ప్రపంచకప్ ఓటమితోనూ రాజకీయాలా?
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత్ లో రాజకీయాలు, రాజకీయ నాయకులు నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నారు. రాజకీయానికి కాదేదీ అనర్హమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత్ లో రాజకీయాలు, రాజకీయ నాయకులు నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నారు. రాజకీయానికి కాదేదీ అనర్హమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
భారత రాజకీయ నాయకులు భ్రష్టు పట్టిపోతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజకీయానికి కాదేదీ అనర్హమన్నట్లుగా వ్యవహరిస్తూ...నైతిక విలువల పతనాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం చివరకు క్రీడల్ని, క్రీడారులను సైతం వాడుకొంటూ పబ్బం గడుపుకొంటున్నారు.
అధికార, రాజకీయ పార్టీలు దొందూదొందే!
దేశంలో గత పదేళ్లకాలంగా అధికారాన్ని చెలాయిస్తున్న బీజెపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం దొరికిన ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ వివాదం వెంట వివాదానికి కేంద్ర బిందువుగా మారుతోంది.
చివరకు రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని క్రీడారంగాన్ని, ప్రధానంగా క్రికెట్ ను సైతం కలుషితం చేస్తోంది. దేశంలో పేరున్న క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో 'అభినందన, ఓదార్పు' వ్యూహంతో రాజకీయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.
ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ లో పాల్గొనే భారత ప్రముఖ క్రీడాకారులను వెన్నుతట్టి ప్రోత్సహించడం, ఓటమి పాలైతే ఆలింగనాలు చేసుకొంటూ ఓదార్పు రాజకీయం చేస్తూ ప్రతిపక్ష నాయకుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. చివరకు క్రీడాభిమానులు, క్రీడావిశ్లేషకులు సైతం విస్తుపోయే విధంగా వ్యవహరిస్తున్నారు.
మహిళా వస్తాదులపై తన పార్టీకే చెందిన ఓ ఎంపీ లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా వివాదం రేగితే..వస్తాదులు రోడ్డెక్కి, కోర్టు మెట్లెక్కినా నిమ్మకు నీరెత్తని ప్రధాని..ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి పొందిన భారత జట్టు సభ్యులను ఓదార్చడానికి డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్ళటం, మిగిలిన క్రికెటర్ల కంటే మైనారిటీ వర్గానికి చెందిన మహ్మద్ షమీని మాత్రమే అక్కున చేర్చుకొని, తన గుండెలపై తలపెట్టుకొని మరీ ఓదార్చిన తీరులో ఓదార్పు కంటే రాజకీయమే కొట్టొచ్చినట్లుగా కనిపించడం చర్చనీయాంశంగా, వివాదంగా మారింది.
ఎక్కడ అడుగు పెడితే అక్కడ అంతే....
తన పేరుతో వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్స్ కు ప్రధాని మోదీ హాజరయ్యారు.
అప్పటి వరకూ వరుసగా పది విజయాలు సాధించడం ద్వారా ఫైనల్లో అడుగుపెట్టిన భారత జట్టు..ప్రధాని మోదీ సమక్షంలోనే ఘోరంగా విఫలమయ్యింది. ప్రపంచకప్ ఆఖరి మెట్టుపై చతికిలపడిపోయింది. అనుకోని పరాజయం ఎదురుకావడంతో తీవ్రనిరాశ, విచారంతో నిండిపోయిన భారత క్రికెట్ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి మరీ..కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీల చేతులను తన చేతుల్లోకి తీసుకొని మరీ ప్రధాని ధైర్యవచనాలు పలికారు. ప్రపంచకప్ లో అత్యుత్తమ బౌలర్ గా నిలిచిన మహ్మద్ షమీ తలను తన గుండెలపైకి పెట్టుకొని ఓదార్చారు.
అయితే..ఇదంతా ఓ నాటకంలా భావించిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాత్రం తనదైన శైలిలో మోదీపైన విమర్శల వర్షం కురిపించారు. మంటల్లో కాలిపోతున్న మణిపూర్ వెళ్లి అక్కడి ప్రజల్ని ఓదార్చడానికి దొరకని సమయం మన గౌరవనీయ ప్రధానికి ప్రపంచకప్ ఫైనల్ చూడటానికి మాత్రం ఎలా దొరికిందంటూ దుయ్యబట్టారు.
ప్రధాని ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మమేనని, చివరకు ఆయన ప్రపంచకప్ ఫైనల్ కోసం స్టేడియానికి రావటంతో భారత జట్టు సైతం టైటిల్ పోరులో విఫలం కావాల్సి వచ్చిందంటూ రాహుల్ మండిపడ్డారు.
పాపుల కారణంగానే భారత్ ఓటమి...
దేశంలోని పాపాత్ముల కారణంగానే ప్రపంచకప్ ఫైనల్లో భారత జట్టు ఓటమి పాలుకావాల్సి వచ్చిందంటూ ప్రధాని మోదీ తమదైన శైలిలో బదులివ్వటాన్ని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుపట్టారు. ప్రధానిగా ఉన్న ఓ వ్యక్తి ఇంతగా దిగజారి మాట్లాడి భారత్ కు, ప్రధానంగా దేశంలో అత్యధిక మంది అభిమానించే క్రికెట్ కే తలవంపులు తెచ్చారంటూ దుయ్యబట్టారు.
మరోవైపు...క్రీడాకారుల విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న ప్రధాని మోదీ వ్యవహార శైలిని దేశంలోని మేధావులు, క్రీడా విమర్శకులు సైతం తప్పుపడుతున్నారు. క్రీడల్ని రాజకీయం చేయవద్దని, రాజకీయాలనే భ్రష్టుపట్టించిన నాయకులు క్రీడల్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నించవద్దంటూ వేడుకొంటున్నారు.
రాజకీయాలలో ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ 'ఓదార్పు రాజకీయం' విజయ సోపానానికి ఓ మెట్టుగా ఉపయోగపడటం వివాదాస్పదంగా తయారయ్యింది.