రాహుల్ ద్రావిడ్ వారసుడు గౌతం గంభీర్!
భారతక్రికెట్ చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వారసుడిగా గౌతం గంభీర్ పేరు ఖరారయ్యింది. గంభీర్ షరతులకు బీసీసీఐ తలొగ్గింది....
భారతక్రికెట్ చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వారసుడిగా గౌతం గంభీర్ పేరు ఖరారయ్యింది. గంభీర్ షరతులకు బీసీసీఐ తలొగ్గింది....
భారత క్రికెట్ సరికొత్త చీఫ్ కోచ్ గా జట్టు పగ్గాలను భారత మాజీ ఓపెనర్ కమ్ కోల్ కతా మెంటార్ గౌతం గంభీర్ త్వరలో అందుకోనున్నాడు. ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ ముగియటంతోనే భారత చీఫ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగియనుండడంతో..ఆ స్థానాన్ని భర్తీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
కోల్ కతా గెలుపుతో దశ తిరిగిన గంభీర్...
ఐపీఎల్ -17వ సీజన్ విజేతగా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నిలవడంతో..ఆ జట్టులోని ఆటగాళ్ల సంగతేమో కానీ..మెంటార్ గా వ్యవహరించిన గౌతం గంభీర్ దశ మాత్రం తిరిగింది. పెద్దగా కష్టపడకుండానే బీసీసీఐ చీఫ్ కోచ్ పదవి గంభీర్ ను వరించనుంది.
నెలకు కోటి రూపాయల వేతనం పై గంభీర్ ను రాహుల్ ద్రావిడ్ స్థానంలో చీఫ్ కోచ్ గా నియమించడానికి బీసీసీఐ కసరత్తులు పూర్తి చేసింది.
బీజెపీ మాజీ ఎంపీ గౌతం గంభీర్...
గౌతం గంభీర్ బహుముఖ ప్రజ్ఞావంతుడు. భారత క్రికెట్ కు గతంలో ఓపెనర్ గా సేవలు అందించడంతో పాటు..2011 వన్డే ప్రపంచకప్ గెలుచుకోడంలో ప్రధానపాత్ర వహించాడు. తెలివైన క్రికెటర్ గా , గొప్పవ్యూహాకర్తగా కూడా గంభీర్ కు పేరుంది. పైగా కోల్ కతా ఫ్రాంచైజీని రెండుసార్లు విజేతగా నిలిపిన కెప్టెన్ గా కూడా గంభీర్ కు ఘనత ఉంది. 2024 ఐపీఎల్ సీజన్లో కోల్ కతాను తిరుగులేని జట్టుగా, చాంపియన్ గా నిలిపడం ద్వారా గంభీర్ తన సత్తాను మెంటార్ గా కూడా చాటుకోగలిగాడు.
క్రికెట్ వ్యాఖ్యాతగా, ప్రధాని మోడీ అండదండలతో బీజెపీ లోక్ సభ సభ్యుడిగా కూడా సేవలు అందించిన గంభీర్ కు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు,
బీసీసీఐ కార్యదర్శి జే షాతో సన్నిహిత సంబంధాలు సైతం ఉన్నాయి.
రాహుల్ ద్రావిడ్ వారసుడిగా గౌతం గంభీర్ ను ఎంపిక చేయటానికి బీసీసీఐ లాంఛనాలన్నీ పూర్తి చేసింది. ఐపీఎల్ లో కోల్ కతా జట్టు విజేతగా నిలిచిన రోజునే గంభీర్ ను భారత చీఫ్ కోచ్ గా ఉండాలని బీసీసీఐ కార్యదర్శి కోరటం, కొన్ని షరతులతో గంభీర్ ఆమోదం తెలపడం జరిగిపోయాయి.
గంభీర్ షరతులకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్..
భారతజట్టుకు తాను ప్రధాన శిక్షకుడిగా సేవలు అందించాలంటే కొన్ని షరతులను ఆమోదించాలని బీసీసీఐని కోరాడు. ప్రధానంగా ..సహాయక సిబ్బందిని తానే నియమించుకొంటానని, బీసీసీఐ ప్రమేయం ఉండరాదని గంభీర్ తేల్చి చెప్పాడు. దీనికి మరో ఆలోచన లేకుండా బీసీసీఐ ఓకె చెప్పింది.
భారత క్రికెట్ ను ఉన్నత శిఖరాలు చేర్చడానికి తనవద్ద ఎన్నో ఆలోచనలు, వ్యూహాలు ఉన్నాయని, తాను ఆశించిన ఫలితాలు సాధించాలంటే..తన వ్యూహాలను అమలు చేసే సహాయక సిబ్బంది ఉండితీరాలని గంభీర్ కోరాడు.
గంభీర్ ప్రధాన శిక్షకుడుగా బాధ్యతలు చేపట్టిన వెంటనే... తనకు నచ్చినవారిని బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ లుగా నియమించుకోనున్నాడు. ఇతర సహాయక సిబ్బందిని సైతం తనకు నచ్చినవారినే నియమించుకొనే అధికారాన్ని బీసీసీఐ ఇచ్చింది.
గంభీర్ కు నెలకు కోటి వేతనం...
ప్రపంచ క్రికెట్లోనే అత్యధిక వేతనం అందుకొంటున్న చీఫ్ కోచ్ ఎవరంటే..భారత క్రికెట్ ప్రధాన శిక్షకుడు మాత్రమేనని చెప్పాలి. ప్రస్తుత భారత చీప్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఏడాదికి 12 కోట్ల రూపాయల చొప్పున వేతనం అందుకొంటున్నాడు.
ద్రావిడ్ వారసుడిగా రానున్న గంభీర్ కు సైతం నెలకు కోటి రూపాయల చొప్పున రెండేళ్ల కాంట్రాక్టును బీసీసీఐ ఇవ్వనుంది. గంభీర్ నియామకాన్ని బీసీసీఐ కార్యదర్శి రానున్న కొద్దిరోజుల్లోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
కోల్ కతా మెంటార్ నుంచి భారత కోచ్ గా...
గౌతం గంభీర్ కు క్రికెట్ శిక్షకుడిగా ఎలాంటి అనుభవం లేకున్నా..మెంటార్ గా మాత్రం గొప్ప గుర్తింపే ఉంది. ప్రత్యర్థిజట్లు, ఆటగాళ్ల బలాబలాలను పసిగట్టడం, దానికి తగ్గట్టుగా వ్యూహాలు పన్నడంలో గంభీర్ కు గంభీర్ మాత్రమే సాటి. ఐపీఎల్ విజేతజట్టుకు ట్రోఫీ ప్రధాన సమయంలో బీసీసీఐ కార్యదర్శితో కోల్ కతా మెంటార్ గా గంభీర్మా ట్లాడుతూ కనిపించాడు.
కోల్ కతాను విజేతగా నిలపడంలో ప్రధానపాత్ర వహించిన గంభీర్ ను బోర్డు కార్యదర్శి జే షా, అధ్యక్షుడు రోజర్ బిన్నీ సైతం అభినందించారు. ఇదే సమయంలో..భారత జట్టు చీఫ్ కోచ్ పదవిని చేపట్టాలని గంభీర్ ను జే షా కోరినట్లు ప్రచారం జరిగింది.
ఇంతకు మించిన గౌరవం మరొకటి లేదు- గంభీర్
భారత క్రికెట్ ప్రధాన శిక్షకుడిగా బాధ్యతలు చేపట్టడాన్ని మించిన గౌరవం తనకు మరొకటి లేదని గౌతం గంభీర్ మురిసిపోతున్నాడు. భారతజట్టు అంటే కేవలం 15 మంది సభ్యులు మాత్రమే కాదని..140 కోట్ల మంది ఆకాంక్షలని గంభీర్ గుర్తు చేశాడు.
ప్రస్తుత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం జూన్ నెలతో ముగియనుండడంతో జూలై 1న సరికొత్త కోచ్ గా గంభీర్ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది.
విదేశీ శిక్షకులకు బీసీసీఐ 'నో'!
భారత క్రికెట్ ప్రస్తుత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వారసుడిగా స్వదేశీ కోచ్ ను మాత్రమే నియమిస్తామని, విదేశీకోచ్ లకు అవకాశమే లేదని బీసీసీఐ కార్యదర్శి జే షా కొద్దిరోజుల క్రితమే ప్రకటించడంతో..వీవీఎస్ లక్ష్మణ్ తో సహా పలువురు ప్రముఖ స్వదేశీ శిక్షకుల పేర్లు వినిపించాయి.అయితే..ఐపీఎల్ -17 సీజన్ విజేతగా కోల్ కతా నైట్ రైడర్స్ నిలవడంలో ప్రధానపాత్ర వహించిన భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ పేరు హఠాత్తుగా బయటకు వచ్చింది.
గతంలో భారతజట్టుకు జాన్ రైట్, డంకన్ ఫ్లెచర్, గ్యారీ కిర్ స్టెన్, గ్రెగ్ చాపెల్ లాంటి విదేశీ కోచ్ లు సేవలు అందించినా .. గ్యారీ కిర్ స్టెన్ మినహా మిగిలిన వారు ..ఆశించిన ఫలితాలు అందించలేకపోయారు.
ఆ తరువాత.. అనీల్ కుంబ్లే, రవి శాస్త్రి చీఫ్ కోచ్ లు గా భారతజట్టుకు పలు చిరస్మరణీయమైన విజయాలు అందించారు. గత మూడేళ్లుగా భారతజట్టు ప్రధాన శిక్షకుడిగా
ఉన్న రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో వన్డే ప్రపంచకప్, టెస్టు లీగ్ ఫైనల్స్ లో భారత్ రన్నరప్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
జూన్ 29 వరకూ జరిగే 2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో టాప్ ర్యాంకర్ భారత్ కు రాహుల్ ద్రావిడ్ చీఫ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు. 2011 తరువాత మరో ఐసీసీ ట్రోఫీ గెలుచుకోడంలో విఫలమైన భారత్ కు.. విశ్వవిజేతగా నిలవటానికి ప్రస్తుత ప్రపంచకప్ ను మించిన సువర్ణఅవకాశం మరొకటిలేదని అందరూ భావిస్తున్నారు.
టీ-20 ప్రపంచకప్ ముగిసిన కొద్దిరోజులకే భారత క్రికెట్ ప్రధానశిక్షకుడి బాధ్యతల్ని రాహుల్ ద్రావిడ్ నుంచి మరో వ్యక్తి అందుకోనున్నారు. ఇంతకూ ..ఎవరా మొనగాడు?
అన్న ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలంటే మరికొద్దివారాలపాటు వేచిచూడక తప్పదు.