రెండో టీ 20కి వానముప్పు
నేడు గెబేహా వేదికగా సౌత్ ఆఫ్రికాతో ఇండియా రెండో టీ 20
ఇండియా, సౌత్ ఆఫ్రికా రెండో టీ 20 మ్యాచ్ కు వరుణగండం పొంచి ఉంది. సౌత్ ఆఫ్రికాలోని గెబేహా వేదికగా జరిగే ఈ మ్యాచ్ సమయానికి వర్షం కురిసే అవకాశముందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణాఫ్రికా కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు) రెండో టీ 20 జరగాల్సి ఉంది. ఆ సమయానికన్నా ముందే అక్కడ వర్షం కురిసే అవకాశముంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు, ఆట మధ్యలో వర్షం కురిస్తే గ్రౌండ్ రెడీ చేయడానికి ఎక్కువ సమయమే పడుతుంది. అదే జరిగితే మ్యాచ్ జరిగే అవకాశాలు దాదాపు లేకపోవచ్చు. పూర్తి స్థాయి మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే ఇరు జట్లతో కనీసం ఐదేసి ఓవర్లు ఆడిస్తారు. అది సాధ్యం కాదనుకుంటే మ్యాచ్ ను రద్దు చేస్తారు. డర్బన్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ లో టీమిండియా 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో మ్యాచ్ రద్దయితే మిగిలిన రెండు మ్యాచుల్లో ఒక్కటి గెలిచినా సిరీస్ టీమిండియా సొంతమవుతుంది.