Telugu Global
Sports

దాయాదుల సమరంలోని ఆ మజాయే వేరు!

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో దాయాదిజట్లు భారత్, పాక్ తలపడుతున్నాయంటే చాలు..అభిమానుల ఉత్సాహానికి, ఉద్వేగానికి హద్దులే ఉండవు.

దాయాదుల సమరంలోని ఆ మజాయే వేరు!
X

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో దాయాదిజట్లు భారత్, పాక్ తలపడుతున్నాయంటే చాలు..అభిమానుల ఉత్సాహానికి, ఉద్వేగానికి హద్దులే ఉండవు.

2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ గ్రూప్- ఏ లీగ్ సూపర్ సండే ఫైట్ కి న్యూయార్క్ నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. మరోవైపు..న్యూయార్క్, దాని చుట్టుపక్కల ప్రాంతాలలోని భారత, పాక్ సంతతి అభిమానులు ఈ దాయాదుల పోరు కోసం డాలర్లు కుమ్మరిస్తూ ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

2007 నుంచి 2022 వరకూ....

భారత ఉపఖండ అగ్రశ్రేణిజట్ల క్రికెట్ సమరాన్ని దాయాదులు పోరుగా పరిగణిస్తూ వస్తున్నారు. ఈ రెండుజట్లూ ప్రత్యర్థులుగా బరిలో నిలిచాయంటే చాలు..140 కోట్ల జనాభా కలిగిన భారత్ లో మాత్రమే కాదు..20 కోట్ల వరకూ జనాభాకలిగిన పాకిస్థాన్ లో సైతం ఏదో తెలియని ఉద్వేగం, మాటల్లో వర్ణించలేని ఉత్కంఠ కనిపిస్తాయి. క్రికెట్లో మాత్రమే కాదు..హాకీలో సైతం ఈ రెండుజట్లూ తలపడుతున్నాయంటే చాలు..అదే పరిస్థితి మనకు కనిపిస్తుంది.

అయితే...2007 ప్రారంభ టీ-20 ప్రపంచకప్ నుంచి 2022 లో జరిగిన 8వ టీ-20 ప్రపంచకప్ వరకూ రెండుజట్లూ చెరోసారి విజేతగా నిలువగలిగాయి. రెండోసారి చాంపియన్ గా నిలవడానికి తహతహలాడుతునాయి.

భారత గడ్డపై జరిగే ఐపీఎల్ ద్వారా ఎందరో ఆటగాళ్లు వెలుగులోకి వస్తుంటే..పాకిస్థాన్ వేదికగా జరిగే టీ-20 ప్రీమియర్ లీగ్ ద్వారా ఆ దేశ ఆటగాళ్లు రాటు దేలుతున్నారు.

భారత్ తో తలపడిన ప్రతిసారి పాక్ జట్టుతో పాటు అభిమానులు సైతం ఓ యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తారు.

హోరాహోరీ పోరు..భారత్ దే జోరు!

దక్షిణాఫ్రికా వేదికగా 2007లో జరిగిన ప్రారంభ ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ఫైనల్లో ఈ రెండుదాయాది జట్లే తలపడ్డాయి. ఆఖరి ఓవర్ వరకూ నువ్వానేనా అన్నట్లుగా..ఎడతెగని అత్కంఠతో సాగిన టైటిల్ పోరులో చివరకు ధోనీ నాయకత్వంలోని భారతజట్టే విశ్వవిజేతగా నిలిచింది. ఆ తర్వాత జరిగిన మరో 7 ప్రపంచకప్ టోర్నీ మ్యాచ్ ల్లో సైతం భారత ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది.

డర్బన్ వేదికగా జరిగిన 2007 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లో పాక్ పై భారతజట్టు బౌలౌట్ విజయం సాధించింది. అంతేకాదు..జోహెన్స్ బర్గ్ స్టేడియంలో జరిగిన టైటిల్ సమరంలో భారత్ 5 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది.

కొలంబో వేదికగా జరిగిన 2012 ప్రపంచకప్ పోరులో సైతం భారత్ 8 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసింది. ఢాకా వేదికగా జరిగిన 2014 టీ-20 ప్రపంచకప్ లో సైతం భారత దూకుడే కొనసాగింది. భారత్ 7 వికెట్లతో అలవోక విజయం నమోదు చేసింది.

2016 ప్రపంచకప్ లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పోరులో భారత్ 6 వికెట్లతో పాక్ పై విజేతగా నిలిచింది.

2021 ప్రపంచకప్ లో భారత్ కు షాక్...

దుబాయ్ వేదికగా జరిగిన 2021 ప్రపంచకప్ లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. భారత్ తో జరిగిన పోరులో పాకిస్థాన్ తొలిసారిగా అతిపెద్ద విజయం నమోదు చేసింది.

10 వికెట్లతో భారత్ ను పాక్ చిత్తు చేసింది. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.

2022 ప్రపంచకప్ లో దెబ్బకు దెబ్బ!

2022 ప్రపంచకప్ లీగ్ లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరిగిన సూపర్ డూపర్ ఫైట్ లో భారత్ 4 వికెట్లతో పాక్ పై సంచలన విజయం సాధించింది. భారత స్టార్ బ్యాటర్ విాట్ కొహ్లీ తన టీ-20 ప్రపంచకప్ కెరియర్ లోనే ఓ అత్యుత్తమ ఇన్నింగ్స్ తో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.

ప్రస్తుత 2024 టీ-20 ప్రపంచకప్ లో మాత్రం ఈ రెండుజట్లూ...బ్యాటింగ్ కు అంత అనువుగాలేని న్యూయార్క్ డ్రాబ్ -ఇన్- పిచ్ వేదికగా ఢీ కొనబోతున్నాయి.

గ్రూప్ -ఏ లీగ్ ప్రారంభమ్యాచ్ లో భారత్ 8 వికెట్లతో ఐర్లాండ్ ను చిత్తు చేస్తే..పాక్ జట్టు తన ప్రారంభమ్యాచ్ లో ఆతిథ్య అమెరికా చేతిలో సూపర్ ఓవర్ ఓటమి చవిచూసింది.

భారత్ తో జరిగే పోరులో పాక్ జట్టు తీవ్రఒత్తిడి నడుమ పోటీకి దిగనుంది. భారత్ చేతిలో సైతం ఓడితే..పాక్ జట్టు సూపర్ -8 రౌండ్ చేరుకోడం కష్టమవుతుంది.

First Published:  8 Jun 2024 2:54 PM GMT
Next Story