మనుజోడీ జోరు..విలువిద్య క్వార్టర్ ఫైనల్లో ధీరజ్, అంకిత!
పారిస్ ఒలింపిక్స్ ఏడోరోజు పోటీలలో భారత షూటర్లు, ఆర్చర్లు రాణించారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు లక్ష్యసేన్ చేరాడు.
పారిస్ ఒలింపిక్స్ ఏడోరోజు పోటీలలో భారత షూటర్లు, ఆర్చర్లు రాణించారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు లక్ష్యసేన్ చేరాడు...
పారిస్ నగరం వేదికగా 2024 ఒలింపిక్స్ శరవేగంతో సాగిపోతున్నాయి. మొదటి ఆరురోజుల పోటీలలో కేవలం షూటింగ్ ద్వారానే మూడు పతకాలు సాధించిన భారత్ ..విలువిద్య, షూటింగ్, బ్యాడ్మింటన్ అంశాలలో పతకాలకు గురి పెట్టింది. పురుషుల హాకీలో పవర్ ఫుల్ ఆస్ట్ర్రేలియాను 3-2 గోల్స్ తో భారత్ కంగు తినిపించింది.
మిక్సిడ్ టీమ్ క్వార్టర్స్ లో తెలుగుతేజం...
విలువిద్య వ్యక్తిగత పోటీలలో తీవ్రనిరాశ పరచిన భారత ఆర్చర్లు టీమ్ విభాగంలో ఏదో ఒక పతకం సాధించాలన్న పట్టుదలతో తమ పోరాటం కొనసాగిస్తున్నారు. మిక్సిడ్ టీమ్ డబుల్స్ విభాగంలో తెలుగుతేజం ధీరజ్ బొమ్మదేవర- అంకితభక్త్ లతో కూడిన భారతజట్టు అలవోకగా క్వార్టర్ ఫైనల్స్ చేరింది.
పారిస్ ఆర్చరీ ఎరీనా వేదికగా జరిగిన ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ లో ఇండోనీసియా జోడీ దయానంద్జ అరీఫ్ లపై భారత స్టార్ జోడీ 5-1 (37-36, 38-38, 38-37) తో విజయం సాధించారు.
ధీరజ్, అంకిత ఒకరికి ఒకరు తీసిపోని విధంగా టార్గెట్ చేస్తూ 9, 10 పాయింట్లతో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. పురుషుల టీమ్ డబుల్స్ లో తుదివరకూ పోరాడి ఓడిన ధీరజ్ ..మిక్సిడ్ డబుల్స్ లో మాత్రం చెలరేగిపోయాడు. స్థాయికి తగ్గట్టుగా రాణించడం ద్వారా సెమీస్ బెర్త్ కు గురిపెట్టాడు.
పిస్టల్ 25 మీటర్ల విభాగంలో మనుజోడీ దూకుడు..
10 మీటర్ల ఏర్ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ విభాగాలలో ఇప్పటికే రెండు కాంస్య పతకాలు సాధించిన స్టార్ షూటర్ మను బాకర్ మూడో పతకం కోసం ఉరకలేస్తోంది. 25 మీటర్ల ఏర్ పిస్టల్ మహిళల వ్యక్తిగత విభాగంలో పతకం వేట మొదలు పెట్టింది. 100 కు 100 పాయింట్లు సాధించడం ద్వారా మెడల్ రౌండ్ కు చేరువయ్యింది.
ఇదే విభాగంలో పోటీకి దిగిన మరో భారత షూటర్ ఈషా సింగ్ స్థాయికి తగ్గట్టుగా రాణించడంలో విఫలమయ్యింది.
క్వార్టర్ ఫైనల్లో బ్యాడ్మింటన్ యంగ్ గన్..
బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు భారత యువఆటగాడు లక్ష్యసేన్ దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో చోటు కోసం చైనీస్ తైపీ ఆటగాడు చో టీన్ చెన్ తో తలపడనున్నాడు.
ప్రీ-క్వార్టర్ ఫైనల్లో భారత్ కే చెందిన టాప్ ర్యాంక్ స్టార్ హెచ్ఎస్ ప్రణయ్ ను వరుస గేమ్ ల్లో లక్ష్యసేన్ చిత్తు చేశాడు. 22 సంవత్సరాల లక్ష్య దూకుడు ముందు ప్రణయ్ నిలువలేకపోయాడు.
తొలిగేమ్ ను 21-12తో కైవసం చేసుకొన్న లక్ష్య రెండోసెట్ ను 21-6తో గెలుచుకొన్నాడు. క్వార్టర్ ఫైనల్స్ రౌండ్లో 12వ సీడ్ చెన్ తో అన్ సీడెడ్ లక్ష్యసేన్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.
ఒలింపిక్స్ చరిత్రలో బ్యాడ్మింటన్ పురుషులసింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ చేరిన పారుపల్లి కశ్యప్, కిడాంబీ శ్రీకాంత్ ల సరసన లక్ష్య నిలువగలిగాడు.
ఆవిరైన సింధు ఆశలు..
వరుసగా మూడో ఒలింపిక్స్ లో పతకం సాధించాలన్న పీవీ సింధు ఆశలు ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ పరాజయంతో ఆవిరైపోయాయి. క్వార్టర్ ఫైనల్లో చోటు కోసం జరిగిన పోరులో చైనాకు చెందిన 6వ సీడ్ ప్లేయర్ హి బింగ్ జియావో వరుస గేమ్ ల్లో సింధును చిత్తు చేసి..గత ఒలింపిక్స్ బ్రాంజ్ మెడల్ రౌండ్ ఓటమికి బదులుతీర్చుకోగలిగింది.
2016 రియో ఒలింపిక్స్ లో రజత, 2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకాలు సాధించిన సింధు..ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో సైతం ఏదో ఒక పతకం నెగ్గడం ద్వారా..మూడు పతకాలు సాధించిన భారత తొలి అథ్లెట్ గా నిలిచిపోవాలని భావించింది. అయితే..వయసు మీద పడటం, ఆటలో వాడివేడి తగ్గిపోడం, కోర్టులో చురుకుగా కదలలేకపోడం సింధు ఓటమికి కారణమయ్యాయి.
మహిళల జూడో 78 కిలోల విభాగంలో భారత జూడోకా తుల్కా మాన్ పోటీ తొలిరౌండ్లోనే ముగిసింది. సెయిలింగ్ లోనూ భారత క్రీడాకారులు విఫలమయ్యారు. పురుషుల హాకీ గ్రూపు ఆఖరి లీగ్ పోటీలో ఆస్ట్ర్రేలియాను భారత్ 3-2 గోల్స్ తో అధిగమించింది.
భారత్ మూడు కాంస్యాలతో పతకాల పట్టిక 44వ స్థానంలో కొనసాగుతోంది.