Telugu Global
Sports

ప్రపంచకప్ లో నేడు భారత్ తో అమెరికా ఢీ!

2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో నేడు ఓ ఆసక్తికరమైన పోరుకు న్యూయార్క్ లో రంగం సిద్ధమయ్యింది. రాత్రి 8 గంటలకు ఈ పోటీ ప్రారంభంకానుంది.

ప్రపంచకప్ లో నేడు భారత్ తో అమెరికా ఢీ!
X

2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో నేడు ఓ ఆసక్తికరమైన పోరుకు న్యూయార్క్ లో రంగం సిద్ధమయ్యింది. రాత్రి 8 గంటలకు ఈ పోటీ ప్రారంభంకానుంది.

అమెరికా గడ్డపై మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఐసీసీ- టీ-20 ప్రపంచకప్ గ్రూప్ -ఏ లీగ్ లో రెండు అజేయజట్ల నడుమ ఈరోజు జరిగే పోరు ఎనలేని ఆసక్తిని రేపుతోంది.

న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగే ఈ మూడోరౌండ్ పోరులో టీ-20 శిఖరం భారత్ ను పసికూన, ఆతిథ్య అమెరికా ఢీకోనుంది.

విజయాల హ్యాట్రిక్ కు రోహిత్ సేన తహతహ...

కెనడా, ఐర్లాండ్,పాక్, భారత్, అమెరికాజట్లతో కూడిన గ్రూప్- ఏ లీగ్ మొదటి రెండురౌండ్లలో విజయాలు సాధించిన భారత్, అమెరికాజట్లు..వరుసగా మూడో గెలుపు కోసం ఎదురుచూస్తున్నాయి.

కెనడా, పాకిస్థాన్ జట్లను ఓడించడం ద్వారా అమెరికా 4 పాయింట్లతో లీగ్ టేబుల్ రెండోస్థానంలో నిలిస్తే..టాప్ ర్యాంకర్ భారత్ తన ప్రారంభరౌండ్లలో ఐర్లాండ్, పాకిస్థాన్ జట్లను అధిగమించడం ద్వారా 4 పాయింట్లు సాధించినా మెరుగైన రన్ రేట్ తో లీగ్ టేబుల్ అగ్రస్థానంలో నిలిచింది.

భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 8 గంటలకు జరిగే ఈ మూడోరౌండ్ పోరులో నెగ్గినజట్టే నేరుగా సూపర్ - 8 రౌండ్లో తన బెర్త్ ఖాయం చేసుకొన్న తొలిజట్టుగా నిలువగలుగుతుంది.

తుదిజట్టులో శివం దూబేకి చోటు దక్కేనా?

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు ఎలాంటి మార్పులు లేని తుదిజట్టుతోనే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. అయితే..మొదటి రెండుమ్యాచ్ ల్లో విఫలమైన పేస్ ఆల్ రౌండర్ శివం దూబే స్ధానంలో యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ లేదా..చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను తీసుకొనే అవకాశాలు లేకపోలేదు.

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ సైతం మొదటి రెండుమ్యాచ్ ల్లో స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయినా..పసికూన అమెరికా పైన భారీస్కోరు సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

భారత టాపార్డర్ లో రిషభ్ పంత్ మినహా మిగిలిన బ్యాటర్లంతా అంతంత మాత్రంగానే రాణిస్తున్నా రెండుకు రెండు విజయాలు సాధించడం విశేషం. మిస్టర్ -360హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ సైతం తనదైన శైలిలో బ్యాట్ ఝుళిపించడం ద్వారా భారీస్కోరుకు ఎదురుచూస్తున్నాడు.

160 స్కోరు సాధించినజట్టుకే విజయావకాశం...

న్యూయార్క్ స్టేడియంలోని ' డ్రాప్ -ఇన్- పిచ్ ' పైన ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ ల్లో భారీస్కోర్లు కనాకష్టమైపోతున్నాయి. బ్యాటింగ్ కు అంతగా అనువుకాని ఈ పిచ్ పైన పేస్ బౌలర్లు మ్యాచ్ విన్నర్లుగా నిలుస్తూ వస్తున్నారు.

భారతజట్టు నలుగురు పేసర్లు ( బుమ్రా, అర్షదీప్, సిరాజ్, హార్థిక్ పాండ్యా ), ఇద్దరు స్పిన్నర్లు ( జడేజా, అక్షర్ పటేల్ ) వ్యూహంతోనే అమెరికా పని పట్టడానికి సిద్ధమయ్యింది. భారత్ ముందుగా బ్యాటింగ్ కు దిగితే 160కి పైగా స్కోరు సాధించగలిగితేనే సంచలనాల అమెరికాకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది.

అమెరికాతో డేంజర్....

1965లో అమెరికా క్రికెట్ సంఘం ఏర్పాటైతే...చెప్పుకోదగిన జట్టును ఇప్పటికి గాను సమకూర్చుకోగలిగింది. భారత్ లో జన్మించిన వికెట్ కీపర్ బ్యాటర్ మోనాంక్ పటేల్ నాయకత్వంలోని అమెరికాజట్టులోని ఐదుగురు కీలక ఆటగాళ్లు భారత్ లో జన్మించినవారే కావడం విశేషం.

కెప్టెన్ మోనాంక్, నితీశ్ కుమార్, హర్మీత్ సింగ్, జస్దీప్ సింగ్, కెంజిగీ, సౌరబ్ నేత్రవల్కర్, అలీఖాన్ మొదటి రెండురౌండ్లలో అమెరికాజట్టు విజయాలలో కీలకపాత్ర పోషించారు.

భారత మిడిలార్డర్లో నలుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉండడంతో...లెఫ్టామ్ స్పిన్ జోడీ హర్మీత్ సింగ్, నోస్తుష్ కెంజిగీలతో అమెరికా సవాలు విసరాలని భావిస్తోంది.

లెఫ్టామ్ పేసర్ సౌరబ్ నేత్రవల్కర్ కీలకపాత్ర పోషించనున్నాడు.

అమెరికాను పసికూన జట్టని భారత్ భావిస్తే కష్టాలు ఎదుర్కొనక తప్పదు. ముందుగా బ్యాటింగ్ దిగిన సమయంలో 150 పరుగుల స్కోర్లు సాధించిన సమయంలో నాలుగుసార్లు విజేతగా నిలువగలిగింది.

టాస్ కీలకమే......

న్యూయార్క్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ ల్లో టాస్ నెగ్గినజట్లు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోడం, చేజింగ్ వైపు మొగ్గుచూపడం సాధారణ విషయంగా మారింది. అయితే..భారత్ మాత్రం ఐర్లాండ్ తో జరిగిన తొలిరౌండ్ మ్యాచ్ లో భారత్ టాస్ నెగ్గి 8 వికెట్ల విజయం సాధించింది.పాక్ తో జరిగిన రెండోరౌండ్ మ్యాచ్ లో భారత్ టాస్ ఓడినా 6 పరుగులతో విజేతగా నిలువగిలిగింది.

అయితే...పసికూన అమెరికాతో జరిగే మూడోరౌండ్ పోరులో మాత్రం భారత్..టాస్ నెగ్గితే ముందుగా ఫీల్డింగ్ వైపే మొగ్గుచూపడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ మూడోరౌండ్ పోరులో భారత్ అలవోక విజయం సాధిస్తుందా? లేక పసికూన అమెరికా నుంచి గట్టిపోటీ ఎదుర్కోనుందా? ..తెలుసుకోవాలంటే ఈరోజు రాత్రి వరకూ వేచిచూడక తప్పదు.

First Published:  12 Jun 2024 7:56 AM IST
Next Story