2023 లో మెరిసిన భారత క్రీడారంగం...!
స్వాతంత్ర్య భారత క్రీడాచరిత్రలో గత ఏడాదికాలం అత్యంత విజయవంతమైన సంవత్సరంగా నిలిచిపోతుంది. జాతీయ క్రీడ హాకీ, అనధికారిక జాతీయ క్రీడ క్రికెట్, బ్యాడ్మింటన్, చదరంగం, అథ్లెటిక్స్ అంశాలతో పాటు ఆసియాక్రీడల్లో భారత్ అత్యంత అరుదైన, పలు అపురూప విజయాలు సాధించింది...
స్వాతంత్ర్య భారత క్రీడాచరిత్రలో గత ఏడాదికాలం అత్యంత విజయవంతమైన సంవత్సరంగా నిలిచిపోతుంది. జాతీయ క్రీడ హాకీ, అనధికారిక జాతీయ క్రీడ క్రికెట్, బ్యాడ్మింటన్, చదరంగం, అథ్లెటిక్స్ అంశాలతో పాటు ఆసియాక్రీడల్లో భారత్ అత్యంత అరుదైన, పలు అపురూప విజయాలు సాధించింది...
రంగం ఏదైనా సంవత్సరాలు వస్తూ పోతూ ఉంటాయి. అయితే..సుదీర్ఘకాలం గుర్తుండిపోయే సంవత్సరాలు మాత్రం అత్యంత అరుదుగా ఉంటాయి. క్రీడాపరంగా చూస్తే గత ఏడాదికాలం భారత్ కు అత్యంత విజయవంతమైన సంవత్సరంగా మిగిలిపోతుంది.
జాతీయక్రీడ హాకీ నుంచి అనధికారిక జాతీయక్రీడ క్రికెట్ వరకూ, మేధో క్రీడ చదరంగం నుంచి బహుముఖ క్రీడల కామన్వెల్త్ గేమ్స్, ఆసియాక్రీడల్లోనూ భారత్ అద్భుతంగా రాణించింది. అబ్బురపరచే విజయాలు, అసాధారణ రికార్డులు నెలకొల్పింది.
హాకీలో కళ్ళు చెదిరే విజయాలు...
హాకీ పురుషుల, మహిళల విభాగాలలో భారతజట్లు అత్యంత నిలకడగా రాణించాయి. ప్రపంచ హాకీ ర్యాంకింగ్స్ లో తమ స్థానాలను గతంలో ఎన్నడూలేని విధంగా మెరుగు పరచుకోగలిగాయి.
పురుషుల విభాగంలో ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ తో పాటు..ఆసియాక్రీడల బంగారు పతకాన్ని సైతం భారత్ సాధించగలిగింది.
చైనాలోని హాంగ్జు వేదికగా జరిగిన ఆసియాక్రీడల హాకీ ఫైనల్లో భారత్ 5-1 గోల్సుతో జపాన్ ను చిత్తు చేయడం ద్వారా నాలుగోసారి ఆసియాక్రీడల విజేతగా నిలువగలిగింది. 2014 ఆసియాక్రీడల తరువాత తొలిసారిగా స్వర్ణవిజేత కాగలిగింది.
గత దశాబ్దకాలంలో ఎన్నడూలేని విధంగా భారత పురుషులజట్టు ప్రపంచ హాకీ ర్యాంకింగ్స్ లో 3వ స్థానానికి చేరుకొంది.
మహిళల విభాగంలో సైతం భారత్ 6వ ర్యాంక్ కు చేరుకోడం ద్వారా సంచలనం సృష్టించింది. భారతహాకీజట్లు అత్యుత్తమంగా రాణించిన సంవత్సరంగా 2023 గుర్తుండిపోతుంది.
క్రికెట్లో ఆకాశమే హద్దుగా.....
ప్రపంచంలోనే అత్యధికమంది క్రికెట్ అభిమానులున్న ఏకైక దేశం భారత్. శతకోటి భారత క్రీడాభిమానులకు క్రికెట్ పిచ్చి అంతాఇంతాకాదు. ప్రపంచ క్రికెట్ కే తలమానికంగా, ప్రధానకేంద్రంగా ఓ వెలుగు వెలుగుతున్న భారత క్రికెట్ బోర్డు కృషితో పురుషుల, మహిళల విభాగాలలో భారతజట్లు ఆకాశమే హద్దుగా విజయాలు సాధిస్తూ తమ ఆధిక్యతను కొనసాగించగలుగుతున్నాయి.పురుషుల క్రికెట్ మూడు ( టెస్టులు, వన్డే, టీ-20 ) విభాగాలలోనూ భారతజట్లే ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో కొనసాగుతున్నాయి.
భారత్ వేదికగా..అత్యంత విజయవంతంగా ముగిసిన 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పది వరుస విజయాలతో భారత్ రికార్డుల మోత మోగించినా, అభిమానుల హృదయాలను గెలుచుకొన్నా రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
2023 సీజన్లో అత్యధికంగా 27 వన్డే విజయాలు సాధించిన ఏకైకజట్టుగా భారత్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పింది. వన్డే క్రికెట్లో విరాట్, రోహిత్, టీ-20 ఫార్మాట్లో సూర్యకుమార్ యాదవ్ రికార్డుల మోత మోగించారు.
దక్షిణాఫ్రికా గడ్డపై ప్రస్తుత 2023-24 సిరీస్ ల్లో టీ-20 పోరులో 1-1తో సమఉజ్జీగా నిలిచిన భారత్..వన్డే సిరీస్ ను 2-1తో కైవసం చేసుకొంది. రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో సైతం నెగ్గడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాలన్న పట్టుదలతో రోహిత్ శర్మ నాయకత్వంలోని జట్టు పోటీకి సిద్ధమయ్యింది.
మహిళల విభాగంలో సైతం భారతజట్టు సత్తా చాటుకోగలుగుతుంది. ముంబైలోని నవీముంబై వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన ఏకైక టెస్టుమ్యాచ్ లో భారత్ 347 పరుగుల అతిపెద్ద విజయం నమోదు చేసింది.
భారత మహిళా క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా నిర్వహించిన మహిళా ఐపీఎల్ ట్రోఫీని హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ కైవసం చేసుకొంది.
దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 2023 అండర్ -19 ప్రపంచ మహిళా క్రికెట్ ట్రోఫీని షెఫాలీ వర్మ కెప్టెన్సీలోని భారతజట్టు గెలుచుకొంది.
ఒకే ఒక్కడు నీరజ్ చోప్రా....
ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో ఒకటైన పురుషుల జావలిన్ త్రోలో భారత బాహుబలి నీరజ్ చోప్రా తిరుగులేని విజయాల పరంపర కొనసాగుతోంది. ఆసియాక్రీడల నుంచి ప్రపంచ పోటీల వరకూ కచ్చితంగా భారత్ కు బంగారు పతకం సాధించిపెట్టగల మొనగాడిగా, ఒకే ఒక్కడిగా నీరజ్ చోప్రా నిలిచాడు.
ప్రపంచ అథ్లెటిక్స్ లో 88.17 మీటర్ల రికార్డుతో బంగారు పతకం సాధించడం ద్వారా ప్రపంచ అథ్లెటిక్స్ స్వర్ణ విజేతగా నిలిచిన భారత తొలి, ఏకైక అథ్లెట్ గా నీరజ్ చోప్రా రికార్డుల్లో చేరాడు.
బ్యాంకాక్ వేదికగా ముగిసిన 2023 ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ లో భారత బృందం గతంలో ఎన్నడూలేని విధంగా 6 స్వర్ణాలతో సహా 16 పతకాలతో జపాన్, చైనా తర్వాతి స్థానంలో నిలిచింది.
హంగెరీలోని బుడాపెస్ట్ వేదికగా ముగిసిన 2023 ప్రపంచ అథ్లెటిక్స్ మీట్ లో నీరజ్ చోప్రా బంగారు పతకంతో భారత మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడిస్తే...పురుషుల 4x400 మీటర్ల రిలే విభాగంలో భారతజట్టు ఫైనల్స్ కు అర్హత సాధించడమే కాదు..5వ స్థానంలో నిలవడం ద్వారా దేశానికే గర్వకారణంగా నిలిచింది.
హాంగ్జు వేదికగా...ఏడాది ఆల్యసంగా జరిగిన 2022 ఆసియా క్రీడల్లో భారత్ తొలిసారిగా వందకు పైగా పతకాలతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. 28 స్వర్ణ, 38 రజత, 41 కాంస్యాలతో సహా మొత్తం 107 పతకాలతో పతకాలపట్టిక నాలుగోస్థానంలో నిలిచింది.
కేవలం ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలోనే భారత అథ్లెట్లు 6 స్వర్ణ, 14 రజత, 9 కాంస్యాలతో సహా 29 పతకాలతో సరికొత్త రికార్డు నెలకొల్పింది.
బ్యాడ్మింటన్లో డబుల్స్ థమాకా!
పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ లో భారతజోడీ సాయి సాత్విక్- చిరాగ్ షెట్టి తమ జైత్రయాత్రను కొనసాగించి అత్యుత్తమంగా ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను అందుకోగలిగారు. ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీలో బంగారు పతకం సాధించిన భారతజంటగా చరిత్ర సృష్టించారు.
స్వర్ణపతకం పోరులో మలేసియాజోడీ ఆంగ్ ఇ సిన్ -తే ఇ పై 16-21, 21-17, 21-19తో నెగ్గడం ద్వారా ఈ ఘనత సాధించిన భారత తొలిజంటగా చరిత్ర సృష్టించారు.
భారత అత్యున్నత క్రీడాపురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అందుకోడానికి సిద్ధమయ్యారు.
చదరంగంలో.. అహో! అక్క, భలే తమ్ముడు...
మేధో క్రీడ చదరంగంలో తమిళనాడులోని తెలుగు సంతతికి చెందిన గ్రాండ్ మాస్టర్లు వైశాలి, ప్రజ్ఞానంద్ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచ చదరంగ చరిత్రలోనే గ్రాండ్ మాస్టర్ల హోదా సాధించిన అక్క, తమ్ముడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు.
చెస్ ప్రపంచకప్ ఫైనల్లో సూపర్ గ్రాండ్ మాస్టర్ మాగ్నుస్ కార్ల్ సన్ తో ప్రజ్ఞానంద్ పోరాడి ఓడి రజత పతకంతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అజర్ బైజాన్ రాజధాని బకు వేదికగా జరిగిన టైటిల్ పోరులో 18 సంవత్సరాల ప్రఙ్జానంద్ పోరాడి ఓడిన తీరు ఓ అపురూప ఘట్టంగా మిగిలిపోతుంది.
2024లో జరిగే ప్రపంచ క్యాండిడేట్స్ టోర్నీకి సైతం ప్రజ్ఞానంద్ అర్హత సంపాదించగలిగాడు.
భారత క్రీడాకారులు ఇదేజోరును వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ లో సైతం కొనసాగించగలిగితే....కేంద్ర క్రీడావిధానం, క్రీడాపథకాలకు సార్థకత చేకూరినట్లే అవుతుంది.