పారిస్ ఒలింపిక్స్ కు భారత రిలే జట్ల అర్హత!
పారిస్ ఒలింపిక్స్ కు భారత పురుషుల, మహిళల జట్లు అర్హత సాధించాయి.4x400 రిలే అంశంలో భారతజట్లు తలపడనున్నాయి.
పారిస్ ఒలింపిక్స్ కు భారత పురుషుల, మహిళల జట్లు అర్హత సాధించాయి.4x400 రిలే అంశంలో భారతజట్లు తలపడనున్నాయి.
2024-ఒలింపిక్స్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతున్నకొద్దీ అర్హత సాధించిన భారత అథ్లెట్ల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే వివిధ క్రీడాంశాలలో పాల్గొనటానికి టీమ్, వ్యక్తిగత విభాగాలలో కలిపి 70 మందికి పైగా అథ్లెట్లు అర్హత సంపాదించారు. ఆ జాబితాలో పురుషుల, మహిళల 4x400 రిలేజట్లు సైతం వచ్చి చేరాయి.
ప్రపంచ రిలే పోటీల రెండోస్థానంలో భారత్...
బహామాస్ వేదికగా జరిగిన 2024- ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీల పురుషుల, మహిళల విభాగం పోటీలలో భారతజట్లు రెండోస్థానంలో నిలవడం విశేషం.
మహిళల రిలే బరిలోకి రూపాల్ చౌదరి, పూవమ్మ, జ్యోతిక శ్రీ దండి, శుభా వెంకటేశన్ లతోకూడిన భారతజట్టు 3 నిముషాల 29.35 సెకన్ల టైమింగ్ తో జమైకా తరువాతి స్థానంలో నిలవడం ద్వారా పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకోగలిగింది. అగ్రస్థానంలో నిలిచిన జమైకాజట్టు 3 నిముషాల 28.54 సెకన్ల టైమింగ్ తో హీట్స్ లో టాపర్ గా నిలిచింది.
ఆదివారం జరిగిన క్వాలిఫైయింగ్ తొలిరౌండ్ పోటీలలో 5వ స్థానం మాత్రమే సాధించిన భారత మహిళల జట్లు రెండోరౌండ్ అర్హత రేస్ లో పుంజుకోగలిగింది.
పురుషుల విభాగం తొలిరౌండ్లో భారత రన్నర్ రాజేశ్ రమేశ్ గాయంతో రేస్ నుంచి అర్ధంతరంగా వైదొలగడంతో భారతజట్టు పూర్తి చేయలేకపోయింది.
పురుషుల రిలేలో హోరాహోరీ...
పురుషుల 4x400 మీటర్ల రిలే బరిలోకి మహ్మద్ అనాస్ యాహ్యా, మహ్మద్ అజ్మల్, అరోకియా రాజీవ్, అమోజ్ జాకోబ్ లతో కూడిన భారతజట్టు 3 నిముషాల 3.23 సెకన్ల టైమింగ్ తో అమెరికా తరువాతి స్థానంలో నిలవడం ద్వారా పారిస్ ఒలింపిక్స్ అర్హత ను సొంతం చేసుకొంది.
పవర్ ఫుల్ అమెరికా రిలే జట్టు 2 నిముషాల 59. 95 సెకన్ల టైమింగ్ తో అగ్రస్థానం సాధించింది. పారిస్ ఒలింపిక్స్ జులై 26న మొదలై ఆగస్టు 11న ముగియనున్నాయి.
ట్రాక్ అండ్ ఫీల్డ్ లో 19 మంది అథ్లెట్లకు అర్హత...
పారిస్ ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో భారత్ కు చెందిన 19 మంది పురుషుల, మహిళల అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ లను సంపాదించగలిగారు. భారత బృందానికి ప్రపంచ, ఒలింపిక్స్ చాంపియన్ నీరజ్ చోప్రా నాయకత్వం వహించనున్నాడు.
పురుషుల జావలిన్ త్రోలో భారత్ కు నీరజ్ చోప్రా మరోసారి కచ్చితంగా బంగారు పతకం సాధించి పెట్టగలడని భావిస్తున్నారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలు ఆగస్టు 1 నుంచి ప్రారిస్ క్రీడల ప్రధాన స్టేడియంలో ప్రారంభంకానున్నాయి.
పురుషుల హాకీ, పురుషుల, మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్ విభాగాలలో సైతం భారతజట్లు పోటీకి దిగనున్నాయి. బ్యాడ్మింటన్లో పీవీ సింధుతో సహా మొత్తం ఏడుగురు భారత క్రీడాకారులు అర్హత సంపాదించారు.
మహిళల కుస్తీలో వినేశ్ పోగట్ తో సహా ఇప్పటి వరకూ ముగ్గురు వస్తాదులు మాత్రమే ఒలింపిక్స్ బెర్త్ లు సంపాదించారు.