Telugu Global
Sports

ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ లో భారతయువ గ్రాండ్మాస్టర్ల జోరు!

2024- ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ 8వ రౌండ్ పురుషుల విభాగంలో భారత యువగ్రాండ్మాస్టర్లు సత్తా చాటుకొన్నారు. 17ఏళ్ల భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్ సంయుక్త అగ్రస్థానంలో నిలిచాడు.

ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ లో భారతయువ గ్రాండ్మాస్టర్ల జోరు!
X

2024- ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ 8వ రౌండ్ పురుషుల విభాగంలో భారత యువగ్రాండ్మాస్టర్లు సత్తా చాటుకొన్నారు. 17ఏళ్ల భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్ సంయుక్త అగ్రస్థానంలో నిలిచాడు.

కెనడాలోని టొరాంటో వేదికగా జరుగుతున్న ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ పురుషుల విభాగంలో జోరందుకొన్న భారత్..మహిళల విభాగంలో మాత్రం వెనుకబడిపోయింది.

మొత్తం 14 రౌండ్ల ( డబుల్ రౌండ్ రాబిన్ )ఈ లీగ్ పోరు పురుషుల, మహిళల విభాగాలలో ప్రపంచ మేటి ఎనిమిదిమంది గ్రాండ్మాస్టర్లు క్యాండిడేట్స్ టైటిల్ కోసం పోటీపడుతున్నారు.

పురుషుల విభాగంలో భారత్ తరపున ముగ్గురు ( ప్రజ్ఞానంద్, గుకేశ్, విదిత్ గుజరాతీ), మహిళల విభాగంలో ఇద్దరు ( కోనేరు హంపి, వైశాలీ ) గ్రాండ్మాస్టర్లు తమ అదృష్టం పరీక్షించుకొంటున్నారు.

కలసి వచ్చిన 7, 8 రౌండ్లు...

డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ తరహాలో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఒక్కో ప్లేయర్ తమ ప్రత్యర్థులతో రెండేసిమార్లు తలపడాల్సి ఉంది. మొత్తం 14 రౌండ్లలో మొదటి 8 రౌండ్ల మ్యాచ్ లు ముగిసే సమయానికి రష్యాకు చెందిన ప్రపంచ మేటి గ్రాండ్ మాస్టర్ ఇయాన్ నెపిమోనిచ్, భారత కుర్ర గ్రాండ్మాస్టర్ గుకేశ్ చెరో 5 పాయింట్లు చొప్పున సాధించి సంయుక్త అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

భారత మరో యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద్ 4 పాయింట్లతో సంయుక్త ద్వితీయస్థానంలో నిలిచాడు. కీలక 8వ రౌండ్ పోరులో గుకేశ్ తన దేశానికే చెందిన గ్రాండ్మాస్టర్ విదిత్ గుజరాతీని ఓడించడం ద్వారా పుంజుకోగలిగాడు. మొదటి 8 రౌండ్లలో గుకేశ్ ఒకే ఒక్క ఓటమితో ఉన్నాడు.

హాట్ ఫేవరెట్ ఇయాన్ నెపిమోనిచ్ సైతం 5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగగలుగుతున్నాడు.

గ్రాండ్మాస్టర్ నిజత్ అబసోవ్ తో జరిగిన 8వ రౌండ్ పోరును నెపిమోనిచ్ డ్రాగా ముగించడం ద్వారా పాయింట్లు పంచుకొన్నాడు. విదిత్ సంతోశ్ గుజరాతీ 4 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. అలీరెజా 7, నిజత్ అబసోవ్ 8 స్థానాలలో ఉన్నారు.

ప్రజ్ఞానంద్ ను నిలువరించిన అలీరెజా..

మరో 8వ రౌండ్ పోరులో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద్ దూకుడును ఫ్రెంచ్ గ్రాండ్మాస్టర్ అలీరెజా ఫిరోజ్ సమర్థవంతంగా అడ్డుకొని పోరును డ్రాగా ముగించగలిగాడు.

ప్రపంచ రెండోర్యాంక్ ప్లేయర్ ఫేబియానో కరూనాపై 3వ ర్యాంకర్ హికారు నగమురా సంచలన విజయం సాధించాడు.

మహిళల విభాగంలో వైశాలీ చేసిన తప్పిదాలను సద్వినియోగం చేసుకొన్న కోనేరు హంపి విజేతగా నిలిస్తే..హాట్ ఫేవరెట్ డాన్ జోంగ్యీ పై చైనాకే చెందిన లీ టింగ్ జీ సంచలన విజయం సాధించింది.

ఇతర పోటీలను కాథరీనా లాగ్నో- అలెగ్జాండ్రా గోర్యచికినా, నూర్గల్ సాలిమోవ్- అన్నా ముజిచుక్ డ్రాగా ముగించుకోగలిగారు. భారత మహిళా గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి 7, వైశాలీ 8 స్థానాలలో ఉన్నారు.

మొత్తం 14 రౌండ్లలో అత్యధిక పాయింట్లు సాధించడం ద్వారా విజేతగా నిలిచిన గ్రాండ్మాస్టర్.. ప్రపంచ టైటిల్ కోసం చైనాకు చెందిన డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లీరెన్ తో తలపడటానికి అర్హత దక్కించుకోగలుగుతారు. చివరి ఆరురౌండ్లు గ్రాండ్మాస్టర్ల సత్తాకు అసలు సిసలు పరీక్షకానున్నాయి.

మహిళల విభాగంలో సైతం చైనాకే చెందిన జు వెన్జున్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఉంది.

ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ చరిత్రలో భారత్ కు చెందిన ఐదుగురు గ్రాండ్మాస్టర్లు పురుషుల, మహిళల విభాగాలలో తలపడటం ఇదే మొదటిసారి.

First Published:  14 April 2024 4:28 PM IST
Next Story