Telugu Global
Sports

నేడే ప్రపంచకప్ ఫైనల్స్...భారత్ ను ఊరిస్తున్న టైటిల్!

ధూమ్ ధామ్ టీ-20 ప్రపంచకప్ ను రెండోసారి గెలుచుకోడానికి భారత్ తహతహలాడుతోంది. ఈ రోజు జరిగే టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాతో రోహిత్ సేన ఢీ కొనబోతోంది.

నేడే ప్రపంచకప్ ఫైనల్స్...భారత్ ను ఊరిస్తున్న టైటిల్!
X

ధూమ్ ధామ్ టీ-20 ప్రపంచకప్ ను రెండోసారి గెలుచుకోడానికి భారత్ తహతహలాడుతోంది. ఈ రోజు జరిగే టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాతో రోహిత్ సేన ఢీ కొనబోతోంది.

అమెరికా, కరీబియన్ ద్వీపాల సంయుక్త ఆతిథ్యంలో గత కొద్దివారాలుగా సాగుతూ వస్తున్న 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ క్లయ్ మాక్స్ దశకు చేరింది.

20 జట్లు, 55 మ్యాచ్ ల ఈ ప్రపంచకప్ సమరం ఆఖరి అంకానికి బార్బెడాస్ లోని బ్రిడ్జ్ టౌన్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా ఈ రోజురాత్రి ( భారత కాలమానం ప్రకారం ) 8 గంటలకు ప్రారంభమయ్యే టైటిల్ పోరులో ప్రపంచ నంబర్ వన్, టాప్ ర్యాంకర్ భారత్ తో ..తొలిసారిగా ఫైనల్స్ చేరిన దక్షిణాఫ్రికా తలపడబోతోంది.

తొలిసారిగా రెండుఅజేయజట్ల నడుమ....

2007 లో ప్రారంభమైన టీ-20 ప్రపంచకప్ చరిత్రలో లీగ్ దశ నుంచి సెమీస్ వరకూ అజేయంగా నిలిచిన రెండుజట్లు ఫైనల్స్ లో పోటీపడుతున్నాయి. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు గ్రూప్ లీగ్ దశ నుంచి సెమీఫైనల్స్ నాకౌట్ వరకూ ఆడిన ఏడుకు ఏడుమ్యాచ్ ల్లోనూ విజేతగా నిలిస్తే..ఎడెన్ మర్కరమ్ కెప్టెన్సీలోని సఫారీజట్టు సైతం నూటికి నూరుశాతం విజయాలతో టైటిల్ రౌండ్లో అడుగుపెట్టింది.

మూడో ఫైనల్లో రెండోటైటిల్ కు భారత్ గురి...

రోహిత్ శర్మ నాయకత్వంలో గత ఏడాది కాలంలో వరుసగా మూడో ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్స్ చేరిన భారత్..మూడో ప్రయత్నంలోనైనా విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది. ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్ తో పాటు ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ టోర్నీలలో రన్నరప్ స్థానాలు మాత్రమే సాధించిన భారత్..ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ ఫైనల్లో మాత్రం నెగ్గితీరాలన్న పట్టుదలతో ఉంది.

2007 ప్రారంభ టీ-20 ప్రపంచకప్ లో ధోనీ నాయకత్వంలో విజేతగా నిలిచిన భారత్..2014 టోర్నీ ఫైనల్స్ చేరినా రన్నరప్ గా మిగిలిపోవాల్సి వచ్చింది. ఆలోటును ప్రస్తుత ప్రపంచకప్ లో పూడ్చుకోడానికి భారత్ సర్వశక్తులూ కూడదీసుకొని పోటీకి సిద్ధమయ్యింది.

2013 చాంపియన్స్ ట్రోఫీ తరువాత నుంచి మరో ఐసీసీ టైటిల్ నెగ్గడంలో విఫలమైన భారత్ ...2024లో మరో టైటిల్ అందుకోవాలన్న పట్టుదలతో ఉంది.

ఆ నలుగురికి ఇదే ఆఖరి చాన్స్...

తమ కెరియర్ లో టీ-20 ప్రపంచకప్ లో ఆఖరిసారి భారతజట్టు సభ్యులుగా బరిలోకి దిగుతున్న దిగ్గజఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, రవీంద్ర జడేజా, జస్ ప్రీత్ బుమ్రా..ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదన్న లక్ష్యంతో అత్యుత్తమంగా రాణించడానికి ఉరకలేస్తున్నారు. ప్రపంచకప్ విజయంతోనే తమ టీ-20 ప్రపంచకప్ టోర్నీల యాత్రకు ముగింపు పలకాలన్న పట్టుదలతో ఉన్నారు.

గత ఆరుమాసాలలో భారత్ ను రెండో ప్రపంచకప్ ఫైనల్స్ చేర్చిన కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇటు బ్యాటర్ గానూ, అటు నిస్వార్థనాయకుడిగానూ జట్టును ముందుండి నడిపిస్తూ స్ఫూర్తిని నింపుతున్నాడు.

గెలుపు గుర్రాలతోనే రెండుజట్ల పోరు..

ఓ ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్లో ఢీ కొనడం భారత్, దక్షిణాఫ్రికాజట్లకు ఇదే మొదటిసారి. రెండుజట్లూ తుదిజట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలో నిలవనున్నాయి.

ప్రపంచ మేటి టీ-20 బ్యాటర్లు, బౌలర్లు, స్పిన్నర్లు..రెండుజట్లలోనూ సభ్యులుగా ఉండడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.

భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ మినహా మిగిలిన స్టార్లు నిలకడగా రాణించలేకపోయినా ఫైనల్స్ వరకూ రాగలిగారు. అంతేకాదు..స్టార్ బ్యాటర్ విరాట్ ఇప్పటి వరకూ ఆడిన 7 గేమ్ ల్లో 75 పరుగులు మాత్రమే చేయడం ద్వారా వెనుకబడి పోయాడు. అయితే..ఈ టైటిల్ సమరంలో అత్యుత్తమంగా, స్థాయికి తగ్గట్టుగా రాణించడం ద్వారా తనపై నమ్మకం ఉంచిన టీమ్ మేనేజ్ మెంట్ రుణం తీర్చుకోవాలని భావిస్తున్నాడు.

ప్రధానంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ 7 మ్యాచ్ ల్లో 196 పరుగులు సాధించడం ద్వారా 39.20 సగటు, 159.34 స్ట్ర్రయిక్ రేటుతో నిలిచాడు. మూడు హాఫ్ సెంచరీలతో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సైతం సాధించాడు.

పవర్ ప్లే ఓవర్లలో భారతజోడీ ఎంతజోరుగా ఆడుతుందని, ఎన్ని పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగలదన్నది కీలకం కానుంది. భారత స్పిన్ త్రయంతో పాటు..

పేస్ త్రయం ( బుమ్రా, అర్షదీప్, హార్థిక్ పాండ్యా ) కూడా మ్యాచ్ తుది ఫలితానని నిర్దేశించనుంది.

భారత పేస్ బౌలింగ్ కు వెన్నెముకలాంటి యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా 7 మ్యాచ్ ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. 4.08 ఎకానమీతో 8.54 సగటు నమోదు చేశాడు.

ఓపెనింగ్ బౌలర్ అర్షదీప్ సింగ్ 15 వికెట్లతో టాపర్ గా నిలిచాడు. 11.86 సగటు, 7.41 ఎకానమీ నమోదు చేశాడు.

సఫారీలతో డేంజర్,యమడేంజర్..

మర్కరమ్ సారథ్యంలోని దక్షిణాఫ్రికాజట్టును తక్కువగా అంచనా వేస్తే అంతకుమించిన పొరపాటు మరొకటి లేదు. క్వింటన్ డి కాక్, హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ లాంటి ప్రపంచ మేటి హిట్టర్లతో పాటు రబడ, నోర్కే, మార్కో జాన్సన్ లాంటి ఫాస్ట్ బౌలర్ల బలం సఫారీజట్టుకు ఉంది. తమదైనరోజున ప్రత్యర్థిజట్టును చీల్చిచెండాడే సత్తా ఆ జట్టుకు పుష్కలంగా ఉంది. స్పిన్ జోడీ తబ్రీజ్ షంషీ, కేశవ్ మహారాజ్ సైతం భారత బ్యాటర్ల సత్తాకు సవాలు కానున్నారు.

సమఉజ్జీలుగా భారత్, దక్షిణాఫ్రికా..

టీ-20 ఫార్మాట్లో రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే దాదాపుగా సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. మొత్తం 26సార్లు తలపడితే భారత్ 14, దక్షిణాఫ్రికా 12 విజయాలతో ఉన్నాయి. 2022 నుంచి తలపడిన మ్యాచ్ ల్లో రెండుజట్లూ చెరో 5 విజయాలతో సమఉజ్జీలుగా నిలిచాయి. టీ-20 ప్రపంచకప్ లో మాత్రం దక్షిణాఫ్రికాతో 6సార్లు తలపడిన భారత్ 4 విజయాలతో పైచేయి సాధించింది. ప్రపంచకప్ టైటిల్ పోరులో ఈ రెండుజట్లూ ఢీకోనుండడం ఇదే మొదటిసారి.

చేజింగ్ జట్లకే విజయావకాశం...

మ్యాచ్ కు వేదికగా ఉన్న కెన్సింగ్టన్ ఓవల్ కు ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత భీభత్సమైన ఫాస్ట్, బౌన్సీ పిచ్ గా పేరుండేది. అయితే...గత కొద్ది సంవత్సరాలుగా వికెట్లో వేగం తగ్గి బ్యాటింగ్ కు అనువుగా తయారయ్యింది.

స్పిన్నర్ల కంటే పేసర్లకే ఎక్కువ అనుకూలంగా ఉండే ఈ స్టేడియంలో టాస్ నెగ్గిన జట్టు ముందుగా ఫీల్డింగ్ కు దిగడం, చేజింగ్ వైపే మొగ్గు చూపడం ఆనవాయితీగా వస్తోంది.

ప్రస్తుత టోర్నీలో ఇదే పిచ్ పైన ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 150 పరుగుల స్కోరు మాత్రమే చేయగలిగింది. చేజింగ్ కు దిగిన జట్ల సగటు స్కోరు 5 వికెట్లకు 134 పరుగులుగా మాత్రమే ఉంది. అత్యల్పస్కోరు 109 పరుగులుగా ఉంది.

టాస్ నెగ్గినజట్ల సక్సెస్ శాతం 42.9గా ఉంటే..టాస్ ఓడినజట్లు 58 శాతం సక్సెస్ ను రుచిచూడగలిగాయి. ఇదే పిచ్ పైన పడిన వికెట్లలో 70 శాతం పేస్ కమ్ స్వింగ్ బౌలర్లకు మాత్రమే దక్కాయి.

మ్యాచ్ జరిగే సమయంలో 70 శాతం చిరుజల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకవేళ వానదెబ్బతో ఆట జరుగకపోతో రిజర్వ్ డే నాడు నిర్వహించే అవకాశం సైతం ఉంది.

భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈపోరులో భారత్ విజేతగా నిలవాలని, రెండోసారి టీ-20 ప్రపంచకప్ విజేతగా నిలవాలని కోట్లాదిమంది భారత అభిమానులు కోరుకొంటున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మాత్రం మరికొద్దిగంటలపాటు సస్పెన్స్ భరించక తప్పదు.

First Published:  29 Jun 2024 10:13 AM IST
Next Story