Telugu Global
Sports

ప్రపంచకప్ నుంచి న్యూజిలాండ్ అవుట్..సూపర్-8 రౌండ్లో ఐదుజట్లు!

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లీగ్ దశలో మరో సంచలనం నమోదయ్యింది. హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటైన న్యూజిలాండ్ ఇంటిదారి పట్టింది....

ప్రపంచకప్ నుంచి న్యూజిలాండ్ అవుట్..సూపర్-8 రౌండ్లో ఐదుజట్లు!
X

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లీగ్ దశలో మరో సంచలనం నమోదయ్యింది. హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటైన న్యూజిలాండ్ ఇంటిదారి పట్టింది.

2024 టీ-20 ప్రపంచకప్ లీగ్ దశలో సంచలనాల పరంపర కొనసాగుతోంది. రెండోదశ సూపర్- 8 రౌండ్ కు ఐదుజట్లు అర్హత సాధించాయి. మాజీ చాంపియన్ శ్రీలంక, రన్నరప్ న్యూజిలాండ్ లాంటి మేటి జట్లు లీగ్ దశ నుంచే నిష్క్ర్రమించాయి.

సూపర్-8 రౌండ్ చేరిన జట్లలో దక్షిణాఫ్రికా, భారత్, ఆస్ట్ర్రేలియా, అప్ఘనిస్థాన్, వెస్టిండీస్ ఉన్నాయి. మిగిలిన మూడు బెర్త్ ల కోసం ఆసక్తికరమైన పోరు కొనసాగుతోంది.

డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, మాజీ చాంపియన్ పాకిస్థాన్ జట్ల అవకాశాలు గాల్లో దీపంలా మారాయి.

జట్ల తలరాతను మార్చేస్తున్న వరుణుడు...

అమెరికాలోని నసావు కౌంటీ, లాడర్ హిల్ కౌంటీ స్టేడియాలు వేదికగా జరుగుతున్న పోటీలలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ లాంటి జట్ల అవకాశాలను వరుణదేవుడు ప్రభావితం చేస్తున్నాడు.

ఇప్పటికే వానదెబ్బతో కీలకమ్యాచ్ లు రద్దు కావడంతో పలు జట్లు విలవిలలాడిపోతున్నాయి. హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటైన న్యూజిలాండ్ కు వానదెబ్బ గట్టిగానే తగిలింది. చివరకు గ్రూప్ లీగ్ దశ నుంచే నిష్క్ర్రమించాల్సి వచ్చింది.

మాజీ చాంపియన్ శ్రీలంక సైతం గ్రూపు లీగ్ దశలో దారుణంగా విఫలం కావడం ద్వారా ఇంటిదారి పట్టక తప్పలేదు.

ఆశల పల్లకిలో అమెరికా, పాక్...

గ్రూప్ - ఏ లీగ్ నుంచి మూడుకు మూడుమ్యాచ్ లు నెగ్గడం ద్వారా టాప్ ర్యాంకర్ భారత్ అలవోకగా సూపర్- 8 రౌండ్ చేరుకోగా..రెండోస్థానం కోసం పాకిస్థాన్, ఆతిథ్య అమెరికాజట్ల నడుమ ఆసక్తికరమైన పోరు జరుగుతోంది.

ఐర్లాండ్ తో జరిగే తమ ఆఖరి రౌండ్ పోటీలలో అమెరికా, పాకిస్థాన్ జట్లు తలపడటమే కాదు..భారీతేడాతో నెగ్గితీరాల్సి ఉంది. తొలిసారిగా టీ-20 ప్రపంచకప్ బరిలో నిలిచిన అమెరికాజట్టు..తన తొలిరౌండ్ పోరులో కెనడాను చిత్తు చేయడంతో పాటు..రెండోరౌండ్లో ప్రపంచ మాజీ చాంపియన్ పాకిస్థాన్ పై సూపర్ ఓవర్ విజయంతో 4 పాయింట్లు సాధించింది. సూపర్ - 8 రౌండ్ చేరాలంటే ఐర్లాండ్ తో జరిగే తన ఆఖరిపోరులో అమెరికా భారీతేడాతో నెగ్గితీరాల్సి ఉంది.

పాకిస్థాన్ మాత్రం..అమెరికా, భారతజట్ల చేతిలో పరాజయాలు పొంది...పసికూన కెనడాపైన చచ్చీచెడీ విజయం సాధించింది. తన ఆఖరి గ్రూప్ లీగ్ పోరులో ఐర్లాండ్ పై పాకిస్థాన్ భారీ ఆధిక్యంతో నెగ్గితీరాల్సి ఉంది.

ఐర్లాండ్ ను ఓడించగలిగితే అమెరికాజట్టు నేరుగా సూపర్ -8 రౌండ్ చేరుకోడం, పాకిస్థాన్ నిష్క్ర్రమించడం ఏకకాలంలో జరిగిపోతాయి. భారతజట్టు తన ఆఖరి గ్రూప్ లీగ్ పోటీని శనివారం కెనడాతో ఆడాల్సి ఉంది.

గ్రూప్- బీ నుంచి ఇంగ్లండ్, స్కాట్లాండ్ ల పోరు...

గ్రూప్- బీ లీగ్ నుంచి ఆస్ట్ర్రేలియా టాపర్ గా ఇప్పటికే సూపర్-8 బెర్త్ ఖాయం చేసుకోగా...రెండోబెర్త్ మాత్రం డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, పసికూన స్కాట్లాండ్ జట్లను ఊరిస్తోంది.

వానదెబ్బతో 3 పాయింట్లకే పరిమితమైన ఇంగ్లండ్...తన ఆఖరి లీగ్ మ్యాచ్ లో నెగ్గితీరాల్సి ఉండగా...ఆస్ట్ర్రేలియా చేతిలో స్కాట్లాండ్ ఓడిపోవాల్సి ఉంది. స్కాట్లాండ్ జట్టు మొదటి మూడురౌండ్ల మ్యాచ్ లు ముగిసే సమయానికి 5 పాయింట్లతో లీగ్ టేబుల్ రెండోస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్ర్రేలియా- స్కాట్లాండ్ జట్ల పోటీకి వానదెబ్బ తగలి..పాయింట్లు పంచుకోవాల్సి వస్తే..ఇంగ్లండ్ గ్రూప్ లీగ్ దశ నుంచే ఇంటిదారి పట్టే ప్రమాదం లేకపోలేదు.

నమీబియా, ఒమాన్ జట్లు ఇప్పటికే గ్రూప్- బీ నుంచి వరుస పరాజయాలతో నిష్క్ర్రమించాయి.

గ్రూప్- సీ నుంచి విండీస్, అప్ఘనిస్థాన్...

గ్రూప్ -సీ లీగ్ నుంచి ఆతిథ్య దేశాలలో ఒకటైన వెస్టిండీస్, అప్ఘనిస్థాన్ మొదటి రెండుస్థానాలలో నిలవడం ద్వారా సూపర్-8 రౌండ్ చేరుకోగా..న్యూజిలాండ్, పాపువాన్యూగినియా, ఉగాండాజట్లు విఫలమయ్యాయి.

గ్రూపు- డీ లీగ్ నుంచి దక్షిణాఫ్రికా సూపర్-8 రౌండ్ చేరగా...శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్ర్రమించింది. ఇదే గ్రూపు నుంచి రెండో బెర్త్ కోసం బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్ జట్ల నడుమ గట్టిపోటీ నెలకొని ఉంది.

తన మూడోరౌండ్ పోరులో నెదర్లాండ్స్ ను అధిగమించిన బంగ్లాదేశ్ జట్టు ఆఖరి రౌండ్ పోరులో నేపాల్ పై నెగ్గితే సూపర్- 8 బెర్త్ దక్కించుకోగలుగుతుంది.

నెదర్లాండ్స్ తన చివరి మ్యాచ్ లో శ్రీలంకతోనూ, నేపాల్ తో బంగ్లాదేశ్ తలపడాల్సి ఉంది.

మొత్తం మీద...20 జట్లు, నాలుగు గ్రూపులుగా జరుగుతున్న ప్రపంచకప్ తొలిదశ గ్రూపు లీగ్ లో పలు సంచలన విజయాలతో పాటు..వానదెబ్బ సైతం పలుజట్ల తలరాతను పూర్తిగా మార్చి వేయగలిగాయి.

First Published:  14 Jun 2024 3:00 PM IST
Next Story