Telugu Global
Sports

14 జట్లతో ఇక వన్డే ప్రపంచకప్!

ఐసీసీవన్డే ప్రపంచకప్ ను ఇక నుంచి 14 జట్లతో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్ణయించింది. క్రికెట్ విస్తరణ, మరింత ఆదాయం కోసం జట్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది.

14 జట్లతో ఇక వన్డే ప్రపంచకప్!
X

ఐసీసీవన్డే ప్రపంచకప్ ను ఇక నుంచి 14 జట్లతో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్ణయించింది. క్రికెట్ విస్తరణ, మరింత ఆదాయం కోసం జట్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది.

భారత్ వేదికగా కొద్దిరోజుల క్రితమే 2023-ఐసీసీవన్డే ప్రపంచకప్ సరికొత్త రికార్డులతో అత్యంత విజయవంతంగా ముగియడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి ఉబ్బితబ్బిబవుతోంది.

ఇప్పటి వరకూ కేవలం 10 జట్లతో రౌండ్ రాబిన్ లీగ్ కమ్ నాకౌట్ తరహాలో నిర్వహిస్తూ వచ్చిన టోర్నీని మరింతగా విస్తరించాలని ఐసీసీ నిర్ణయించింది.

10 జట్ల నుంచి 14 జట్లకు...

2023 వన్డే కప్ ఫైనల్ రౌండ్లో కేవలం 10 ( భారత్, ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అప్ఘనిస్థాన్ , నెదర్లాండ్స్ )జట్లకు మాత్రమే అవకాశం కల్పించారు.

ఈ 10 జట్లలో నెదర్లాండ్స్, శ్రీలంక మాత్రమే క్వాలిఫైయింగ్ టోర్నీలో పాల్గొనటం ద్వారా ఫైనల్ రౌండ్ కు చేరుకొంటే..మిగిలిన ఎనిమిదిజట్లూ తమ తమ ర్యాంకింగ్స్ ప్రాతిపదికన నేరుగా బరిలో నిలిచాయి.

అయితే..మరో నాలుగేళ్లలో దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరిగే 2027 వన్డే ప్రపంచకప్ లో మాత్రం అదనంగా నాలుగుజట్లకు అవకాశం కల్పించనున్నారు.

మరిన్నిజట్లు, మరిన్ని మ్యాచ్ లు....

ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ రౌండ్ ను రౌండ్ రాబిన్ లీగ్ కమ్ నాకౌట్ తరహాలో నిర్వహించారు. 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా ఒక్కోజట్టు కనీసం 9 మ్యాచ్ లు ఆడే విధంగా 45 మ్యాచ్ లు నిర్వహించారు. సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్ వరకూ నాకౌట్ తరహాలో మరో మూడుమ్యాచ్ లు జరిగాయి. మొత్తం 48 మ్యాచ్ లను ఆరున్నర వారాల సమయంలో ముగించగలిగారు.

2027, 2031 ప్రపంచకప్ టోర్నీలను మాత్రం 10 కి బదులుగా 14 జట్లతో నిర్వహించడానికి రంగం సిద్ధం చేశారు. జట్ల సంఖ్య 10 నుంచి 14కు పెరగడంతో మ్యాచ్ ల సంఖ్య సైతం గణనీయంగా పెరిగిపోనుంది.

1975 నుంచి 2023 వరకూ...

నాలుగున్నర దశాబ్దాల ప్రపంచకప్ చరిత్రలో..మొదటి మూడు ( 1975, 1979, 1983 ) టోర్నీలను 60 ఓవర్ల ఫార్మాట్లో కేవలం 8 జట్లతోనే నిర్వహిస్తూ వచ్చారు.

2007 ప్రపంచకప్ నాటికి జట్ల సంఖ్యను 8 నుంచి 16కు పెంచారు. ఆ తర్వాత జరిగిన 2011, 2014 టోర్నీలలో జట్ల సంఖ్యను 16 నుంచి 14కు, 2019, 2023 టోర్నీలను 10 జట్లకు కుదించి మరీ నిర్వహించారు.

అయితే..రానున్న రెండుటోర్నీలను 14జట్లకు పెంచి నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించడంతో..అసోసియేట్ దేశాలుగా ఉన్న మరో రెండుజట్లు అదనంగా ఫైనల్ రౌండ్ బెర్త్ లు పొందనున్నాయి.

2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ లో సైతం క్రికెట్ ను పతకం అంశంగా ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వన్డే ప్రపంచకప్ విస్తరణతో స్కాట్లాండ్, నేపాల్, థాయ్ లాండ్, హాంకాంగ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ,నమీబియా లాంటి చిన్నజట్లు లబ్ది పొందనున్నాయి.

ప్రపంచకప్ లో ఒక్కో మ్యాచ్ ద్వారా ఐసీసీకి 60 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల వరకూ వివిధ రూపాలలో ఆదాయం సమకూరుతోంది. ఇప్పుడు క్రికెట్ అంటే ఓ ఆట మాత్రమే కాదు..వందల, వేలకోట్ల రూపాయల వ్యాపారం.

First Published:  28 Nov 2023 8:15 AM IST
Next Story