Telugu Global
Sports

భారత్- పాక్ ప్రపంచకప్ టికెట్ ధర 9 లక్షల రూపాయలు!

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మ్యాచ్ ల టికెట్ల ధరలు నింగినంటాయి. భారత కరెన్సీలో 9 లక్షల రూపాయల ధర పలుకుతోంది.

భారత్- పాక్ ప్రపంచకప్ టికెట్ ధర 9 లక్షల రూపాయలు!
X

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మ్యాచ్ ల టికెట్ల ధరలు నింగినంటాయి. భారత కరెన్సీలో 9 లక్షల రూపాయల ధర పలుకుతోంది.

అమెరికా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న 2024 టీ-20 ప్రపంచకప్ ను ఐసీసీ పూర్తిస్థాయిలో సొమ్ము చేసుకొంటోంది. అమెరికాలోని భారత్, పాక్ సంతతి క్రికెట్ అభిమానుల పిచ్చిని లక్షల రూపాయలుగా మలచుకొంటోంది.

న్యూయార్క్ లో జూన్ 9న చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్థాన్ జట్ల నడుమ సూపర్ బౌల్ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్ ప్రీమియం క్లాస్ టికెట్ ధర పన్నులతో కలుపుకొని 9 లక్షల రూపాయలకు చేరింది.

బార్బడోస్ టూర్ ఖర్చే తక్కువ...

న్యూయార్క్ వేదికగా భారత్- పాక్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ను చూడటానికి అయ్యే ఖర్చులో నాలుగోవంతు మొత్తంతో..పొరుగునే ఉన్న బార్బడోస్ కు నలుగురు సభ్యుల కుటుంబం వెళ్లి..ఆస్ట్ర్రేలియా- ఇంగ్లండ్ జట్ల నడుమ జరిగే ప్రపంచకప్ మ్యాచ్ ను చూసి రావచ్చని చెబుతున్నారు.

న్యూయార్క్ నుంచి బార్బడోస్ కు నేరుగా విమానంలో వెళ్లి, నాలుగు నక్షత్రాల హోటెల్ లో బస చేయటంతో పాటు ప్రపంచకప్ మ్యాచ్ చూసి రావటానికి 2 లక్షల 70వేల రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని టూరిజం వర్గాలు అంటున్నాయి.

భారత్- పాక్ జట్ల లీగ్ దశ మ్యాచ్ డైమండ్ క్లబ్ ధర టికెట్ ను 10 వేల డాలర్లుగా నిర్ణయించారు. వివిధ పన్నులతో కలుపుకొని భారత కరెన్సీలో అది 9 లక్షల రూపాయలకు సమానమని అంటున్నారు.

డైమండ్ క్లబ్, పెవీలియన్ క్లబ్ పేరుతో విక్రయించిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి.

రీ-సేల్ మార్కెట్లో మరింత ధర....

భారత్- పాక్ జట్ల మ్యాచ్ టికెట్ల ధర అమెరికా రీ-సేల్ మార్కెట్లో చుక్కలంటింది. అధికారికంగా కనీస టికెట్ ధరను 6 డాలర్లు ( 497 రూపాయలు), ప్రీమియం టికెట్ల ధరను 400 డాలర్లు ( 33వేల 148 రూపాయలు), డైమండ్ క్లబ్ టికెట్ ధరను 10 వేల డాలర్లుగా గా ఐసీసీ నిర్ణయించింది. అయితే..గతంలోనే ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన వ్యక్తులు తమ టికెట్లను రీసేల్ మార్కెట్లో స్టబ్ హబ్, సీట్ గీక్ వేదికల ద్వారా కళ్లు చెదిరే ధరకు విక్రయించారు. 400 డాలర్ల ధర 40వేల డాలర్లకు ( 33 లక్షల రూపాయల) చేరింది.

ఈ టికెట్ల ధరకు ఫ్లాట్ ఫామ్ ఫీజును కలుపుకొంటే 50 వేల డాలర్లు ( 41 లక్షల రూపాయలు) అవుతుందని రీసేల్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

సూపర్ బౌల్ లో ' సూపర్ 'ధరలు !

న్యూయార్క్ లోని విశ్వవిఖ్యాత సూపర్ బౌల్ స్టేడియం వేదికగా గతంలో జరిగిన ఎన్ బిఏ మ్యాచ్ ల సూపర్ బౌల్-58 టికెట్ ధర 9వేల డాలర్లు, కోర్ట్ సైడ్ సీట్ల ధర 24వేల డాలర్లు మాత్రమే కాగా...ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ టికెట్ ధర 40వేల డాలర్లు పలకడాన్ని సరికొత్త రికార్డుగా చెబుతున్నారు.

సీట్ గీక్ వేదికగా ఇప్పటికే 1,75, 000 డాలర్లు ( కోటి 40 లక్షల రూపాయల ) విలువైన టికెట్లు విక్రయించినట్లు అమెరికా టుడే వివరించింది. ఈ మొత్తానికి ఫ్లాట్ ఫామ్ ఫీజును కలుపుకొంటే కోటి 86 లక్షల రూపాయలు అవుతుందని అధికారికంగా ప్రకటించారు.

భారత్- పాక్ జట్ల మ్యాచ్ మినహా..మిగిలినజట్ల మధ్య జరిగే మ్యాచ్ టికెట్లకు గిరాకీ అంతంత మాత్రంగానే ఉండటం విశేషం. భారత ఉపఖండం దాటినా..చివరకూ అమెరికా గడ్డపైన సైతం దాయాదిజట్ల వైరాన్ని ఐసీసీతో పాటు..అమెరికా రీసేల్ మార్కెట్ సైతం సొమ్ము చేసుకోవాలనుకోడం విడ్డూరం కాక మరేమిటి. వ్యాపారానికి కాదేదీ అనర్హమనటానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు.

First Published:  3 Jun 2024 10:00 AM GMT
Next Story