇద్దరు క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు.
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, స్పిన్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ సైతం వరుసగా తొమ్మిదో ప్రపంచకప్ లో పాల్గొనడం ద్వారా రోహిత్ సరసన నిలిచాడు.
39 మ్యాచ్ లతో రోహిత్ టాప్..
38 సంవత్సరాల రోహిత్ శర్మ 21 సంవత్సరాల వయసులో తొలిసారిగా టీ-20 ప్రపంచకప్ బరిలో నిలిచాడు. ఆ తరువాత నుంచి 2007, 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022 టోర్నీలలో పాల్గొంటూ వచ్చాడు. ఈ క్రమంలో 39 మ్యాచ్ లు ఆడటం ద్వారా ..ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
ప్రస్తుత ప్రపంచకప్ లో భాగంగా గ్రూపు- ఏ లీగ్ లో నాలుగుమ్యాచ్ లు, సూపర్- 8 రౌండ్, ఆ తర్వాతి నాకౌట్ రౌండ్ల మ్యాచ్ ల్లో పాల్గొనడం ద్వారా రోహిత్ తన రికార్డును తానే అధిగమించుకొనే అవకాశం ఉంది.
గత ప్రపంచకప్ లో రోహిత్ నాయకత్వంలోనే భారత్ పోటీ సెమీస్ లోనే ముగిసింది. గత ఎనిమిది ప్రపంచకప్ టోర్నీలలో ఆడిన 39 మ్యాచ్ ల ద్వారా రోహిత్ 963 పరుగులు సాధించాడు. ప్రస్తుత 2024 ప్రపంచకప్ లీగ్ దశలోనే రోహిత్ 1000 పరుగుల మైలురాయిని చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
బంగ్లా ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ 2007 నుంచి 2022 వరకూ వరుసగా ఎనిమిది ప్రపంచకప టోర్నీలలో 36 మ్యాచ్ లు ఆడి 742 పరుగులు సాధించడంతో పాటు 47 వికెట్లు పడగొట్టాడు.
ప్రస్తుత ప్రపంచకప్ లోనే షకీబుల్ 1000 పరుగులు, 50 వికెట్ల మైలురాయిని చేరే అవకాశం లేకపోలేదు.
మూడోస్థానంలో తిలకరత్నే దిల్షాన్...
శ్రీలంక మాజీ ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ 2007 నుంచి 2016 ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొనడం ద్వారా ఆడిన 35 మ్యాచ్ ల్లో 897 పరుగులు సాధించడంతో పాటు 2 వికెట్లు సైతం పడగొట్టాడు.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహీద్ ఆఫ్రిదీ 2007 నుంచి 2016 ప్రపంచకప్ వరకూ 34 మ్యాచ్ లు ఆడి 546 పరుగులు, 39 వికెట్ల రికార్డు నమోదు చేశాడు. పాకిస్థాన్ మరో మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ సైతం 2007 నుంచి 2021 వరకూ జరిగిన ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొని 34 మ్యాచ్ ల్లోనే 646 పరుగులతో పాటు 3 వికెట్లు పడగొట్టాడు.
ఆస్ట్ర్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 2009 నుంచి 2022 ప్రపంచకప్ టోర్నీల వరకూ 34 మ్యాచ్ లు ఆడి 806 పరుగులు సాధించాడు.
ధోనీ 33 మ్యాచ్ ల్లో529 పరుగులు..
భారత్ కు టీ-20 ప్రపంచకప్ అందించిన ఏకైక కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 2007 నుంచి 2016 ప్రపంచకప్ వరకూ 33 మ్యాచ్ లు ఆడి 529 పరుగులు సాధించాడు. వికెట్ కీపర్ గా పలు క్యాచ్ లు , స్టంపింగ్ లు సైతం చేశాడు.
వెస్టిండీస్ ఆల్ టైమ్ గ్రేట్ ఓపెనర్ క్రిస్ గేల్ 2007 నుంచి 2021 వరకూ 965 పరుగులు, 10 వికెట్లతో 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. బంగ్లా మాజీ కెప్టెన్ ముస్తాఫిజుర్ రహీమ్ 2007 నుంచి 2021 ప్రపంచకప్ వరకూ 33 మ్యాచ్ లు ఆడి 402 పరుగులు సాధించడం ద్వారా అత్యధిక ప్రపంచకప్ మ్యాచ్ ల మొనగాళ్ల వరుసలో 10వ స్థానంలో నిలిచాడు.
రోహిత్ శర్మతో సహా వివిధ జట్లకు చెందిన పలువురు సీనియర్ క్రికెటర్లకు ఇదే ఆఖరి టీ-20 ప్రపంచకప్ కానుంది.